ఇంతకీ ఆ గొంతు బాబుదా.. కాదా?
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
తన పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన 'మహాసంకల్ప' సభలో చంద్రబాబు ప్రసంగం ఆసాంతం విన్న తర్వాత సామాన్యులకు అనేకానేక సందేహాలు తలెత్తుతున్నాయి.
''ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం నీచాతి నీచం. ఫోన్లు ట్యాప్ చేస్తే ప్రభుత్వాలే పడిపోయాయి. ఈరోజు నేను ఒక వ్యక్తిని కాను.. ఏపీ ముఖ్యమంత్రిని. నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్ కి ఎవరిచ్చారని అడుగుతున్నాను'' అని ఆయన అన్నారు. అంటే, తన ఫోన్ ట్యాప్ అయ్యిందని ఆయన అంగీకరించినట్లే అవుతుంది కదా. ఆడియో టేపుల్లో ఉన్న సంభాషణలలో గొంతు తనదేనని ఆయన చెప్పక చెప్పినట్లే కదా.
ఇక మరొక్క సెకను దాటగానే.. ''నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించారు. అవి టీ-ఛానల్లో ప్రసారం చేశారు. ఇది నీ జాగీరా.. కాదు. నామీద కుట్ర చేస్తున్నారు'' అన్నారు. అంటే, తన ఫోన్ ట్యాపింగ్ జరగలేదని, అది తన గొంతు కాదని చంద్రబాబు చెప్పినట్లవుతుంది.
ఇలా రెండు విభిన్న రకాల ప్రకటనలను వెంటవెంటనే చేసేయడం ఒక్క చంద్రబాబు నాయుడికే చెల్లు. ఈ రెండింటిలో ఏ ఒక్కటి వాస్తవం అయినా.. రెండోది కచ్చితంగా అవాస్తవమే అవుతుంది.
రాష్ట్రాల మధ్య చిచ్చు
ఓటుకు నోటు వ్యవహారంలో తన మనిషి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన వైనాన్ని జీర్ణించుకోలేని చంద్రబాబు.. ఈ వ్యవహారాన్ని రాజకీయ అవినీతి అన్నట్లు కాకుండా, అదేదో రెండు రాష్ట్రాల మధ్య వివాదం అన్న కలరిచ్చారు. ఈ విషయంలో ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ఏం చెప్పారో.. సరిగ్గా అవే మాటలను మరికొంత రంగులద్ది చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్లో మీకు పోలీసులుంటే మాకూ ఉన్నారు, మీకు ఏసీబీ ఉంటే మాకూ ఉందంటూ.. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలను రేకెత్తించేలా మాట్లాడారు. హైదరాబాద్లో ఉన్న ఆంధ్రుల ఇళ్లను కూల్చేస్తున్నారని, ప్రతిరోజూ ఆంధ్రావాళ్లను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు. వాస్తవానికి కేసీఆర్ అధికారం చేపట్టిన తర్వాత ఈ ఏడాది కాలంలో అలా జరిగిన దాఖలాలు లేవు.
చంద్రబాబు మాత్రం.. తన ఫోన్ ట్యాప్ చేయడం ఐదు కోట్ల మంది ఆంధ్రప్రజలకు అవమానమంటూ దీన్ని తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య గొడవగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఖబడ్దార్ అంటూ హెచ్చరించి, అక్కడ ఉన్నవాళ్లను రెచ్చగొట్టేందుకు తనవంతు ప్రయత్నం చేశారు. మధ్యలో 'ఏయ్.. మైకు సౌండు పెంచు' అంటూ, తన గొంతును మరింత పెంచారు.
ఈ విషయంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పిన విషయాలను ఒక్కసారి తప్పకుండా గుర్తు చేసుకోవాల్సిందే. ''చంద్రబాబు అత్యంత నీతిబాహ్యమైన, అత్యంత జుగుప్సాపరమైన రాజకీయాలకు తెరతీస్తున్నారు. రేవంత్ రెడ్డి చేసింది తప్పని గానీ, ఒప్పని గానీ ఆయన ఎందుకు చెప్పలేదు? తెలంగాణ ప్రభుత్వం నీ ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆధారాలుంటే బయటపెట్టు, అంతేతప్ప శిఖండి రాజకీయాలు చేయకు. దొంగపనులు చేయడానికి ముఖ్యమంత్రి పదవి లైసెన్సు కాదు. దొంగపనులు చేస్తే మంత్రులనైనా, ముఖ్యమంత్రులనైనా శిక్షించే అధికారం చట్టానికి ఉంటుంది'' అని కేటీఆర్ అన్నారు. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకైనా చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పినట్లు ఎవరికైనా అనిపిస్తే.. వాళ్లకు హ్యాట్సాఫ్!!