ఏసీలో పడుకోవాలని.. కారులో తిరగాలని..
ఏసీ గదిలో పడుకోవాలని అతడికి కల.. కానీ ఇంట్లో ఏసీ లేదు. మంచి పడవలాంటి పెద్ద కారులో షికారుకు వెళ్లాలని ఆశ.. కానీ కొనేంత స్థోమత లేదు. దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టడంతో ఢిల్లీకి చెందిన అమృత్ సింగ్ (19) తన కలలు నెరవేర్చుకోలేకపోయాడు. ఎలాగైనా వాటిని అనుభవించాలని మొదట్లో కారు బ్యాటరీలు, ఇతర విడి భాగాలు చోరీ చేయడం మొదలుపెట్టాడు. చివరకు ఏకంగా ఓ హోండా సిటీ కారు కొట్టేశాడు. తనను తాను 'డాన్' అని పిలుచుకునే అమృత్ సింగ్ తూర్పు ఢిల్లీలోని గాంధీనగర్ ప్రాంతంలో కారు దొంగతనం చేస్తుండగా సీసీటీవీ ఫుటేజిలో దొరికిపోయాడు. దాంతో పోలీసులు సదరు 'సరదా' దొంగను అరెస్టు చేశారు.
రాత్రిపూట విలాసవంతమైన కారులో తిరగాలన్న తన సరదా తీర్చుకోడానికే కారు చోరీచేసినట్లు తర్వాత పోలీసు విచారణలో అతడు తెలిపాడు. అతడి వద్ద ఆరు కార్లతో పాటు ఒక స్కూటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐదో తరగతి వరకు బాగా తెలివైన విద్యార్థిగా ఉండే అమృత్.. ఆ తర్వాత చెడు స్నేహాలతో పాడైపోయాడు. ఖరీదైన కార్లు నడపాలంటే అతడికి సరదా అని, కానీ తమ ఇంట్లోకి 5 రూపాయలు పెట్టి వాషింగ్ పౌడర్ కొనమన్నా ఇబ్బందిపెట్టేవాడని అతడి తల్లి హర్జీందర్ కౌర్ చెప్పారు. చోరీచేసిన స్కూటర్లు అమ్మితే వచ్చిన డబ్బుతో కారులోకి పెట్రోలు పోయించేవాడు. ఏదైనా కారు మీద అతడికి విసుగు పుడితే, దాన్ని పక్కన పడేసి మరో కారు చోరీచేసేవాడని డీసీసీ రిషిపాల్ తెలిపారు. రాత్రంతా ఏసీ వేసుకుని కారులోనే పడుకునేవాడని.. అలా ఏసీ సరదా, కారు సరదా రెండూ తీర్చుకునేవాడని చెప్పారు. అతడి పేరు మీద ఇప్పటివరకు 16 చోరీ కేసులు ఢిల్లీలో నమోదయ్యాయి.