కేంద్రం పరిశీలనలో రాయల తెలంగాణ అంశం: దామోదర
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకున్నప్పట్నుంచి రాష్ట్ర ప్రజలకు ఏదో తెలియని ఆందోళన. అసలు రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం ఏరకంగా ముందుకు వెళుతుందనే అంశం మాత్రం ఎవ్వరికీ అర్ధం కాకుండానే ఉంది. 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుపై సుముఖంగా ఉన్నట్లు ప్రకటించిన గతంలో ప్రకటించిన కేంద్రం..ఇప్పుడు రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదుకు తెచ్చింది. ఈ అంశాన్ని ప్రస్తుతం చాలా సీరియస్గానే పరిశీలిస్తోంది. ఈ రోజు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్లతో డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ భేటీలో కూడా ఇదే విషయాన్ని చర్చించారు.
నిన్న, మొన్నటి వరకూ పది జిల్లాలతో కలిపి హైదరాబాద్ రాజధానిగా తమకు ప్రత్యేక రాష్ట్రానికి మొగ్గు చూపిన దామోదర.. తాజగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. రాయల తెలంగాణ అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోందని, కేంద్రం ఈ అంశంపై తీవ్రంగా చర్చలు జరుపుతోందన్నారు. కాంగ్రెస్ పెద్దల ఈ అంశాన్ని తెరమీదుకు తెచ్చినా దామోదర ఖండించకపోవడంతో ఆయన కూడా రాయల తెలంగాణకు మగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రోజుకో లీకు, గంటకో బ్రేకుతో రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్న కేంద్రం చివరకు ఏ స్టాండ్ తీసుకుంటుందో అనేది మాత్రం ఆసక్తికరమే.