విమర్శలకు ఎదురుదాడి సరికాదు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షాల విమర్శలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా అధికారపక్షం, ఎదురుదాడి చేయడమే మార్గంగా ఎంచుకోవడం సమంజసం కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త ఆలోచనలు, మార్పులుంటాయని ఆశించిన వారికి టీఆర్‌ఎస్ ప్రభుత్వపాలన ఆశాభంగాన్ని కలగజేసిందన్నారు. సోమవారం మఖ్దూంభవన్‌లో పార్టీనేత పల్లా వెంకటరెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన రూ.6 లక్షల పరిహారాన్ని గతంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సైతం వర్తింపచేయాలని డిమాండ్‌చేశారు.
వరంగల్ లోక్‌సభ సీటు ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని పోటీకి నిలిపే విషయంలో మిగతా వామపక్షాలతో చర్చించి త్వరలోనే నిర్ణయిస్తామని చాడ చెప్పారు. ఇదిలా ఉండగా సోమవారం మఖ్దూంభవన్‌లో చాడ వెంకటరెడ్డిని తెలంగాణ ఉద్యమవేదిక నేత చెరుకు సుధాకర్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ కలుసుకున్నారు. వరంగల్‌లో వినోద్‌కుమార్ అభ్యర్థిత్వానికి మద్దతునివ్వాలని ఆయనను సుధాకర్ కోరారు.
ఎన్‌కౌంటర్లపై ప్రభుత్వ వైఖరి తెలపాలి
ఇటీవల వరంగల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌తోపాటు నక్సలైట్ల అణచివేత, ఎన్‌కౌంటర్లపై స్పష్టమైన వైఖరి వెల్లడించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వామపక్షాలు నిర్ణయించాయి. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై సీఎం స్థాయిలో ప్రకటన వెలువడేలా నిరసనలు చేపట్టాలని భావిస్తున్నాయి. ప్రజాసంఘాలు, రాజకీయపార్టీలు కలుపుకుని విస్తృతస్థాయిలో చలో అసెంబ్లీ, ఇతరత్రా నిరసన కార్యక్రమాలను చేపట్టాలనే ఆలోచనతో ఉన్నాయి. ఈ మేరకు సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంతో విరసం నేత వరవరరావు సమావేశమయ్యారు.