అతని వల్లే.. ఊపిరి తీసుకోగలిగా: కోహ్లి
దాయాదుల పోరులో 32 బంతుల్లోనే 52 పరుగులు చేసి గేమ్ చేంజర్‌గా నిలబడ్డ యువీపై కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడు. అతను చెలరేగి ఆడుతుంటే.. అతని ముందు తానొక క్లబ్ బ్యాట్స్‌మన్‌లా చిన్నబోయానని అంగీకరించాడు.
నిజానికి వన్డేల్లో చెలరేగి ఆడటం కోహ్లి నైజం. కానీ ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కుదురుకోవడానికి కోహ్లి కొంత సమయం తీసుకున్నాడు. అయినా టీమిండియా స్కోరు బోర్డు ఎక్కడా ఆగలేదు. అందుకు కారణం యువీ దూకుడు. 36.4 ఓవర్లలో 192/2గా ఉన్న జట్టు స్కోరును మరో 58 బంతుల్లోనే 285/3కు యువీ-కోహ్లి జోడీ తీసుకెళ్లింది.
మొదట్లో కొంత తడబడ్డట్టు కనిపించిన కోహ్లి యువీ బాగా ఆడుతుండటంతో ఊపిరి తీసుకోగలిగాడు. అదే విషయాన్ని మ్యాచ్ అనంతరం కోహ్లి చెప్పాడు. ‘యువరాజ్ అద్భుతంగా ఆడాడు. నేను సరిగ్గా ఆడలేకపోయిన సమయంలో నాపై ఉన్న ఒత్తిడినంతా అతను దూరం చేశాడు. అతని ముందు నేనొక క్లబ్ బ్యాట్స్‌మన్నేమో అనిపంచింది. అతను ముమ్మూటికి గేమ్‌చేంజర్. అందుకే జట్టులోకి తీసుకున్నాం’ అని కోహ్లి అన్నాడు.