'వైఎస్ జగన్ ప్రాణాలు లెక్కచేయడం లేదు'
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం పట్ల పార్టీ సీనియర్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం కీలక నేతల భేటీ నిర్వహించిన అనంతరం పార్టీ నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్ జగన్ పట్టుదలతో ఉన్నారని చెప్పారు.
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా జగన్ దీక్ష చేస్తున్నారని చెప్పారు. దీక్షకు భారీ ఎత్తున మద్దతు లభిస్తోందని, అశేష ప్రజానీకం మద్దతు తెలుపుతోందని వివరించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. ఏపీ అభివృద్ధికి ప్రత్యేక హోదా మాత్రమే సంజీవని ఆయన అన్నారు. 22న రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక హోదాపై స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. జగన్ దీక్షపై చంద్రబాబు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే జాలి వేస్తుందని అన్నారు.
చంద్రబాబులా మోసం చేసే మాటలు జగన్ కు తెలియవదని అన్నారు. అలీబాబా నలభై దొంగల్లా పంచభూతాలను టీడీపీ దోచుకుంటుందని ఆరోపించారు. టీడీపీ నేతల తీరును ప్రజలంతా గమనిస్తున్నారని, పోలవరంపై బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సింగపూర్ మంత్రి ఈశ్వరన్.. బాబు భాగస్వామా కాదా అని ప్రశ్నించారు. వ్యాపార భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకే రాజధాని భూముల తాకట్టు పెట్టారని చెప్పారు.