హోమోసెక్సువల్స్ కోసం కాన్సంట్రేషన్ క్యాంపులు | Chechnya opens world's first concentration camp for homosexuals | Sakshi
Sakshi News home page

హోమోసెక్సువల్స్ కోసం కాన్సంట్రేషన్ క్యాంపులు

Published Tue, Apr 11 2017 7:13 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

హోమోసెక్సువల్స్ కోసం కాన్సంట్రేషన్ క్యాంపులు

హోమోసెక్సువల్స్ కోసం కాన్సంట్రేషన్ క్యాంపులు

- ప్రపంచంలోనే తొలిసారి ప్రారంభించిన చెచెన్యా రిపబ్లిక్
- దారుణ నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తున్న వ్యతిరేకత

గ్రోజ్నీ:
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూదులను హింసించేందుకు జర్మన్ నియంత హిట్లర్ ప్రత్యేకంగా ఏర్పాటుచేయించిన కాన్సంట్రేషన్ క్యాంపుల గురించి చాలానే చదివాం. 'కాన్సంట్రేషన్ క్యాంపులో ఉండటంకంటే చచ్చి నరకానికి వెళ్లడమే నయం' అనుకునేంత స్థాయిలో క్రూరహింసలు అమలయ్యేవక్కడ! సరిగ్గా అలాంటి క్యాంపులనే, స్వలింగ సంపర్కుల(హోమోసెక్సువల్స్)ను శిక్షించేందుకు ప్రారంభించింది చెచెన్యా సర్కారు. అధికారిక ఉత్తర్వులతో మంగళవారం ప్రారంభమైన ఈతరహా కాన్సంట్రేషన్ క్యాంపుల ఏర్పాటు ప్రపంచంలోనే తొలిసారి కావడం గమనార్హం.

దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతోన్న స్వలింగసంపర్కులను నిరోధించేందుకు, వారిని సంస్కరించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. అర్గూన్ సహా పలు నగరాల్లో ఈ క్యాంపులు ఏర్పాటయ్యాయి. గతవారం దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు జరిపిన దాడుల్లో 100 మంది స్వలింగ సంపర్కులు పట్టుబడ్డారు. వారిలో పారిపోయేందుకు ప్రయత్నించిన ముగ్గురిని పోలీసులు కాల్చిచంపినట్లు సమాచారం.

అలా పట్టుబడిన స్వలింగ సంపర్కులను కాన్సంట్రేషన్ క్యాంపులకు తరలించి తీవ్రంగా హింసిస్తున్నారని, కరెంట్ షాకులు ఇచ్చి చంపేస్తున్నారని ఎల్.జి.బి.టి హక్కుల ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. 'ఈ దేశంలో హోమోసెక్సువల్స్ ఉండటానికి వీల్లేదని, అలవాట్లు మార్చుకోనివారు దేశం విడిచి వెళ్లాలని పోలీసులు బెదిరిస్తున్నారు'అని ఓ కార్యకర్త ఆరోపించాడు.

ఓవైపు ప్రపంచవ్యాప్తంగా లెస్బియన్,గే,బైసెక్సువల్,ట్రాన్స్ జెండర్(ఎల్.జి.బి.టి) హక్కుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. స్వలింగ సంపర్కం అంశం చుట్టూ తిరిగే 'మూన్ లైట్' సినిమా ఈ ఏటి ఆస్కార్ ఉత్తమ చిత్రంగా నిలవడం ఎల్.జి.బి.టి హక్కుల పోరాటానికి మరింత ఊపునిచ్చినట్లయింది. ఈ తరుణంలోనే చెచెన్యా రిపబ్లిక్ తీసుకున్న తీవ్రనిర్ణయం మున్ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ప్రస్తుతానికి రష్యాలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ, ఇస్లాం సంప్రదాయాలు అధికంగా పాటించే చెచెన్యా ప్రాంతం.. చెచెన్యా రిపబ్లిక్ పేరుతో ప్రత్యేక గుర్తింపు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement