‘రాడికల్ మతబోధకుడు’ అమృత్‌పాల్ సింగ్ గత సంవత్సరం దాకా నీట్‌గా షేవ్ చేసుకున్నాడు. తనలోని సహజ ప్రతిభలకు అవకాశం లభించనుందని గ్రహించి గడ్డం పెంచడం ప్రారంభించాడు. పోలీసులు చర్య తీసుకోవడాన్ని అడ్డుకునేందుకు గురు గ్రంథ్ సాహిబ్‌ను తన అనుచరులు నిత్యం వెంట ఉంచుకునేలా చేశాడు. ఇప్పుడు సమస్యల్లా పంజాబ్‌లో ఉగ్రవాదం తిరిగి పొడసూపే అవకాశం ఉండటమే.
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మన పొరుగుదేశం మళ్లీ సరిహద్దు పొడవునా ఘర్షణలు రేపడానికి ప్రయత్నించవచ్చు. అందుకే ఆప్ సర్కారు వైఫల్యం పేరుతో తనకు స్వాగతం పలకని రాష్ట్రంలో ప్రయోజనాలు పొందడానికి కేంద్రం ప్రయత్నించకూడదు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ద్విముఖ వ్యూహం అవసరం.
‘రాడికల్ మతబోధకుడి’గా అభివర్ణిస్తున్న అమృత్‌పాల్ సింగ్ మరో భిండ్రాన్‌వాలే కావాలని ఆశ పడుతున్నాడు. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించడం అంత సులభం కాదు. తప్పుదోవ పట్టిన రాజకీయ తంత్రాల ఉత్పత్తి –భిండ్రాన్‌వాలే. నిరుద్యోగం, నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల, తీవ్రరూపం దాల్చిన రష్యా–ఉక్రెయిన్ ఘర్షణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కలిగించిన ప్రభావాలు వంటి వాటి కారణంగా పంజాబ్ యువతలో ఏర్పడిన ప్రస్తుత నిస్పృహ స్థితిని వాడుకోవాలని అమృత్‌పాల్ స్పష్టంగా కోరుకుంటున్నాడు.
మీడియా నివేదికల ప్రకారం, అమృత్‌పాల్ అనుయాయుల్లో ఒకరైన లవ్ ప్రీత్ సింగ్ ‘తూఫాన్’ను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. చామ్‌కౌర్ సాహిబ్‌కు చెందిన వరీందర్ సింగ్‌ను అపహరించి, దాడి చేశారనే ఆరోపణలపై అతడిని అరెస్టు చేశారు. దీనిపై అజ్‌నాలా పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో అమృత్‌పాల్ పేరు కూడా జోడించారు. లవ్‌ప్రీత్ విడుదలకు డిమాండ్ చేస్తూ పోలీసు స్టేషన్ వరకు మార్చ్ చేయాలని అమృత్‌పాల్ ప్రకటించాడు. సమస్య తీవ్రతను గ్రహించడంతో చుట్టుపక్కల పోలీసు స్టేషన్ల నుంచి పోలీసు బలగాలను రప్పించి అజ్‌నాలా వద్ద మోహరించారు.
అమృత్‌పాల్, అతడి ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థకు చెందిన మద్దతు దారులు భారీస్థాయిలో కత్తులు, కొందరు తుపాకులు కూడా ధరించి బారికేడ్లను ఛేదించుకుని పోలీసు స్టేషన్ లో ప్రవేశించారు. ప్రభుత్వ ఆస్తికి భారీ నష్టం కలిగించారు. గుంపు తమపై దాడిచేస్తే ఏం చేయాలనే విషయమై వందమంది శిక్షణ పొందిన పోలీసులకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చివుంటే సాధారణ పరిస్థితుల్లో వీరు గుంపుతో సమర్థంగా వ్యవహరించి వారిని చెదరగొట్టి ఉండేవారు.
అయితే మూకహింసను ఎదుర్కోవడానికి ఎంతమేరకు బలాన్ని ప్రయోగించవచ్చో స్పష్టంగా వారికి చెప్పనట్లయితే, పరిస్థితి అదుపు తప్పడానికే ఆస్కార ముంటుంది. అదే జరిగింది కూడా. సదరు పోలీసు స్టేషన్‌లో జరిగిన ఘటన పోలీసు నాయకత్వం, రాష్ట్ర రాజ కీయ నాయకత్వం వైఫల్య మేనని నేను కచ్చితంగా చెబుతాను.
