అది నాఅదృష్టం.. అందుకే బాగా ఆడగలిగా: యువీ
ఎడ్జ్‌బాస్టన్‌లో బాట్స్‌మెన్ హవా నడిచింది. ముఖ్యంగా టీమిండియా బ్యాట్స్‌మెన్ ఈ బ్యాటింగ్ పిచ్‌పై చెలరేగిపోయారు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి, యువరాజ్‌సింగ్ అర్ధ సెంచరీలతో మెరువడంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఏకంగా 319 పరుగుల భారీ లక్ష్యాన్ని దాయాదికి నిర్దేశించింది.
భారత్ స్కోరు సాధించడంలో యూవీ కీలక పాత్ర పోషించాడు. కేవలం 32 బంతుల్లో యువీ 53 పరుగులు చేయడంతో భారత్ తన చివరి 11 ఓవర్లలో 127 పరుగులు రాబట్టింది. 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో సత్తా చాటిన యువీ 29 బంతుల్లోనే అర్ధ శతకాన్ని సాధించాడు. తద్వారా చాంపియన్స్ ట్రోఫీలో వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన భారతీయ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించాడు. అంతేకాదు పాకిస్థాన్‌పై వేగంగా అర్ధ సెంచరీ సాధించిన రెండో భారతీయుడిగా కూడా రికార్డు సొంతం చేసుకున్నాడు. యువీ కెప్టెన్ క్లోహితో కలిసి కేవలం పది ఓవర్లలో 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
దాయాదుల పోరులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సాధించిన యూవీ మాట్లాడుతూ ‘ ఇంతటి పెద్ద మ్యాచ్‌లో బాగా ఆడటం గొప్ప అనుభూతిని ఇస్తోంది. మొదట్లో నా క్యాచ్‌ను వదిలేయడం అదృష్టంగా భావిస్తున్నా. చివర్లో వేగంగా ఆడటానికి అది కలిసొచ్చింది’ అని చెప్పాడు. 8 పరుగుల వద్ద లాంగాఫ్‌లో యువీ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను హసన్ అలీ వదిలేయడంతో అతనికి లైఫ్ దొరికిన సంగతి తెలిసిందే. ఇక రోహిత్, శిఖర్ అందించిన ఓపెనింగ్ భాగస్వామ్యం వల్లే చివర్లో తాము మరింత చెలరేగి ఆడటానికి వీలు కల్పించిందని అన్నాడు.