ఇక పోలీస్ అంబులెన్స్!
డెడ్‌బాడీస్ తరలింపునకు ప్రత్యేక వాహనాలు
నగరంలో 14 శాతం తగ్గిన నేరాలు
రోడ్డు ప్రమాదాల్లో సైతం తగ్గుదల
కల్తీ దందాలు నిర్వహించే వారిపై పీడీ యాక్ట్
వార్షిక సమావేశంలో వెల్లడించిన సిటీ కొత్వాల్
సిటీబ్యూరో: ప్రజల సహకారం, పోలీసులు తీసుకున్న చర్యలు, టెక్నాలజీ వినియోగం, అమలులోకి వస్తున్న కమ్యూనిటీ సీసీ కెమెరా వ్యవస్థ... వెరసి గత ఏడాదితో పోలిస్తే నగరంలో నేరాలు 14 శాతం తగ్గాయని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. కొన్ని రకాలైన వాటిలో మాత్రం స్వల్పంగా పెరుగుదల కనిపించిదని పేర్కొన్నారు. 2015కు సంబంధించి వార్షిక వివరాలు వెల్లడించేందుకు సోమవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్వాల్ నేరాల నమోదు తీరుతెన్నుల నివేదికల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కొత్వాల్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ‘సొత్తు సంబంధం నేరాల్లో ప్రజలు కోల్పోతున్న సొత్తులో 42 శాతం తగ్గుదల కనిపించింది. ఈ తరహా నేరాలు కూడా 2014తో పోలిస్తే 16 శాతం తగ్గాయి. గడిచిన రెండు నెలల నుంచి స్నాచింగ్ కేసుల్ని సైతం దోపిడీ దొంగతనంగా నమోదు చేసున్నాం. ఈ నేపథ్యంలోనే ఆ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. మొత్తమ్మీద చైన్‌స్నాచింగ్ నేరాలు గత ఏడాదితో పోలిస్తే సగానికి సగం తగ్గాయి. స్నాచింగ్ నేరుగా దోపిడీ కేసుగా నమోదు చేయడం తగదంటూ ఇటీవల బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఆ విధానానికి తాత్కాలికంగా బ్రేక్ వేసి, ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నాం’ అని అన్నారు.
మృతదేహాల కోసం పోలీసు అంబులెన్స్‌లు...
గత ఏడాదితో పోలిస్తే రోడ్‌యాక్సిడెంట్స్ సంఖ్య కూడా తగ్గిందని కమిషనర్ తెలిపారు. నగరంలో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా ప్రజలు, పోలీసులు ‘108’కు సమాచారం ఇస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకుంటున్న ఈ వాహనాలు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. మృతి చెందిన వారిని మార్చురీకి తీసుకువెళ్ళడానికి ససేమిరా అంటున్నారు. దీంతో పోలీసులు అనేక రకాలుగా ఈ డెడ్‌బాడీస్‌ని తరలించాల్సి వస్తోంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న కొత్వాల్ మహేందర్‌రెడ్డి ఈ తరహా మృతదేహాల తరలింపు కోసం పోలీసు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాథమికంగా రెండింటిని ఖరీదు చేసి అందుబాటులోకి తీసుకువస్తారు. ఆపై నగర వ్యాప్తంగా ఎన్ని అవసరమో నిర్థారించి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. నగర పోలీసు విభాగంలో 33 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నా...అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారని తెలిపిన కమిషనర్ తొలి విడతలో 3 వేలు, రెండో విడతలో మిగతావి భర్తీ చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని వివరించారు. కమ్యూనిటీ సీసీ కెమెరా ప్రాజెక్టులో భాగంగా నగర వ్యాప్తంగా ఇప్పటికే 10 వేల కెమెరాలు ఏర్పాటు ప్రక్రియ జరుగుతోందని, లక్ష కెమెరాల లక్ష్యాన్ని చేరుకోవడంతో పాటు ప్రతి పోలీసుస్టేషన్‌ను ఓ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా మార్చనున్నామని ఆయన తెలిపారు. పోలీసు పనితీరు మెరుగుదల కోసం నిరంతరం అంతర్గత శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని కొత్వాల్ పేర్కొన్నారు. నగరంలో పెరిగిపోయిన కల్తీ దందాకు అడ్డుకట్టవేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని, పదేపదే ఈ తరహా నేరాలు చేస్తూ చిక్కిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
పోలీసుల పని కత్తిమీద సాము...
పోలీసుల విధి నిర్వహణ కత్తిమీద సాములాంటిదని కమిషనర్ అభిప్రాయపడ్డారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలతో ముందుకు పోతున్నామని స్పష్టం చేశారు. పోలీసు విధి నిర్వహణలో ఆరోపణలు, కొన్ని అపశృతులు సహజమన్న ఆయన సాధ్యమైనంత వరకు వీటికి తావు లేకుండా ప్రయత్నిస్తున్నామని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజలు సైతం పోలీసు విధివిధానాలను, చట్టం అమలు చేస్తున్న తీరును అర్థం చేసుకుని మెలగాలని, మారేడ్‌పల్లి తరహాలో పోలీసుస్టేషన్లపై దాడులు వంటివి చేయడం తగదని హితవుపలికారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అంతర్గత పాలనలోనూ టెక్నాలజీ వినియోగాన్ని పెంచుతామని మహేందర్‌రెడ్డి చెప్పారు. కొత్త హంగులతో రూపుదిద్దుకున్న నగర పోలీసు అధికారిక వెబ్‌సైట్ వెర్షన్‌ను మహేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. సిటీ పోలీసు కమిషనరేట్ పరిధిలో 2013లో 18,126 కేసులు నమోదు కాగా 2014లో ఈ సంఖ్య 21,285గా, ఈ ఏడాది 18,379గా ఉంది.
నగర పోలీసు విభాగానికి కేటాయించిన పోస్టులు 14,716. ప్రస్తుతం 9821 మంది అందుబాటులో ఉండగా 4895 పోస్టులు (33 శాతం) ఖాళీగా ఉన్నాయి.నగర పోలీసు విభాగానికి కేటాయించిన పోస్టులు 14,716. ప్రస్తుతం 9821 మంది అందుబాటులో ఉండగా 4895 పోస్టులు (33 శాతం) ఖాళీగా ఉన్నాయి.