47 మంది ఎంపీల వసతికి 24 కోట్లు
ఫైవ్‌స్టార్ హోటళ్లలో, లగ్జరీ గెస్ట్ హౌసుల్లో నివసిస్తున్న 47 మంది లోక్‌సభ సభ్యులకు కేంద్రం 24 కోట్ల రూపాయలను చెల్లించింది. ప్రస్తుత లోక్‌సభ కొలువుతీరినప్పటి నుంచి నేటి వరకు గడిచిన 14 నెలల కాలానికే ఇంత మొత్తంలో చెల్లించినట్టు సుభాష్ చంద్ర అగర్వాల్ అనే పౌరుడు దాఖలు చేసిన సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన వ్యక్తికి 30 రోజుల్లోగా ఢిల్లీలో వసతి సౌకర్యం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. అలా చేయలేని పక్షంలో వారుండే ఫైవ్‌స్టార్ హోటల్ గదులకు, లగ్జరీ అతిథి గృహాలకు అద్దెలను ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. భోజనం, టెలిఫోన్, ఇతర వసతులకు అయ్యే ఖర్చులను మాత్రం ఎవరికి వారే భరించాల్సి ఉంటుంది.
ప్రస్తుత 47 మంది లోక్‌సభ సభ్యుల్లో 15 మందికి ఎంపీల క్వార్టర్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే అవి నివాసయోగ్యంగా లేవని వారిలో పది మంది లగ్జరీ హోటళ్లలోనే నివసిస్తున్నారు. మరో ఐదుగురికి కేటాయించిన గృహాలు నివాసయోగ్యంగా ఉన్నప్పటికీ వారు తమ రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహాలను ఖాళీ చేయడం లేదు. మాజీ ఎంపీలు ప్రభుత్వ నోటీసు అందుకున్న 14 రోజుల్లో తమకు కేటాయించిన గృహాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. చాలా మంది మాజీలు ఆరు నెలల వరకు కూడా ఖాళీ చేయని సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా చేయని పక్షంలో వారి నుంచి అద్దెను వసూలు చేయలన్నది నిబంధన. కానీ ఈ నిబంధనను అమలు చేసిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. మాజీ కేంద్ర మంత్రి అజిత్ సింగ్ 108 రోజుల పాటు ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వ అకాడమేషన్ దొరక్క బయట ప్రైవేట్ అకామడేషన్లలో ఉంటున్న ఎంపీల్లో అశ్వినీ కుమార్, పూనం మహాజన్, భగ్వంత్ మన్ లాంటి ప్రముఖులు ఉన్నారు.