లాలూ అవకతవకలకు పాల్పడ్డారు: సీబీఐ
న్యూఢిల్లీ: రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ అవకతవకలకు పాల్పడ్డారని సీబీఐ తెలిపారు. లాలూ నివాసంతో పాటు దేశవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో సీఐబీ శుక్రవారం ఉదయం సోదాలు చేసిన విషయం తెలిసిందే. హోటళ్ల లీజు విషయంలో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీదేవి, కుమారరుడు తేజస్వీ యాదవ్‌పైనా సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ కేసుకు సంబంధించి సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ రాకేష్ ఆస్తానా మీడియా సమావేశంలో మాట్లాడారు. లాలూ ప్రవేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరించారని, హోటళ్ల టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నారు. సోదాలు కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. కాగా 2006లో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వేకు చెందిన రెండు హోటళ్లను ప్రైవేట్ హాస్పిటాలిటీ గ్రూప్‌కు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. హోటళ్లను ఎక్స్చేంజ్ చేయడం కోసం ఈ హాస్పిటాలిటీ గ్రూప్ పాట్నాలోని రెండు ఎకరాల విలువైన భూమిని లాలూ సంస్థలకు లంచంగా ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.
మరోవైపు సీబీఐ దాడుల నేపథ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శిలకు ఫోన్ చేసిన ఆయన అత్యవసరంగా రాజ్‌గిరి రావాలని ఆదేశించారు. అలాగే సొంత పార్టీ జేడీయూ నేతలకూ నితీష్ వర్తమానం పంపినట్లు సమాచారం. లాలూ కుటుంబ సభ్యులపై సీబీఐ కేసుల నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించడానికి ఈ భేటీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. సీబీఐ తనిఖీలు, తేజస్వీ యాదవ్‌పై చర్యల విషయాన్ని ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది.
కాగా బిహార్‌లో లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీ, నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జేడీయూ, సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలు కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇందులో లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ ప్రస్తుతం మంత్రిగా పని చేస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఆర్జేడీ, జేడీయూ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. లాలూ కుటుంబీకులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, సీబీఐ, ఈడీ కేసులు పెరిగిపోవడం నితీష్ కుమార్‌కు ఇబ్బందిగా మారింది. అవినీతి మరక తన ప్రభుత్వంపై పడుతుందనే ఆందోళన నితీష్‌లో కనిపిస్తోంది.