‘నోబాల్’పై ఆ ప్రశ్నతో బిత్తరపోయిన కోహ్లి!
లండన్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో నాటకీయ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విలేకరుల సమావేశంలో ముచ్చటించాడు. ఈ సమావేశం ఒకింత భావోద్వేగంగా, ఒకింత సరదాగా సాగిందని చెప్పాలి. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో పరాభవం అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నలకు కెప్టెన్ కోహ్లి సమాధాన ఇచ్చాడు. ఈ సందర్భంగా బుమ్రా వేసిన ‘నో బాల్’ గురించి ఓ జర్నలిస్టు అడిగాడు. మూడు పరుగుల వద్ద ఉన్నప్పుడే పాకిస్థాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ బుమ్రా బౌలింగ్‌లో ఎంఎస్ ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటవ్వబోయాడు. కానీ, బుమ్రా వేసిన ఆ బంతి నో బాల్ అని తేలడంతో జమాన్‌కు లైఫ్ దొరికింది. దానిని సద్వినియోగం చేసుకున్న అతను ఏకంగా సెంచరీ కొట్టి.. భారత్‌పై పాక్ 180 పరుగుల విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీని గురించి కోహ్లి-విలేకరి మధ్య ఈ విధంగా ఫన్నీ సంవాదం నడించింది.
విలేకరి: కెప్టెన్.. మీరు టాస్ గెలిచారు. అంతేకాకుండా నోబాల్‌కు వికెట్ సాధించారు. ఇదీ మీకు బాగా అనిపించిందా?
కోహ్లి: ఏమిటి? అది బాగా అనిపించడం ఏమిటి?
విలేకరి: అవును. ఆనందించే విషయమే కదా? టాస్ గెలువడం, నోబాల్‌కు వికెట్ సాధించడం? ఇది మీకు మంచిగా అనిపించలేదా?
కోహ్లి: మంచిగా అనిపించడమా? ఎవరికి?
విలేకరి: మీకే..
కోహ్లి: నోబాల్ మంచిగా అనిపించడం ఏమిటి?
విలేకరి: ఎందుకంటే నోబాల్‌కు వికెట్ వచ్చింది కదా!
కోహ్లి: మీరు మాట్లాడుతున్నదాంట్లో ఏమన్న అర్థం ఉందా? ఏం జరుగుతోంది.. అంటూ కోహ్లి ఈ సంవాదాన్ని ముగించాడు.