
జగన్‌పై కేసుల విషయంలోనే చంద్రబాబు ఢిల్లీ యానం: కేశవ్
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనలో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై కేసుల వ్యవహారం కూడా ఎజెండాగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ స్పష్టంచేశారు. ఆయన శనివారం ఎన్‌టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. జగన్ కేసుల్లో దర్యాప్తు ఇంకా పూర్తి కాక ముందే తుది చార్జిషీటు ఎలా దాఖలు చేస్తారని ప్రశ్నించారు. ఇదే అంశంపై దర్యాప్తు సంస్థలను కలుస్తామన్నారు. సీబీఐ, ఈడీల దర్యాప్తు వేగం తగ్గిందన్నారు. దర్యాప్తుపైన తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు.
సీబీఐ చెప్పినట్టు సమానమైన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేయలేదన్నారు. ఈ విషయాలన్నింటినీ ఆయా దర్యాప్తు సంస్థల పెద్దలను, ప్రభుత్వంలోని ముఖ్యులను కలిసి వివరిస్తామన్నారు. జగన్ కేసును పర్యవేక్షించే సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను తొలుత బదిలీ చేశారని, ఆయన బదిలీ వ్యవహారంపై కొందరు కోర్టును ఆశ్రయిస్తే తాము పర్యవేక్షణాధికారిని బదిలీ చేశాం తప్ప దర్యాప్తు అధికారిని కాదని అపుడు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపిందని, తాజాగా దర్యాప్తు అధికారి వెంకటేష్‌ను కూడా బదిలీ చేసి మరో అధికారిని నియమించారని కేశవ్ పేర్కొన్నారు.
ఈ ప్రశ్నలకు బదులివ్వగలరా?
ఈ విలేకరుల సమావేశానికి ‘సాక్షి’ని అనుమతించలేదు. వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ వార్తను ఇస్తున్నాం. ఒకవేళ అనుమతించి ఉంటే ‘సాక్షి’ ఈ కింది ప్రశ్నలు వేసి సమాధానాలు కోరేది...
- జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులో నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయమని స్వయంగా సుప్రీంకోర్టే చెప్పింది? ఆ గడువు సెప్టెంబర్ 9 తో ముగిసింది. ఆ తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. అయినా సరే జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవద్దన్నది మీ పార్టీ ఉద్దేశమా? ఇప్పటికే దాదాపు 16 నెలలుగా జైలులో పెట్టారు. ఇంకెంతకాలం పెట్టాలని మీ ఉద్దేశం? రాజ్యాంగం ప్రకారం జగన్‌కు ఎలాంటి హక్కు ఉండకూడదని మీరు చెప్తున్నారా?
- జగన్ అంటేనే మీరెందుకు భయపడుతున్నారు? ఆయన ను ప్రజలు అభిమానిస్తున్నారు కనుక ఆయన జైలు బయటకు రాకుండా ఉండాలని మీ పార్టీ కోరుకుంటోందా?
- జగన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నప్పుడల్లా మీరు ఢిల్లీ వెళ్లి తెరవెనుక తతంగాలు ఎందుకు జరుపుతున్నట్లు? మీ నాయకుడు చంద్రబాబు చీకటి భేటీలకు సంబంధించి కేంద్రమంత్రి చిదంబరం స్వయంగా లోక్‌సభలో చెప్పిన విషయం మరిచారా?
- జగన్‌పై 2010 ఆగస్టులో సీబీఐ కేసులు నమోదు చేసి గడిచిన మూడేళ్లకు పైగా దర్యాప్తు సాగిస్తోంది. అయినా దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని మీరెలా చెప్తారు? దర్యాప్తు పూర్తి కాలేదని సీబీఐ మీ పార్టీ నేతలకు చెప్పిందా? లేదా సీబీఐ లోపల మీ మనుషులెవరైనా ఉన్నారా?
- గతంలో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంలోనే మీ పార్టీ ఎంపీలు వెళ్లి కేంద్రమంత్రి చిదంబరంను కలవటం.. వెంటనే ‘సాక్షి’ ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ ఆదేశాలివ్వటం వెనుక మతలబు ఏమిటి?
- సీమాంధ్రలో ప్రజలు పెద్దఎత్తున ఉద్యమిస్తుంటే.. తెలుగు ఆత్మగౌరవ యాత్ర అంటూ బయలుదేరిన చంద్రబాబు అకస్మాత్తుగా ఆ యాత్రకు బ్రేక్ వేసి ఢిల్లీ వెళ్లటానికి ప్రణాళికలు రూపొందించటమంటే.. ప్రజల సమస్యలకన్నా మీ దృష్టి జగన్‌పైనే ఉందన్న విషయం అర్థంకావటం లేదా?
- సాధారణంగా సీబీఐలో ఎవరైనా అధికారి మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పైన పనిచేస్తారు. అయినా జేడీ లక్ష్మీనారాయణను అసాధారణంగా ఏడేళ్ల పాటు కొనసాగించిన విషయం మీకు తెలియదా? అంతకుమించి కొనసాగించటానికి కూడా సీబీఐ నిబంధనలు అంగీకరించవని తెలియదా? అలాగే దర్యాప్తు అధికారి వెంకటేష్ డిప్యుటేషన్ కూడా గడిచిన జూలైలోనే పూర్తయిందన్న విషయం తెలియదా?
- జగన్‌పై కేసుల విషయంలో మీరు చెప్పిన అధికారులే దర్యాప్తు చేయాలని కోరుతున్నారా? మీరు చెప్పినట్టు నడుచుకునే అధికారులే ఉండాలని ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కోరతారా?