ఉక్రెయిన్‌పై యుద్ధంలో మాస్కో వర్గాలు.. పాశ్చాత్య దేశాల ఊహకు తగ్గట్లే అడుగులు వేస్తున్నాయి. ప్రధాన నగరాలు, ఆపై అణు రియాక్టర్లు, అటుపై పోర్టు సిటీలు దాడులతో ఉక్రెయిన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా నిఘా వర్గాలు ఊహించినట్లే మరొకటి జరిగింది.
రెండు దేశాల మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్ పై యుద్ధం చేయడానికి ఇతర దేశాల ఫైటర్లను రష్యా నియమించుకుంటోంది. ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే లక్ష్యంతో చేస్తున్న యుద్ధంలో రష్యా భారీ విధ్వంసానికి దిగినప్పటికీ.. ఉక్రెయిన్ దళాల నుంచి ప్రతిఘటనే ఎదురవుతోంది. రష్యా సైన్యం భారీగా నష్టపోతోంది. ఇప్పటికే ఎంతో మంది రష్యన్ సైనికులను ఉక్రెయిన్ బలగాలు చంపేశాయి. మరెందరో రష్యన్ సైనికులు ఉక్రెయిన్ కు బంధీలుగా చిక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం బయటకు వచ్చాయి.
ఇక రష్యా కాంట్రాక్ట్ ఫైటర్లను నియమించుకుంటున్న విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది. నలుగురు అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సదరు కథనం పేర్కొంది. సిరియాతో పాటు చెచెన్యా ఫైటర్లను ఇప్పటికే నియమించుకుందట రష్యా. ఇందుకోసం ఫైటర్లతో ఆరు నెలల ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నట్లు సమాచారం. రోజూ 200 నుంచి 300 డాలర్ల జీతం వీళ్లకు ముట్టజెప్పనుంది రష్యా. రాజధాని కీవ్ ముట్టడి కోసమే ఈ నియామకాలని అమెరికా అధికారులు భావిస్తున్నారు.
ఇక ఈ ప్రైవేట్ ఫైటర్లు నగరాల ముట్టడిలో రాటుదేలిన వాళ్లని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎంత మందిని, ఈ రెండు దేశాల నుంచే కాకుండా వేరే దేశాల నుంచి కూడా నియమించుకుందా? అనే సమాచారం మాత్రం వెల్లడించలేదు సదరు కథనం. మరోవైపు ఈ యుద్ధంలో రష్యా గనుక సిరియా సాయం తీసుకుంటే.. తాము ఉక్రెయిన్‌కు మద్ధతుగా రంగంలోకి దిగుతామని సిరియా రెబెల్స్ ఇప్పటికే ప్రకటించేశారు.
Comments
Please login to add a commentAdd a comment