ఆగస్టులోనే కొత్త జీతాలు!
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు ఏడో వేతన కమిషన్ సూచనల ప్రకారం కేంద్రం ఆమోదించిన జీతాలు ఆగస్టు నుంచే అందుతాయి. ఈ మేరకు నోటిఫికేషన్ను ఈ వారాంతంలోపు విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నోటిఫికేషన్ వస్తే.. 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వోద్యోగులు, 52 లక్షల మంది పెన్షనర్లకు ఆగస్టు నుంచే కొత్త జీతాలు, పింఛన్లు అందుతాయి.
ఏకే మాథుర్ అధ్యక్షతన నియమించిన ఏడో వేతన సంఘం సిఫార్సులను కేంద్ర మంత్రివర్గం జూన్ 29న ఆమోదించిన విషయం తెలిసిందే. సాధారణంగా కేబినెట్ ఆమోదించిన తర్వాత 15-20 రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది. ఆరోవేతన సంఘం విషయంలో కేబినెట్ ఆమోదించిన 16 రోజుల తర్వాత దాని అమలుకు నోటిఫికేషన్ విడుదలైంది. జీతాలు, అలవెన్సులు, పింఛన్లలో 23.55 శాతం పెంపును వేతన సంఘం సిఫార్సు చేసింది. దీంతో కేంద్ర ఖజానా మీద రూ. 1.02 లక్షల కోట్ల భారం పడుతుంది. ఇది మొత్తం జీడీపీలో 0.7 శాతానికి సమానం. వేతన సంఘం సూచనల ప్రకారం కనీస వేతనం రూ. 7వేల నుంచి రూ. 18 వేలకు పెరుగుతుంది. కేబినెట్ కార్యదర్శి స్థాయి అధికారులకు ప్రస్తుతం గరిష్ఠంగా రూ. 90 వేలు వస్తుండగా, దాన్ని రూ. 2.5 లక్షలకు పెంచారు. వార్షిక ఇంక్రిమెంటు రేటును మాత్రం యథాతథంగా 3 శాతం వద్ద ఉంచారు.