ఇక చెత్త ఏరుకునే వారికి అవార్డులు
ముంబయి: చిత్తుకాగితాలు ఏరుకునేవారంటే అందరికీ ఓ రకమైన ఏవగింపే. కానీ, ఇకనుంచి వారికి కూడా సమాజంలో మంచి గుర్తింపు లభించనుంది. పురస్కారాలు లభించనున్నాయి. చిత్తుకాగితాలు ఏరుకునే వారికి కూడా అవార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి వీరికి అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుందని పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు.
'చిత్తుకాగితాలు ఏరడం అనేది చెప్పుకునేంత గొప్పగా ఉండకపోవచ్చు. కానీ చాలా కాలంగా అది అత్యంత ముఖ్యమైన రంగం. వారు రోజంతా ఎంతో కష్టపడతారు. ఎన్నో నగరాలు విడుస్తున్న చెత్తచెదారాన్ని వేరు చేస్తూ పర్యావరణానికి మంచి చేస్తుంటారు. ఏళ్లుగా వారు సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నారు. అందుకే మేం వారికి గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాం. వచ్చే ఏడాది నుంచి యేటా అవార్డులు ఇస్తాం' అని జవదేకర్ చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో తమ శాఖ సాధించిన విజయాలపై మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.