వార్తల ప్రకారం సీనియర్ ఐపీఎస్ అధికారులు తర్వాత స్పందించి, అమృత్‌పాల్‌తో మాట్లాడారు. వరీందర్ కిడ్నాప్ వ్యవ హారంలో లవ్‌ప్రీత్ పాత్ర లేదని అమృత్‌సర్ పోలీస్ కమిషనర్, అజ్‌నాలా ఎస్‌ఎస్‌పీకి అమృత్‌పాల్ నచ్చజెప్పినట్లు కనబడుతోంది. దాంతో లవ్‌ప్రీత్‌ను విడుదల చేయడానికి సీనియర్ అధికారులు అంగీ కరించారు. ఇలా లొంగిపోవడం ఇకనుంచీ పోలీసు, రాజకీయ నాయ కత్వానికి సమస్యలు తీసుకొస్తుంది.
తన ప్రాథమిక ఫిర్యాదులో లవ్‌ప్రీత్ పేరును వరీందర్ బయట పెట్టారు. అలాంటప్పుడు నిజంగా కిడ్నాప్ ఘటన జరిగిందా అని పోలీసులు తనిఖీ చేసివుండవలసింది. వరీందర్‌ను కొట్టిందెవరు? అమృత్‌పాల్ వ్యాఖ్యలను అతడు వ్యతిరేకించినట్లు చెబుతున్నారు. అదే నిజమైతే, దాడి వెనుక ఉద్దేశం అర్థమవుతోంది.
ఇలాంటి ముఖ్యమైన రాజకీయ పరిణామం పట్ల అజ్‌నాలా పోలీసులు తమ పైఅధికార్లను లూపులో పెట్టివుండవచ్చు. అయిదు పోలీసు స్టేషన్లపై అధికారం కలిగిన ఆఫీసర్ మాత్రమే సమీప పోలీసు స్టేషన్ల నుంచి అదనపు బలగాల మోహరింపునకు ఆదేశాలు ఇవ్వ గలడు. ఒకవేళ సాయుధ బటాలియన్ నుంచి రిజర్వ్ బలగాలను తరలించి ఉంటే, అలాంటి ఆదేశం రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచి మాత్రమే వచ్చి ఉంటుంది. అలాంటప్పుడు ఎఫ్‌ఐఆర్‌లో పొందు పర్చిన వ్యక్తిని అరెస్టు చేయాలనే నిర్ణయం గురించి తమకు తెలీదని సీనియర్లు చెప్పుకొనే అవకాశమే లేదు.
చట్టవిరుద్ధమైన డిమాండ్లకు లొంగిపోవడంలో రాజకీయ నాయకత్వం పాత్రను నేను చూస్తున్నాను. ఈ విషయాలన్నీ ముఖ్య మంత్రికి తెలీకుండా పోయే ప్రశ్నే లేదు. భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఇంకా భద్రతా రంగంపై పట్టు సాధించవలసే ఉంది. లేదంటే ఇది ‘ఆప్’ ప్రభుత్వ ఆయువు పట్టును దెబ్బకొడుతుంది.
ఇప్పుడు ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే, అతి సున్నిత మైన ఈ సరిహద్దు రాష్ట్రంలో ఉగ్రవాదం తిరిగి పొడసూపే అవకాశం ఉండటమే. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన మన పొరుగుదేశం మళ్లీ సరిహద్దు పొడవునా ఘర్షణలు రేపడానికి ప్రయత్నించవచ్చు. 1980లలో మన పొరుగు దేశమే ఖాలిస్తానీ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆశ్రయం కల్పించింది. పైగా సరిహద్దు పొడవునా ఆయుధాలను సర ఫరా చేసింది. అమృత్‌పాల్‌తో కూడా మన పొరుగు దేశం సంబంధాలు పెట్టుకోవచ్చు. ఇప్పటికే ఆ ప్రయత్నం జరిగిందో!
ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి తగిన వ్యక్తి– జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోబాల్. ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఇదంతా ఎలా జరిగింది, దీన్ని పరిష్కరించడానికి ఎవరిపై విశ్వాసం ఉంచాలి వంటి వివరాలు ఆయనకు తెలుసు. అమృత్ పాల్‌కు అసమంజసమైన ఆకర్షణ రావడాన్ని అనుమతించకూడదు.
జయింపశక్యం కాని వలయం అతడి చుట్టూ ఏర్పడకముందే అతడిని అదుపు చేయాలి. అజ్‌నాలాలో అతడు విజయాన్ని రుచిచూశాడు. దానికి అనుగుణంగా పంజాబ్‌లో అతడికి మద్దతు పెరుగుతుంది.
బీజేపీకి స్వాగతం పలకని రాష్ట్రంలో రాజకీయ ప్రయోజనం పొందడానికి అజ్‌నాలాలో పంజాబ్ ప్రభుత్వ వైఫల్యాన్ని ముందు పీటికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించవచ్చు. అలా చేస్తే అది కూడా తప్పిదమే అవుతుంది. అప్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.
ఆప్ సిక్కు ముఖచిత్రంగా మాన్‌ను ముఖ్య మంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ కూడా కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను తన పార్టీ సిక్కు ముఖంగా తీసుకొచ్చింది. కానీ అతడి బలం పనిచేయలేదు. మోదీ ప్రభుత్వం ముందున్న తెలివైన ఎంపిక ఏమిటంటే, పంజాబ్‌ను దాని మానాన దాన్ని వదిలేయడమే. లేకుంటే తన చేతులను తానే కాల్చుకోవలసి వస్తుంది.
దీనికంటే మించిన చెత్త ఎంపిక ఏమిటంటే, రాజకీయాలు ఆడటమే. ఎందుకంటే మాన్, ఆయన పార్టీని ఒక పిల్లకాకి విపత్కర పరిస్థితుల్లోకి నెట్టేశాడు. ఇతగాడు గత సంవత్సరం దాకా నీట్‌గా షేవ్ చేసుకుని దుబాయ్‌లో ఇదమిత్థం కాని జీవితం గడుపుతుండేవాడు.
తనలోని సహజ ప్రతిభలకు అవకాశం లభించనుందని గ్రహించిన అమృత్‌పాల్ అప్పటినుంచి గడ్డం పెంచడమే కాకుండా, భిండ్రాన్ వాలేను అనుకరిస్తూ దుస్తులను ధరించడం ప్రారంభించాడు. పోలీ సులు చర్య తీసుకోవడాన్ని అడ్డుకునేందుకు గురు గ్రంథ్ సాహిబ్‌ను తన అనుచరులు నిత్యం వెంట ఉంచుకునేలా చేశాడు.
సమస్యను మొగ్గలోనే తుంచేసే అవకాశం లేకుండా పోయింది. రాజకీయ, పోలీసు నాయకత్వం చేయవలసిన పని కష్టతరమైంది. ఆప్ ప్రభుత్వం డోబాల్ సహాయం తీసుకోవాలి. సలహాదారుగా తన పాత్రను ప్రకటించకుండానే తెర వెనుక ఆయన చాలా చేయగలడు. ఈ సమస్యకు ద్విముఖ వ్యూహం అవసరం. పంజాబ్ జనాభాలో చాలా భాగం, ముఖ్యంగా గ్రామాల్లోని జాట్ సిక్కు రైతులు 1980, 90ల మొదట్లో ఉగ్రవాదం బీభత్సంతో తీవ్ర బాధలకు గురయ్యారు.
ప్రజారాశులతో కమ్యూనికేషన్ మార్గాలు పెరిగినందున, అమృత్ పాల్, అతడి అనుయాయులను అదుపులోకి తీసుకోవాలి. రాజకీయ ప్రతిపక్షాలు, విమర్శకులకు వ్యతిరేకంగా అన్ని చట్టాలను ఉపయోగి స్తున్న బీజేపీ... రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్రాన్ని కాటు వేయడానికి ముందే ఉగ్రవాదంపై ఆ చట్టాలను ఉపయోగించాలి.
జూలియో రిబేరో
వ్యాసకర్త పోలీస్ మాజీ ఉన్నతాధికారి, ‘పద్మభూషణ్’
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment