'ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారు'
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష కొనసాగుతుందని పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కేబినెట్ నిన్న సమావేశం అయ్యి కూడా ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న దీక్షపై చర్చ చేయకపోవడం, ఎలాంటి ప్రకటన స్పందన లేకపోవడం దారుణం అన్నారు. ఇష్టమొచ్చినట్లుగా చంద్రబాబునాయుడు, ఆయన మంత్రులు ప్రవర్తిస్తున్నారని, మాట్లాడుతున్నారని ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటుందని, ఇది సరైన పద్ధతి కాదని చెప్పారు.
మరోపక్క, పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేకుండా పోయిందని అన్నారు. ఢిల్లీలో దీక్ష చేయాలని వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు మంత్రులు అపహాస్యం చేస్తున్నారని, వీరికి తగిన సమాధానం ప్రజలు చెప్పే రోజు దగ్గరిలోనే ఉందన్నారు. గతంలో కుటుంబకార్యక్రమంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన చంద్రబాబు ఈ సారి శంఖుస్థాపన కూడా అలాగే చేస్తున్నారని మండిపడ్డారు. ఓ పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైఎస్ జగన్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వం తమకేమి పట్టనట్లు ఉంటుందని, దీనికి వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు.