నెల రోజులే గడువు | chandrababu naidu asks officials to expedite Krishna Pushkaralu works | Sakshi
Sakshi News home page

నెల రోజులే గడువు

Published Sat, Jul 2 2016 5:12 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

నెల రోజులే గడువు

నెల రోజులే గడువు

*కృష్ణా పుష్కరాల పనులకు డెడ్‌లైన్
*ప్రతిరోజూ సాంస్కృతిక కార్యక్రమాలు
*అట్టహాసంగా ముగింపు ఉత్సవాలు
*అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం
*ఈనెల 16న శ్రీశైలంలో మరోసారి సమీక్ష


విజయవాడ, జులై 2 : కృష్ణా పుష్కరాల కోసం చేపట్టిన అభివృద్ధి పనులు, భక్తుల కోసం తలపెట్టిన ఏర్పాట్లు ఈనెలాఖరులోగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పనులు వేగవంతంగా పూర్తిచేయాలని, గడువులోగా పూర్తి చేయకుంటే చర్యలు తీసుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఆరు నెలలు ముందే పనులు ప్రారంభించినా పనులు ఇంకా కొలిక్కిరాకపోవడం అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి వర్షాలతో ఆటంకం రాకముందే పనులు పూర్తి చేయాల్సిందిగా సూచించారు.

శనివారం విజయవాడలోని తన కార్యాలయంలో కృష్ణా పుష్కరాలపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి...నాణ్యత దెబ్బతినకుండా రహదారుల నిర్మాణం చేపట్టాలని, అవసరం లేని చోట రోడ్ల నిర్మాణాన్ని పుష్కరాల తరువాత పూర్తి చేయాలని సూచించారు. రహదారుల విస్తరణ కోసం ఆలయాలను తొలిగించాల్సి వస్తే ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. శాస్త్రోక్తంగా మరో చోటుకి విగ్రహాలను తరలించాలన్నారు. విద్యుత్ స్తంభాల నిర్మాణం రోడ్డు నిర్మాణ పనులతో సమాంతరంగా సాగాలన్నారు. ప్రతి రోజూ అభివృద్ధి పనులు జరుగుతున్న తీరును, నాణ్యతను అధికారులు పరిశీలించాల్సిందిగా చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని అన్నారు. పుష్కరాలను పురస్కరించుకుని విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు.

భక్తుల పుష్కర స్నానాలకు వీలుగా సాధ్యమైనంత వరకు ఘాట్ల దగ్గర నీరు స్వచ్ఛంగా వుండేలా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి ముందే కార్యాచరణ పథకం సిద్ధం చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఇందుకోసం వారంలోగా యాక్షన్‌ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. భక్తులు నడిచేందుకు, పుష్కరఘాట్లను చేరేందుకు రహదారులకు ఓవైపు బారికేడ్‌లను నిర్మించి సౌకర్యవంతంగా వుండేలా చూడాలని అన్నారు. బారికేడ్ల కోసం ప్రతిసారి రోడ్లను తవ్వకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై యోచించాలని చెప్పారు. అంబులెన్స్‌లు అందుబాటులో వుంచడంతో పాటు ప్రాథమిక చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. గోదావరి పుష్కరాల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై, సౌకర్యాల కల్పనపై 95 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని, అదే స్ఫూర్తితో మరింత మెరుగ్గా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి చెప్పారు.  

దేవాలయాలను త్వరితగతిన అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి పుష్కరాలకు వచ్చే భక్తులకు అన్నదానంతో పాటు, వసతి కల్పించడం కోసం సత్యసాయి ట్రస్ట్, టీటీడీ, రోటరీ క్లబ్‌లు, స్వచ్ఛంద సంస్థలు, అక్షయపాత్ర, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహా స్థానికులను ప్రోత్సహించాలన్నారు. విజయవాడ, గుంటూరులో వీధి దీపాలకు ఎల్ఈడీ బల్బులను అమర్చాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆగస్ట్ 1 నాటికి పుష్కర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ శోభ తీసుకు రావాలన్నారు. పుష్కరాలను ముందు తరాలు గుర్తుంచుకునేలా ‘కృష్ణాతీరం’ పేరుతో సావనీర్ ప్రచురిస్తే బావుంటుందని అభిప్రాయపడ్డారు.

పుష్కరాలకు వచ్చే ప్రతి ఒక్కరూ దుర్గమ్మ దర్శనం కోసం ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం వున్నందున రోజుకు కనీసం లక్ష మంది అయినా దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా పవిత్ర సంగమం దగ్గర దుర్గగుడి నమూనా ఆలయం సైతం ఏర్పాటు చేయాలని అన్నారు. కృష్ణా పుష్కరాలకు ప్రముఖులను, పీఠాధిపతులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని ఆదేశించారు. పుష్కరాలు జరిగే ప్రతి రోజూ కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని గ్రామాల్లో  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. పుష్కరాల 12 రోజులు ఒక్కోరోజూ ఒక్కో సాంస్కృతిక కార్యక్రమంతో భక్తులకు ఆహ్లాదం పంచాలని చెప్పారు. పుష్కరాల చివరి రోజు ముగింపు ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ ముగింపు ఉత్సవాలకు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదిక కానుంది.

కృష్ణా పుష్కరాల కోసం కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో రూ. 216.42 కోట్లతో 379 పనులు పంచాయతీరాజ్ శాఖ చేపడుతుండగా, రూ. 239.63 కోట్లతో 314 పనులను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ పూర్తి చేస్తోంది. రూ. 139.65 కోట్లతో 583 పనులను దేవాదాయ శాఖ, రూ. 334 కోట్ల విలువైన 188 పనులను జలవనరుల శాఖ చేపట్టింది. మొత్తంమీద అన్ని శాఖలు కలిసి రూ. 1,277.87 కోట్ల అంచనా వ్యయంతో 1,602 అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నాయి. ఇంకా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకోని పనులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈనెల 16న శ్రీశైలంలో కృష్ణా పుష్కరాలపై మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.  

కాగా పుష్కరాలు నిర్వహించే ప్రాంతంలో మొత్తం మూడు చోట్ల ఫుడ్ ఫెస్టివల్‌, రెండు చోట్ల లేజర్ షో ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే భారీఎత్తున తరలివచ్చే వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పించేందుకు 139 ప్రైవేట్ పార్కింగ్ ప్లేస్‌లను గుర్తించినట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు పల్లె రఘునాధరెడ్డి, దేవినేని ఉమమహేశ్వరరావు,  ప్రత్తిపాటి పుల్లారావు,  శిద్ధా రాఘవరావు,  పైడికొండల మాణిక్యాలరావు, నారాయణ, కొల్లు రవీంద్ర,  రావెల కిషోర్ బాబు, విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement