సత్యేంద్ర సింగ్ షెకావత్
సాక్షి,హైదరాబాద్: అతడి పేరు సత్యేంద్ర సింగ్ షెకావత్...రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఆర్మీ మాజీ జవాను కుమారుడు...ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేశాడు...కేవలం హైఎండ్ కార్లనే టార్గెట్‌గా చేసుకుని 2003 నుంచి చోరీలు చేస్తున్నాడు...ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో 61 నేరాలు చేసిన ఇతడిపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లోనూ ఐదు కేసులు ఉన్నాయి. షెకావత్‌ను ఈ ఏడాది మార్చిలో బెంగళూరులోని అమృతహల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిని శుక్రవారం పీటీ వారెంట్‌పై తమ కస్టడీలోకి తీసుకున్న బంజారాహిల్స్ అధికారులు విచారిస్తున్నారు.
► మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న పంచవటి పోలీసుస్టేషన్ పరిధి నుంచి 2003లో క్వాలిస్‌ను చోరీ చేయడంతో సత్యేంద్ర సింగ్ నేరచరిత్ర మొదలైంది. ప్రస్తుతం ఆడి, బీఎండబ్ల్యూ, స్కార్పియో వంటి అత్యంత ఖరీదైన కార్లను మాత్రమే టార్గెట్ చేసే షెకావత్ వాటిని చోరీ చేయడంలోనూ ప్రత్యేకత చూపిస్తుంటాడు.
► కార్ల తాళాలు స్కాన్ చేయడానికి, వాహనం నంబర్ ఇతర వివరాల ఆధారంగా జీపీఎస్ ద్వారా దాని ఉనికి కనిపెట్టడానికి, మారు తాళాలు త యారు చేయడానికి అవసరమైన ఉపకరణాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఓ కారు ఇంజిన్ నంబర్, ఛాసిస్ నెంబర్ ఆధారంగా దాని తాళం తయారు చేయడం ఇతడికే సొంతం.
► ఇటీవల కాలంలో తాళం పెట్టాల్సిన అవసరం లేకుండా, అది దగ్గర ఉంటే చాలు స్టార్ట్ అయ్యే వాహనాలు వచ్చాయి. ఇలాంటి వాటిని చోరీ చేయడానికి షెకావత్ చైనా నుంచి ఖరీదు చేసిన ఎక్స్‌టూల్ ఎక్స్–100 ప్యాడ్ అనే పరికరం వాడతాడు. సదరు వాహనం ఆగిన వెంటనే డ్రైవర్ కిందికి దిగకుండానే దాని సమీపంలోకి వెళ్తాడు
చదవండి: అయ్యా బాబోయ్! అతనికి 50, ఆమెకు 23.. ఏజ్ గ్యాప్ ఉన్నా పర్లేదంటూ..
► డొంగల్‌తో కనెక్ట్ చేసి ఉండే ఎక్స్‌టూల్ ఎక్స్–100 ప్యాడ్ ద్వారా దాని ఫ్రీక్వెన్సీ రికార్డు చేస్తాడు. ఆ ఫ్రీక్వెన్సిని తన వద్ద ఉండే వీవీడీఐ మినీ కీటూల్ ద్వారా నకిలీ తాళంలోకి ఇన్‌స్టల్ చేస్తాడు. ఇలా తయారైన తాళం తన వద్ద ఉంచుకుని దర్జాగా కారుతో ఉడాయిస్తాడు. 2003 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, డయ్యూడామన్, ఉత్తరప్రదేశ్‌ల్లో 58 వాహనాలు తస్కరించాడు. వీటితో పాటు రెండు దోపిడీ, ఓ ఆయుధ చట్టం కేసులు సత్యేంద్ర సింగ్‌పై ఉన్నాయి.
► బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ స్టార్ హోటల్‌లో గతేడాది జనవరి 26న పంజా విసిరిన షెకావత్ దాని పార్కింగ్ లాట్ నుంచి కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ వి.మంజునాథ్ కారు తస్కరించాడు. అప్పట్లోనే నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఏప్రిల్‌లో నాచారంలో అడుగుపెట్టిన సత్యేంద్ర సింగ్ ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వాహనం తస్కరించాడు. దీంతో ఆ పోలీసులు జైపూర్ వరకు వెళ్లారు. చోరీల్లో షెకావత్ భార్యకు పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
ఆమెను అరెస్టు చేసినప్పటికీ... పీటీ వారెంట్ ఇవ్వడానికి నిరాకరించిన అక్కడి కోర్టు అమెకు బెయిల్ ఇచ్చింది. ఆ సందర్భంలో పోలీసులతో వీడియో కాల్‌లో మాట్లాడిన షెకావత్ ‘దమ్ముంటే నన్ను పట్టుకోండి. నా భార్యను, కుటుంబాన్ని వేధించొద్దు’ అంటూ సవాల్ విసిరాడు. దీంతో అతడి కోసం అతడి కోసం గాలింపు ముమ్మరమైంది.
ఈలోగా మరో మూడుసార్లు ఇక్కడకు వచ్చి వెళ్లిన షెకావత్ పేట్‌బషీరాబాద్, దుండిగల్‌ల్లో మూడు కార్లు ఎత్తుకుపోయాడు. ఎట్టకేలకు బెంగళూరు పోలీసులకు చిక్కాడు. ఇతడిని పీటీ వారెంట్‌పై సిటీకి తీసుకువచ్చిన బంజారాహిల్స్ పోలీసులు కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు విచారించనున్న ఈ అధికారులు చోరీ అయిన కారు రికవరీ చేయనున్నారు. షెకావత్ చోరీ చేసిన కార్లను విక్రయించి సొమ్ము చేసుకుంటాడని, ఆ సొమ్ముతో జల్సాలు చేస్తాడని పోలీసులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment