విధాన నిర్ణయాలు వద్దు
రాష్ట్రపతి పాలనపై గవర్నర్‌కు కేంద్రం మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నేపథ్యంలో పాలన బాధ్యతలు చేపట్టిన గవర్నర్ ఎటువంటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఈమేరకు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ డెరైక్టర్ అశుతోష్ జైన్ రాజ్‌భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. రాష్ట్రపతి పాలన తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, రోజువారీ పాలన కొనసాగడానికే తప్ప ఎటువంటి విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడానికి కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అత్యవసర ప్రతిపాదనలు, విచారణలు, ఇతర అంశాలపై వెంటనే స్పందించేందుకు అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖల్లో డిప్యూటీ కార్యదర్శి లేదా డెరైక్టర్ స్థాయికి తక్కువ కాని అధికారులను సమన్వయాధికారులుగా నియమిస్తున్నట్లు తెలి పారు. వీరి నియామకానికి చర్యలు తీసుకోవాలని జైన్ అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలకు (ప్రధానమంత్రి కార్యాలయం మినహా) ఆదేశించారు. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..
ఉన్నతస్థాయి అధికారుల బదిలీలను గవర్నర్ నేరుగా చేయకూడదు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హోం శాఖ కార్యదర్శి వంటి వారిని బదిలీ చేయాలంటే ముందుగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖను సంప్రదించాలి.
అత్యవసర ప్రజా సమస్యలపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా, వాటిని సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు తెలియజేయాలి.
ఆ శాఖ ఆమోదంతోనే నిర్ణయాలు తీసుకోవాలి.
ప్రధానమైన విధానపరమైన అంశాలు, అధిక మొత్తంలో ఆర్థిక వ్యవహారాలతో కూడిన అంశాలపైన ఎటువంటి నిర్ణయాలను గవర్నర్ తీసుకోకూడదు. వాటిపై నిర్ణయాధికారాలను కొత్తగా ఎన్నికయ్యే ప్రభుత్వాలకే వదిలేయాలి.
రాష్ట్రపతి పాలన సమయంలో అత్యంత అత్యవసరమైన అంశాలపైన, తప్పనిసరైన లెజిస్లేటివ్ ప్రతిపాదనలపై నిర్ణయాలు తీసుకోవాలంటే ముందస్తుగా సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలకు, కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపాలి.
చాలా అత్యవసర పరిస్థితుల్లో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయాలన్నా, ముందుగా రాష్ట్రపతి ఆమోదం పొందాలి. ఆ తర్వాత ఆ ప్రతిపాదనలను పూర్తి సమర్ధనీయతతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపాలి.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల అధికారులందరూ ప్రభుత్వ విధులను బాధ్యతతో నిర్వర్తించాలి. ప్రధానంగా శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ఉగ్రవాదులు, మావోయిస్టుల కార్యకలాపాలను నివారించడానికి, వీఐపీల భద్రతకు అధికార యంత్రాంగం పూర్తి బాధ్యతతో వ్యవహరించాలి.
ఏమైనా ఆర్డినెన్స్‌లకు కాలదోషం పడుతున్నా, ఏదైనా ఆర్డినెన్స్‌కు చట్టం చేయాలన్నా, ఏవైనా బిల్లులకు సవరణలు చేయాలన్నా, ప్రధానమైన అంశాలకు సంబంధించిన వివరాలను హోంమంత్రిత్వ శాఖకు వెంటనే తెలియజేయాలి.