
చంద్రబాబు చరిత్రహీనుడు: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చరత్రహీనుడిగా మిగిలిపోతారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నిప్పులు చెరిగారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇప్పటివరకు రూ. 13వేల కోట్ల నిధులు అందాయని ఓ యువ నాయకుడు గుంటూరులో నగ్నంగా అబద్ధాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం గుంటూరులో వైఎస్ జగన్ నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన సందర్భంగా ఆయన దీక్షావేదిక వద్ద ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..
- నిరాహార దీక్షకు కూర్చున్న జగన్కు సంఘీభావం తెలపాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రత్యేక హోదా రాకుండా చేస్తున్న కుట్రను ఖండించాలని ఎండను, ఆకలిని లెక్కచేయకుండా ప్రజలంతా తరలివచ్చారు.
- పార్లమెంటు సాక్షిగా చర్చ జరిగినా రాష్ట్రానికి ఇస్తానన్న ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వట్లేదు? ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయి.
- ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మేలు ఏవిధంగా జరుగుతుందో జగన్ ఇప్పటిదాకా వివరించారు.
- ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ఫార్మా కంపెనీలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్కు తరలివెళ్లాయి. అందుకు కారణం అక్కడ ప్రత్యేక హోదా ఉండటమే. అక్కడ ఉన్న రాయితీల వల్లే కంపెనీలు ఏపీ నుంచి తరలిపోయాయి.
- కొండల నడుమ ఉన్న ఉత్తరాఖండ్లో వేల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. 5 లక్షల పాతికవేలమందికి ఉద్యోగాలు వచ్చాయి. ఆ రాష్ట్రం ఆర్థికంగా బలపడింది.
- అక్కడున్న కంపెనీలకు ఆదాయపన్ను, ఎక్సైజ్, రుణ రాయితీలు లభించాయి. ప్రత్యేక హోదా వల్లనే ఈ లబ్ధులు చేకూరాయి.
- పార్లమెంటులో చర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే.. ఐదేళ్లు సరిపోదు పదేళ్లు ఇవ్వాలని అప్పట్లో వెంకయ్యనాయుడు కోరారు.
- కొన్ని స్వలాభాలు, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదా పోరాటానికి వెన్నుచూపుతున్నారు. చంద్రబాబుకు పోరాటపటిమ లేదు.
- ప్రత్యేక ప్యాకేజీ అనేది ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయమా?
- ప్రత్యేక ప్యాకేజీ అనేది కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఆధారపడ్డది మాత్రమే. అదే ప్రత్యేక హోదాతో చట్టబద్ధంగా ప్రభుత్వాలు మారినా రాష్ట్రానికి అన్ని ప్రయోజానాలు చేకురుతాయి.
- పొద్దున్న లేస్తే ఒక్కటే పాట. రాజధాని, సింగపూర్, జపాన్ వీటి చుట్టే పాలన అంతా జరుగుతున్నది. ప్రజల కష్టాల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
- ఇసుక దందా, లిక్కర్ దందా కొనసాగుతున్నా.. నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నా పట్టించుకోవడం లేదు. రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది.
- రుణమాఫీ లేదు. విత్తనాలు లేవు. సబ్సిడీలు లేవు. ఖరీఫ్ పంటలు లేవు. బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు.
- ఇంత దుర్భరంగా ఆంధ్రప్రజలు ఉంటే.. ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ చాలని మాట్లాడటం దారుణం.
- ప్రత్యేక హోదా కోసం ప్రాణాలొడ్డి జగన్ నిరాహార దీక్షకు కూర్చున్నారు.
- ఆయన నిరాహార దీక్ష ఫలితంగా ఈ రాష్ట్రం ప్రత్యేక హోదా సాధించాలని కోరుతున్నాను.