శనివారం నుంచి మూడు రోజులుగా నిరంతర గాలింపు. అయినా దొరకలేదు. ఇప్పటికి వందమందికిపైగా అతని సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం పొద్దుగూకాక కూడా నిందితుడు పోలీసుల గస్తీ కళ్ళ నుంచి తప్పించుకొని, తిరుగుతూనే ఉన్నాడు.
‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ అధినేత అమృత్‌పాల్ సింగ్ పరారీ, అందుకు దారి తీసిన పరిస్థితులు చూస్తే, నలభై ఏళ్ళ నాటి తీవ్రవాద సంక్షుభిత పంజాబ్ పరిస్థితులు పునరావృతమవుతున్నాయన్న ఆందో ళన కలుగుతోంది.
సిక్కులకు సార్వభౌమాధికార దేశం కావాలన్న ఖలిస్తానీ జెండాను భుజానికెత్తుకున్న యువనేత అమృత్‌పాల్ ముఠా బలప్రదర్శన చేసి,అమృత్‌సర్‌లో పోలీస్‌స్టేషన్‌పై ఫిబ్రవరి 23న దాడి చేసి నెలవుతున్నా, నిన్నటి దాకా కళ్ళు తెరవని ‘ఆప్’ సర్కార్ వైఫల్యం వెక్కిరిస్తోంది.
గాలివార్తలు సుడిగాలిలా వైరల్ అవుతున్న వేళ శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఇంటర్నెట్ సేవల్ని మంగళవారం మధ్యాహ్నం దాకా పాలకులు నిలిపివేయాల్సి వచ్చిందంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. రూపం మార్చుకున్న సరికొత్త ఖలిస్తాన్ 2.0 విజృంభిస్తోందా? 1980–90ల్లోలా పంజాబ్ మళ్ళీ అగ్నిగుండం కానుందా? హత్యానేరం, పోలీసులపై దాడి సహా కనీసం 7 క్రిమినల్ నేరారోపణలున్న అమృత్‌పాల్ ఇప్పుడు పంజాబ్‌లో మళ్ళీ పుంజుకుంటున్న వేర్పాటువాదానికి కేంద్రబిందువయ్యాడు.
మాదక ద్రవ్యాల అలవాటును మాన్పించడానికి పనిచేసే డీ–ఎడిక్షన్ కేంద్రాలనూ, అలాగే ఓ గురుద్వారానూ అమృత్‌పాల్ తన అడ్డాగా చేసుకున్నాడట. ఆ స్థావరాల్లో కత్తులు, తుపాకీలు, తూటాలు... పోగేసి, ఆత్మాహుతి దాడులకు యువతరాన్ని సిద్ధం చేస్తున్నాడని గూఢచారి వర్గాల సమాచారం. ఆయుధాలు – బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు దొరకడం, సాయుధ పోరాటం ఇష్టం లేదంటూనే ‘ఆనంద్‌పూర్ ఖల్సా ఫోర్స్’ (ఏకెఎఫ్) పేరును ప్రాచుర్యంలో పెట్టడం లాంటి అమృత్‌పాల్ సమాచారంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.
బంధువుల సాయంతో 20 ఏళ్ళ వయసులో దుబాయ్ వెళ్ళి, భారీ వాహనాల డ్రైవర్‌గా పని చేసి, నిరుడు భారత్‌కు తిరిగొచ్చిన ఓ యువకుడు అనూహ్యంగా ఈ స్థాయికి చేరడం చిత్రమే. నిన్నటి దాకా ఆధునిక వేషభాషల్లో ఉన్న 30 ఏళ్ళ అమృత్‌పాల్ ఇవాళ సాంప్రదాయిక సిక్కు వస్త్రధారణలో, చేతిలో కృపాణంతో, ఖలిస్తానీ ఉద్యమానికి వేగుచుక్క కావడం సహజ పరిణామం అనుకోలేం.
ఈ ఖలిస్తాన్ అనుకూల ఉద్యమం వెనుక పాకిస్తానీ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ప్రమేయం ఉందన్న అనుమానం బలపడుతున్నది అందుకే. అతనికి నిధులెక్కడివన్నదీ ఆరా తీయాల్సిందే! ఇక, పలాయితుడిపై జాతీయ భద్రతా చట్టం విధిస్తారన్న వార్త పరిస్థితి తీవ్రతకు ఉదాహరణ.
1980లు, 90లలో అకాలీలు తీవ్రవాద ఆరోపణలతో అరెస్టయిన తమ అనుయాయుల విడుదల కోసం వీధికెక్కినట్టే, ఈ 2023లో అమృత్‌పాల్, ఆయన తోటి ఖలిస్తానీ మద్దతుదారులు తమ సహచరుడి విడుదల కోసం గత నెలలో వీధికెక్కారు.
ఏడేళ్ళ వయసు నుంచే సాంప్రదాయిక సిక్కు ధార్మిక శిక్షణ పొందిన ఒకప్పటి ఖలిస్తానీ నేత జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలేకు భిన్నంగా,అలాంటి శిక్షణేమీ లేకుండా ఉన్నట్టుండి అలాగే వేషం కట్టి, మాట్లాడుతున్నాడు అమృత్‌పాల్.
స్వీయ ప్రచారం మాటెలా ఉన్నా అతనిని ‘భింద్రన్‌వాలే 2.0’ అనలేం. సాయుధ అంగరక్షకుల నడుమ ఊరూరా తిరుగుతూ, రెచ్చగొడుతున్నాడు. 1984లో అమృత్‌సర్ స్వర్ణాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్‌లో భింద్రన్‌వాలేను హతమార్చిన తర్వాత నాటి ప్రధాని ఇందిర, పంజాబ్ సీఎం బియాంత్ సింగ్‌లకు పట్టిన గతి నేటి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పంజాబ్ సీఎం మాన్‌లకు పడుతుందని తొడకొడుతున్నాడు. మానిన పాత గాయాల్ని మళ్ళీ కెలుకుతున్నాడు.
భారత్ పట్ల ఖలిస్తానీల విద్వేషం బ్రిటన్, ఆస్ట్రేలియా సహా వివిధ దేశాల్లో ఉన్నట్టుండి వెల్లువె త్తడం మరింత ఆందోళనకరం. బరి తెగించిన ఖలిస్తానీ దుండగులు లండన్ తదితర ప్రాంతాల్లో భారత రాయబార కార్యాలయాలపై దాడి చేయడం, జాతీయ జెండాను తొలగించడం దుస్సహం. రాయబార కార్యాలయానికి కాపుండాల్సిన ఆయా దేశాల ఉదాసీన వైఖరీ ముమ్మాటికీ తప్పే.
అసలు మన బంగారం మంచిదైతేగా! పంజాబ్ సంపన్న రాష్ట్రమే కానీ, గత పదిహేనేళ్ళలో తీవ్రనిరుద్యోగంతో యువత తప్పుదోవ పడుతోంది. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరే కంగా 2020 – 21లో పంజాబీ సోదరులు పోరాటం సాగిస్తున్నప్పుడు దాన్ని సుదీర్ఘంగా సాగదీసిన కేంద్ర ప్రభుత్వ ఉదాసీనత సైతం అసంతృప్తి ప్రబలడానికి ఓ కారణం. హిందూ రాష్ట్రమనే భావనను పైకి తెస్తున్న పిడి వాదులూ, పరోక్షంగా ఖలిస్తానీల సిక్కురాజ్య వాదనకు ప్రేరేపకులే!
నిరుద్యోగ యువత అసంతృప్తి, రైతుల ఆగ్రహం, ‘ఉఢ్తా పంజాబ్’గా మారిన రాష్ట్రంలో ఇట్టే దొరుకుతున్న మాదక ద్రవ్యాలు, పాక్ సరిహద్దుల నుంచి ఆయుధ ప్రవాహం, పాలకుల నిస్తేజం... అన్నీ కలసిన పంచకూట కషాయమే – పంజాబ్‌లో ప్రబలుతున్న దేశవ్యతిరేక కార్యకలాపాలు.
జనబాహుళ్య అసంతృప్తిని తెలివిగా వాడుకుంటూ తన పునాదిని విస్తరించుకుంటున్న అమృత్ పాల్‌కు పాక్ అండతో సాగుతున్న విదేశీ ఖలిస్తానీ మద్దతుదారులు తోడవడం అగ్నికి ఆజ్యమే.
తనను తాను అతిగా ఊహించుకుంటున్న ఈ వేర్పాటువాదిని ఆదిలోనే అడ్డుకోవాలి. మొగ్గలోనే తుంచకపోతే విభజనవాదం బ్రహ్మరాక్షసిగా మారి మింగేస్తుంది. కదం తొక్కాల్సిన పాలకులు కాలహరణం చేస్తే పంజాబ్‌లో మళ్ళీ పాత చీకటి రోజులు ముందుకొస్తాయి. పారా హుషార్!
ఖలిస్తాన్ 2.0
Published Tue, Mar 21 2023 12:17 AM | Last Updated on Tue, Mar 21 2023 9:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment