చంద్రయాన్-1 జాడ దొరికింది
వెల్లడించిన నాసా శాస్త్రవేత్తలు
వాషింగ్టన్: చంద్రుడిపై పరిశోధనకు ఇస్రో పంపిన ఏడాది లోపే ఆచూకీ లేకుండా పోయిన చంద్రయాన్–1 అంతరిక్షనౌకను కనుగొన్నామని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. అది ఇంకా చంద్రుడి చుట్టూ తిరుగుతోందని వెల్లడించారు. చంద్రయాన్–1ను 2008, అక్టోబర్ 22న ఇస్రో అంతరిక్షంలోకి పంపింది. అయితే 2009, ఆగస్టు 29 తర్వాత దాని నుంచి ఎటువంటి సంకేతాలు లేవు. దానికి సంబంధించిన సమాచారం కూడా లేదు. ఇటీవల నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరెటరీ (జేపీఎల్) శాస్త్రవేత్తలు దానిని కనుగొన్నారు. చంద్రుడి ఉపరితలానికి 200 కిలోమీటర్ల దూరంలో అది ఇంకా పరిభ్రమిస్తోందని చెప్పారు. భూ ఆధారిత రాడార్ వ్యవస్థతో నాసాకు చెందిన లూనార్ రీకానయ్‌సెన్స్ ఆర్బిటార్ (ఎల్‌ఆర్‌వో)తో పాటు ఇస్రోకు చెందిన చంద్రయాన్–1ను కనుగొన్నామని జేపీఎల్ ప్రధాన శాస్త్రవేత్త మారిన బ్రొజోవిక్ తెలిపారు.
చంద్రయాన్–1 నౌక స్మార్ట్ కార్‌లో సగం కూడా ఉండకపోవడం, చాలా కాలంగా సమాచారం లేకపోవడంతో దానిని కనుగొనడం కష్టమైందని బ్రొజోవిక్ చెప్పారు. 3.80 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రయాన్‌ను కనుగొనడానికి కాలిఫోర్నియాలోని గోల్డ్‌స్టోన్ డీప్ స్పేస్ కమ్యూనికేషన్స్ కాంప్లెక్స్‌లో 70 మీటర్ల ఏంటెన్నాను నాసా శాస్త్రవేత్తలు వినియోగించారు. చంద్రుడు చుట్టూ పరిభ్రమించడానికి చంద్రయాన్–1కు రెండు గంటల ఎనిమిది నిమిషాలు పడుతోందని లెక్కగట్టారు. చంద్రుడిపై పరిశోధనలకు రెండేళ్ల కాల పరిమితితో చంద్రయాన్–1ను అంతరిక్షంలోకి పంపారు. ఏడాదిలోగానే దాని జాడ లేకుండా పోయినా.. అది చేయాల్సిన పనుల్లో 95 శాతం పూర్తి చేసింది. చంద్రుడి ఉపరితలంపై నీటి పరమాణువుల జాడను కనుగొనడం చంద్రయాన్–1 పరిశోధనల్లో ప్రముఖమైనది.