
డెబిట్ కార్డు గడువు తీరుతోందంటూ మోసం
ఓ వృద్ధురాలికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి డెబిట్ కార్డు గడువు తీరిపోతోందటూ వివరాలు సంపాదించి నగదు డ్రా చేసుకున్నాడు.
మల్కాజిగిరి (హైదరాబాద్): ఓ వృద్ధురాలికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి డెబిట్ కార్డు గడువు తీరిపోతోందటూ వివరాలు సంపాదించి నగదు డ్రా చేసుకున్నాడు. ఈ సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. విష్ణుపురికాలనీ డూమేజ్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సీవీ శర్మ భార్య అన్నపూర్ణ విశాలాక్షి సెల్‌ఫోన్‌కు గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఫోన్ చేశాడు.
‘మీ డెబిట్ కార్డు గడువు ముగుస్తున్నదని, రెన్యువల్ చేసుకోవాలని’ చెప్పడంతో ఆమె నిజమేనని నమ్మింది. కార్డు రెన్యువల్ చేయాలంటే దాని వెనుక ఉన్న సీవీవీ నెంబర్ చెప్పాలనడంతో ఆమె వివరాలు తెలిపింది. కొద్ది సేపటికే అన్నపూర్ణకు చెందిన ఎస్‌బీహెచ్ ఖాతా నుంచి రూ.15 వేలు డ్రా చేసినట్లుగా సమాచారం రావడంతో మోసపోయామని గుర్తించి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.