కశ్మీర్‌లో యువకుల రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు స్థానిక పౌరుడిని రక్షణ కవచంగా వాడుకున్నారంటూ..
శ్రీనగర్: కశ్మీర్‌లో యువకుల రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు స్థానిక పౌరుడిని రక్షణ కవచంగా వాడుకున్నారనే ఆరోపణలపై భద్రతాదళాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనగర్ ప్రాంతంలోని మాటమాలూలో ఓ యువకుడు హత్యకు గురైన ఘటనలోనూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప ఎన్నికల సందర్భంగా ఈ నెల 14న స్థానిక యువత పెద్ద ఎత్తున భద్రతాదళాలపైకి రాళ్లు విసరడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ సందర్భంగా పోలీసులు ఖాన్ సాహిబ్ అనే స్థానికుడిని కదులుతున్న పోలీసు జీపునకు ముందుభాగంలో కట్టేశారు. ‘రాళ్లతో దాడి చేసే వారికి ఇదే తగిన శాస్తి’ అని సైనికులు అరిచినట్లుగా వీడియోలో చిత్రీకరించారు. తలకు బుల్లెట్ తగిలి సాజద్ హుస్సేన్ షేక్ అనే స్థానికుడు చనిపోయిన ఘటనలో పోలీసులు గుర్తు తెలియని భద్రతా సిబ్బందిపై హత్య కేసు నమోదు చేశారు.