Special vehicles
-
యూపీఐతో ‘చెల్లింపు’.. ప్రత్యేక వాహనాల్లో తరలింపు!
‘‘హలో.. మన నియోజకవర్గ ఓటర్ల కోసం బస్సులు, జీపులు సిద్ధం చేశాం. ఆరాంఘర్ కూడలికి వస్తే రెడీగా ఉంటాయి. వచ్చేయండి, అక్కడే మీకు ఓటు డబ్బులు చెల్లిస్తాం!’’.. ‘‘మీ ఎకౌంట్‌కు గూగుల్ పే నుంచి డబ్బులు పంపాం. ముట్టినయా చూసి ఓకే మెసేజ్ పెట్టండి..’’ సాక్షి, హైదరాబాద్: మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం రాత్రిదాకా ఇదే తీరు. హైదరాబాద్‌లో, వివిధ పట్టణాల్లో ఉంటున్న తమ నియోజకవర్గ ఓటర్లను తరలించేందుకు ఆయా పార్టీ ల అభ్యర్థులు ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు ఇవి. రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు చెందిన లక్షల మంది ఓటర్లు గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ కనిపిస్తుండటంతో అభ్యర్థులు ఈ ఓటర్లపై దృష్టిపెట్టారు. తమ నియోజకవర్గ ఓటర్లందరినీ రప్పించుకుని, తమకే ఓటు వేసేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఓట్ల కోసం యూపీఐ ద్వారా డబ్బులు జమ చేయడంతోపాటు స్వస్థలాలకు రవాణా సదుపాయాన్నీ ఏర్పాటు చేశారు. కొందరు అభ్యర్థులు మొత్తం సొమ్ము ముందే ట్రాన్స్ఫర్ చేయగా, మరికొందరు కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చి, ఓటు వేయటానికి వచ్చి నప్పుడు మిగతా సొమ్ము ఇస్తామని చెప్తున్నట్టు తెలిసింది. అభ్యర్థుల అనుచరులు, స్థానిక నేతలు దీనంతటినీ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఓటర్లను తరలించుకుపోయేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో వాహనాలను ఏర్పాటు చేశారు. కొందరు ఆర్టీ సీ, ప్రైవేటు బస్సులనూ బుక్ చేసినట్టు తెలిసింది. చాలా వరకు మినీ వ్యాన్లు, కార్లను సిద్ధం చేశారు. దావత్ ఇచ్చి.. స్లిప్పులు పంచి..! కొందరు అభ్యర్థులు హైదరాబాద్ నుంచి తమ ఓటర్లను తరలించడానికి ముందు మంగళవారం రాత్రే శివారు ప్రాంతాల్లోని ఫంక్షన్ హాళ్లలో దావత్‌లు ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఓటర్లను దావత్‌కు రప్పించి.. లిక్కర్, మాంసాహార భోజనం పెట్టారని సమాచారం. ఈ సమయంలో కొందరు నేరుగా ఓటర్లకే డబ్బులు ఇవ్వగా, మరికొందరు స్లిప్పులు రాసిచ్చి , సొంతూరికి వెళ్లాక ఓటేసే ముందు అది ఇచ్చి డబ్బులు తీసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. బస్టాండ్లలో విపరీతమైన రద్దీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నగరం నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ సొంతూర్లకు తరలివెళ్లారు. దీంతో బస్టాండ్లు, ఎల్బీనగర్, ఉప్పల్ కూడలి, ఆరాంఘర్ వంటి ప్రాంతాలు కిటకిటలాడాయి. దీనితో ఆర్టీసీ సుమారు 1,500కుపైగా అదనపు బస్సులను సిద్ధం చేసి ఆయా రూట్లకు నడిపింది. మరోవైపు భారీ సంఖ్యలో ప్రైవేటు వాహనాలు కూడా ప్రయాణికులను తరలించాయి. -
అమెరికా కంటే మిన్నగా.. దేశ రక్షణకు భారత నేవీ కీలక అడుగులు
సాక్షి, విశాఖపట్నం: ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దేశ రక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్న భారత నౌకాదళం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తోంది. అండర్ వాటర్ డొమైన్ అవేర్‌నెస్‌లో పూర్తి పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మానవ రహిత సాంకేతికత, వ్యవస్థల సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు చర్యలు చేపట్టింది. డీఆర్డీవో సాయంతో సముద్ర గర్భంలోనూ పహారా కాసే మానవ రహిత వాహనాలను తన అమ్ములపొదిలో చేర్చుకునేందుకు సన్నద్ధమవుతోంది. డీఆర్డీవో తయారు చేసిన మానవ రహిత విమాన ప్రయోగాలు ఇటీవలే విజయవంతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే అన్మ్యాన్డ్ పవర్‌ను మరింత పెంపొందించే దిశగా భారత రక్షణ దళం సిద్ధమైంది. నీటి అంతర్భాగంలో కూడా దూసుకెళ్లే మానవ రహిత వాహనాలు తయారు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కేవలం నిఘాకు మాత్రమే కాకుండా యుద్ధ సమయంలోనూ సత్తా చాటే విధంగా డిజైన్ చేస్తున్నారు. అమెరికా కంటే మిన్నగా.. ఇప్పటికే అమెరికా నౌకాదళం రిమోట్‌తో నడిచే మానవ రహిత అండర్ వాటర్ వెహికల్స్‌ను రూపొందించి అగ్రస్థానంలో నిలిచింది. దానికంటే మిన్నగా వాహనాలను తయారు చేసేందుకు భారత్ ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం ఉన్న టార్పెడో ట్యూబ్ సముద్ర గర్భంలో 2 రోజుల పాటు, హెవీ వెయిట్ ట్యూబ్ 3 నుంచి 4 రోజుల పాటు ఉండగలవు. కానీ త్వరలో అభివృద్ధి చేయనున్న అటానమస్ అన్మ్యాన్డ్ వెహికల్స్(ఏయూవీ) కనీసం 15 రోజుల పాటు సముద్ర గర్భంలో ఉండి పహారా కాయగలవు. ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థ అదమ్య, అమోఘ్ పేరుతో ఏయూవీలను తయారు చేసి విజయవంతంగా పరీక్షించింది. ఈ నేపథ్యంలో డీఆర్డీవో తయారు చేసిన అండర్ వాటర్ లాంచ్డ్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి.. కీలక కార్యకలాపాలకు ఉపయోగించాలని నిర్ణయించారు. మజ్గావ్ డాక్‌యార్డ్ లిమిటెడ్‌లో దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయి. తొలి దశలో జలాంతర్గాముల పర్యవేక్షణ కోసం, తర్వాత శత్రు సబ్మెరైన్ల రాకను పసిగట్టేలా, తుది దశలో సైనిక దాడులకు కూడా ఈ మానవ రహిత సముద్రగర్భ వాహనాలు ఉపయోగపడేలా తీర్చిదిద్దనున్నారు. -
దివ్యాంగులకు ‘ప్రత్యేకం’
సాక్షి, అమరావతి: సమాజంలో దివ్యాంగులకు మిగతా వారితో సమానావకాశాలు కల్పించడంలో భాగంగా వారికి ప్రత్యేక వాహనాలను ఉచితంగా సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి విద్య, ఉపాధికి దోహదపడేలా రూపొందించిన ఈ వాహనాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవీ అర్హతలు ► వార్షికాదాయం మూడు లక్షల్లోపు కలిగి, 18 – 45 మధ్య వయసు ఉండాలి. 70 శాతం, ఆ పైగా వైకల్యం ఉండాలి. గ్రాడ్యుయేషన్, ఆ పై చదువులు చదివే విద్యార్థులు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో సహా స్వయం ఉపాధి లేదా పదో తరగతి ఉత్తీర్ణతతో కనీసం ఏడాది నుంచి పని చేస్తున్న దివ్యాంగులకు వీటి ని ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. లేదా ప్రత్యేక వాహనం పొందడానికి ఎంపికైన దివ్యాంగులు రెండు నెలల్లోగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. ► జిల్లా యూనిట్‌గా అర్హులైన వికలాంగులను జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీ ఎంపిక చేస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు. తొలుత వికలాంగులైన మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత పురుషులను ఎంపిక చేస్తారు. అర్హులైన దివ్యాంగులు ఏ జిల్లా నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. -
పల్లెకు తరలిన పట్నం!
సాక్షి, హైదరాబాద్: పల్లెల్లో ఓట్ల పండుగకు పట్నంవాసులు భారీగా తరలివెళ్లారు. నగరం, జిల్లా కేంద్రాలు, ఆయా పట్టణాల నుంచి భారీగా వాహనాలు రోడ్డు మీదకు రావడంతో రద్దీ నెలకొంది. తెలంగాణలోని అన్ని టోల్గేట్ల వద్ద వాహనాలు భారీగా బారులుతీరాయి. వరుస సెలవులు కావడంతో కొందరు ముందే వెళ్లినప్పటికీ, శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున బయల్దేరారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, ప్రైవేటు ట్రావెల్స్‌తోపాటు సొంతవాహనాలు కూడా రోడ్డు మీదకు వచ్చాయి. స్పందించిన ఈసీ.. నిజామాబాద్, బెంగళూరు, విజయవాడ, వరంగల్ వెళ్లే జాతీయ రహదారులు ఉన్నాయి. వీటిలో మొత్తం 13 టోల్గేట్లు ఉన్నాయి. కరీంనగర్ రాజీవ్ రహదారిపై 3, నార్కట్‌పల్లి– గుంటూరు మధ్యలో మరో 2 టోల్గేట్లు ఉన్నాయి. వరుస సెలవులు రావడంతో నగరం నుంచి జిల్లాలకు వాహనాలు పోటెత్తాయి. ఉదయం 9 నుంచి 11 గంటలకల్లా టోల్గేట్ల వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. విషయం ఎన్నికల సంఘానికి చేరడంతో సీఈవో రజత్‌కుమార్ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని ఆదేశించారు. వెంటనే జోషి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ఇండియా(ఎన్హెచ్ఏఐ) అధికారులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన ఎన్హెచ్ఏఐ అధికారులు టోల్గేట్ల వద్ద రద్దీని నియంత్రించారు. ఎలాంటి ట్రాఫిక్ జామ్‌లు లేకుండా చేశారు. ఆర్టీసీలో ఎడతెగని రద్దీ.. ప్రజలు ఓట్లేసేందుకు భారీగా సొంతూళ్లకు కదలడంతో ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ బస్టాండ్లు కిటకిటలాడాయి. గురువారం అర్ధరాత్రి మొదలైన రద్దీ శుక్రవారం ఉదయం 11 గంటల వరకు కొనసాగడం గమనార్హం. గురువారంరాత్రి ఎక్కువగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ వైపు అధికంగా ప్రజలు తరలివెళ్లారు. దీంతో జేబీఎస్ రద్దీతో కిటకిటలాడింది. తెల్లవారుజామున బస్సులులేవని కొందరు ఆందోళనకు దిగారు. శుక్రవారం మాత్రం వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండకు అధికంగా ప్రయాణించినట్లు తెలిపారు. వెంటనే అధికారులు బస్సులు వేయడంతో ప్రయాణికులు శాంతించారు. పోలింగ్ సమయాల్లో ఈ స్థాయిలో ప్రజలు ప్రయాణాలు చేయడం గతంలో ఎన్నడూ చూడలేదని అధికారులు వ్యాఖ్యానించారు. గురు, శుక్రవారాల్లో ప్రత్యేకంగా 1,200 బస్సులు నడిపామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఎన్నికల సంఘానికి దాదాపు 2,000 బస్సుల వరకు పంపారు. రోజూ బస్సుల్లో 98 లక్షల మంది ప్రయాణం సాగిస్తారు. గురువారం అదనంగా 80,000 మంది ప్రయాణించారని అధికారులు తెలిపారు. వరుస సెలవుల నేపథ్యంలో శుక్రవారం తిరుగు ప్రయాణంలో ఇదే రద్దీ కొనసాగకపోవడం గమనార్హం. ఒకరోజు ఆదాయం రూ.12 కోట్లు కాగా, గురు, శుక్రవారాల్లో దాదాపు రూ.కోటి వరకు అదనంగా వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంటికి వెళ్లాలన్న నగరవాసుల అవసరాన్ని ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకున్నాయి. కిక్కిరిసిన రైళ్లు! తెలంగాణలో వివిధ జిల్లాలకు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి ఉదయంపూట బయల్దేరిన రైళ్లు కిటకిటలాడాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి ప్రత్యేక రైళ్లు వేయకపోవడంతో గురువారంరాత్రి, శుక్రవారం ఉదయం రైళ్లు రద్దీగా కిటకిటలాడాయి. చార్జీలు పంచిన నేతలు, ప్రత్యేక వాహనాలు హైదరాబాద్, జిల్లాల నుంచి సొంతూళ్లకు వచ్చిన వాళ్లందరికీ నేతలు బస్‌చార్జీలు పంచారు. మరికొందరు అల్వాల్, బాలానగర్, ఉప్పల్, రాజేంద్రనగర్ నుంచి తమ నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ మేరకు చాలా ముందస్తుగా, పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన నేతలు ప్రజలను సొంతూళ్లకు తరలించారు. -
ఇక పోలీస్ అంబులెన్స్!
డెడ్‌బాడీస్ తరలింపునకు ప్రత్యేక వాహనాలు నగరంలో 14 శాతం తగ్గిన నేరాలు రోడ్డు ప్రమాదాల్లో సైతం తగ్గుదల కల్తీ దందాలు నిర్వహించే వారిపై పీడీ యాక్ట్ వార్షిక సమావేశంలో వెల్లడించిన సిటీ కొత్వాల్ సిటీబ్యూరో: ప్రజల సహకారం, పోలీసులు తీసుకున్న చర్యలు, టెక్నాలజీ వినియోగం, అమలులోకి వస్తున్న కమ్యూనిటీ సీసీ కెమెరా వ్యవస్థ... వెరసి గత ఏడాదితో పోలిస్తే నగరంలో నేరాలు 14 శాతం తగ్గాయని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. కొన్ని రకాలైన వాటిలో మాత్రం స్వల్పంగా పెరుగుదల కనిపించిదని పేర్కొన్నారు. 2015కు సంబంధించి వార్షిక వివరాలు వెల్లడించేందుకు సోమవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్వాల్ నేరాల నమోదు తీరుతెన్నుల నివేదికల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కొత్వాల్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘సొత్తు సంబంధం నేరాల్లో ప్రజలు కోల్పోతున్న సొత్తులో 42 శాతం తగ్గుదల కనిపించింది. ఈ తరహా నేరాలు కూడా 2014తో పోలిస్తే 16 శాతం తగ్గాయి. గడిచిన రెండు నెలల నుంచి స్నాచింగ్ కేసుల్ని సైతం దోపిడీ దొంగతనంగా నమోదు చేసున్నాం. ఈ నేపథ్యంలోనే ఆ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. మొత్తమ్మీద చైన్‌స్నాచింగ్ నేరాలు గత ఏడాదితో పోలిస్తే సగానికి సగం తగ్గాయి. స్నాచింగ్ నేరుగా దోపిడీ కేసుగా నమోదు చేయడం తగదంటూ ఇటీవల బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆ విధానానికి తాత్కాలికంగా బ్రేక్ వేసి, ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నాం’ అని అన్నారు. మృతదేహాల కోసం పోలీసు అంబులెన్స్‌లు... గత ఏడాదితో పోలిస్తే రోడ్యాక్సిడెంట్స్ సంఖ్య కూడా తగ్గిందని కమిషనర్ తెలిపారు. నగరంలో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా ప్రజలు, పోలీసులు ‘108’కు సమాచారం ఇస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకుంటున్న ఈ వాహనాలు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. మృతి చెందిన వారిని మార్చురీకి తీసుకువెళ్ళడానికి ససేమిరా అంటున్నారు. దీంతో పోలీసులు అనేక రకాలుగా ఈ డెడ్‌బాడీస్‌ని తరలించాల్సి వస్తోంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కొత్వాల్ మహేందర్‌రెడ్డి ఈ తరహా మృతదేహాల తరలింపు కోసం పోలీసు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాథమికంగా రెండింటిని ఖరీదు చేసి అందుబాటులోకి తీసుకువస్తారు. ఆపై నగర వ్యాప్తంగా ఎన్ని అవసరమో నిర్థారించి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. నగర పోలీసు విభాగంలో 33 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నా...అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారని తెలిపిన కమిషనర్ తొలి విడతలో 3 వేలు, రెండో విడతలో మిగతావి భర్తీ చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని వివరించారు. కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా నగర వ్యాప్తంగా ఇప్పటికే 10 వేల కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ జరుగుతోందని, లక్ష కెమెరాల లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు ప్రతి పోలీసుస్టేషన్‌ను ఓ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా మార్చనున్నామని ఆయన తెలిపారు. పోలీసు పనితీరు మెరుగుదల కోసం నిరంతరం అంతర్గత శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని కొత్వాల్ పేర్కొన్నారు. నగరంలో పెరిగిపోయిన కల్తీ దందాకు అడ్డుకట్టవేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని, పదేపదే ఈ తరహా నేరాలు చేస్తూ చిక్కిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు. పోలీసుల పని కత్తిమీద సాము... పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదని కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలతో ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. పోలీసు విధి నిర్వహణలో ఆరోపణలు, కొన్ని అపశృతులు సహజమన్న ఆయన సాధ్యమైనంత వరకు వీటికి తావు లేకుండా ప్రయత్నిస్తున్నామని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజలు సైతం పోలీసు విధివిధానాలను, చట్టం అమలు చేస్తున్న తీరును అర్థం చేసుకుని మెలగాలని, మారేడ్‌పల్లి తరహాలో పోలీసుస్టేషన్లపై దాడులు వంటివి చేయడం తగదని హితవుపలికారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అంతర్గత పాలనలోనూ టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతామని మహేందర్‌రెడ్డి చెప్పారు. కొత్త హంగులతో రూపుదిద్దుకున్న నగర పోలీసు అధికారిక వెబ్సైట్ వెర్షన్‌ను మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో 2013లో 18,126 కేసులు నమోదు కాగా 2014లో ఈ సంఖ్య 21,285గా, ఈ ఏడాది 18,379గా ఉంది. నగర పోలీసు విభాగానికి కేటాయించిన పోస్టులు 14,716. ప్రస్తుతం 9821 మంది అందుబాటులో ఉండగా 4895 పోస్టులు (33 శాతం) ఖాళీగా ఉన్నాయి.నగర పోలీసు విభాగానికి కేటాయించిన పోస్టులు 14,716. ప్రస్తుతం 9821 మంది అందుబాటులో ఉండగా 4895 పోస్టులు (33 శాతం) ఖాళీగా ఉన్నాయి. -
రాజధాని శంకుస్థాపన సభకు 3000 బస్సులు!
ఉద్దండరాయునిపాలెంలో ఈ నెల 22న జరగనున్న రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి మొత్తం మూడు వేల బస్సులు.. మరో మూడు వేల వరకు కార్లు.. ఇవి కాకుండా ప్రత్యేకంగా కాన్వాయ్ కోసం 300 కార్లు, గన్నవరం నుంచి వీఐపీల వినియోగం కోసం 200 ప్రత్యేక వాహనాలు, 10 వోల్వో బస్సులు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అవసరమైతే వాహనాల సంఖ్య పెంచాలని భావిస్తోంది. ప్రైవేట్ వాహనాలకు నామమాత్రపు ధర చెల్లించి వినియోగించాలని నిర్ణయించింది. సభకు దూర ప్రాంతాల నుంచి హాజరయ్యే వారందరికీ రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. దీంతో వాహనాలు సమకూర్చే బాధ్యతను రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు అప్పగించారు. దీన్నంతటినీ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు పర్యవేక్షించనున్నారు. ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన ప్రాంగణంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే కీలక పనులు ముగింపు దశకు చేరాయి. వేదిక ముస్తాబు, ప్రత్యేక అలంకరణ పనులు మరో రెండు రోజుల్లో మొదలుకానున్నాయి. నేడు రవాణా శాఖ ఉన్నతాధికారుల సమావేశం... ఈనెల 22న తుళ్ళూరు మండలం ఉద్దండరాయుని పాలెం గ్రామంలో నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం, బహిరంగ సభ జరగనుంది. దేశ ప్రధాని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభకు హాజరయ్యే వారి కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లా నుంచి 1000 బస్సులు మరో 500 కార్లు సమకూర్చాలని ఆదేశాలు అందాయి. అలాగే కృష్ణా జిల్లా నుంచి కూడా వెయ్యి వరకు బస్సులు మరో 300 కార్లు జనసమీకరణ కోసం కేటాయించాలని ఆదేశాలు అందాయి. అలాగే రాష్ట్రంలోని మిగిలిన 11 జిల్లాల నుంచి మరో వెయ్యి బస్సులు, వందల సంఖ్యలో వాహనాలను సమకూర్చనున్నారు. దీనిపై శనివారం రవాణా శాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. ఈ రెండు జిల్లాల నుంచే భారీగా జనసమీకరణ చేయనున్నారు. రెండు జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల బస్సులు, వివిధ ప్రైవేట్ స్కూల్ బస్సులను పూర్తి స్థాయిలో తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే మరో 500 వరకు ఆర్టీసీ బస్సులను కూడా రిజర్వ్‌లో ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. షెడ్లు ఏర్పాటు.. ఇప్పటికే సభా ప్రాంగణంలో షెడ్ల నిర్మాణం పూర్తయింది. దాదాపు 12 లక్షల అడగుల మేర షామియానాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధాన వేదిక నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సభకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక వెనుక భాగంలో ప్రధాన మంత్రి కోసం రెండు హెలిప్యాడ్లు నిర్మించనున్నారు. సభకు హాజరయ్యే 30 వేల మంది రైతులకు వేదిక ముందు భాగంలో ప్రత్యేక గ్యాలరీ నిర్మిస్తున్నారు. కేటగిరీల వారీగా 18 నుంచి పాస్‌లు పంపిణీ చేయనున్నారు. 300 మంది వాలంటీర్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం శుక్ర వారంతో ముగిసింది. వస్త్రాల అందజేత ... రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర మంత్రులు సంప్రదాయ రీతిలో వస్త్రాలు, స్వీట్ బాక్స్, ఆహ్వానపత్రాలు అందజేసే కార్యక్రమం మండలంలోని నేలపాడు గ్రామంలో ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ, ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌లు కలసి వచ్చి కొమ్మినేని ఆదిలక్ష్మి అనే మహిళకు వాటిని అందజేశారు.