వన్‌కార్డుతో నేరగాళ్లకు చెక్ | check by the Criminals with one card | Sakshi
Sakshi News home page

వన్‌కార్డుతో నేరగాళ్లకు చెక్

Published Sat, Sep 26 2015 2:54 AM | Last Updated on Sat, Aug 11 2018 8:54 PM

check by the Criminals with one card

* ఆధార్‌కార్డుల ఫోర్జరీ నేపథ్యంలో పోలీసుల కొత్త ఆలోచన
* ఓటర్‌ఐడీ, ఆధార్, రేషన్‌కార్డు వివరాలను నిక్షిప్తం చేసేలా ప్రణాళిక
* చిన్నపాటి చిప్ ఉండేలా కార్డుల రూపకల్పన
సాక్షి, హైదరాబాద్: నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. నేరగాళ్ల సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకునే సదుపాయాన్ని ప్రవేశపెడుతోంది. గుర్తింపుకార్డులను ఫోర్జరీ చేస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నవారికి చెక్ పెట్టేందుకు వన్‌కార్డును రూపొందించాలని యోచిస్తోంది.

ఓటర్‌ఐడీ, ఆధార్, రేషన్‌కార్డును నిక్షిప్తం చేసి వన్‌కార్డు తేవాలని భావిస్తోంది. ఈ కార్డుకు చిప్‌ను అమర్చి అన్ని అవసరాలకు వినియోగించేలా చూస్తారు. పోలీస్‌శాఖతోపాటు అవసరమైన అన్ని విభాగాల్లో చిన్నపాటి యంత్రాన్ని ఏర్పాటు చేస్తే, దాని సహాయంతో క్షణాల్లో ఎదుటి వ్యక్తి గురించి అక్కడికక్కడే పూర్తి సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఈ కార్డు ద్వారా ఉంటుంది. అయితే, వన్‌కార్డు పేరుతో గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రైవేట్ కంపెనీ పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడి బిచాన ఎత్తేసింది.

ఇప్పుడు అలాంటి వాటికి తావ్వికుండా హోంశాఖ పర్యవేక్షణలోనే ఏకరూప కార్డులను అతితక్కువ ఖర్చుతో రూపొందించాలని భావిస్తోంది. రేషన్, గ్యాస్, బ్యాంకు, వాహనాల కొనుగోలు, అమ్మకం... ఇలా అన్నిచోట్లా ఆధార్ గుర్తింపుకార్డు తప్పనిసరి. పోలీసులు కూడా నింది తుల్ని గుర్తించేందుకు దీన్నే ఆధారంగా ఎంచుకుంటున్నారు. ఏదైనా కేసులో అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నప్పుడు అతను చూపించే ఆధార్‌కార్డు అసలైనదా.. కాదా.. అని తెలుసుకునేందుకు ఎలాంటి సదుపాయం లేదు. ఆధార్‌కార్డుపై బార్‌కోడింగ్ ఉన్నా దాన్ని సరిచూసుకునే యంత్ర పరికరాలు లేవు.

దీంతో లొసుగులను ఆసరా చేసుకొని కొందరు కేటుగాళ్లు ఫోర్జరీకి పాల్పడుతున్నారు. సాధారణ వ్యక్తుల ఆధార్‌కార్డులో తమ ఫొటో, పేరు ఫొటోషాప్ సహాయంతో మార్చేసి నకిలీకార్డును సృష్టిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఓటరు గుర్తింపు, రేషన్‌కార్డులు కూడా ఫోర్జరీకి గురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో పట్టుబడిన పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన సిమీ సానుభూతిపరుల వద్ద కూడా వందల సంఖ్యలో ఓటరు ఐడీ, ఆధార్‌కార్డు లభించాయి.

వీటి ద్వారా ఏకంగా భారతదేశపు పాస్‌పోర్టును సైతం పొందారు. ఈ నేపథ్యంలో అన్ని కార్డులకు సంబంధించి ‘వన్‌కార్డు’ రూపొందించాలని అధికారులు యోచిస్తున్నారు. ఫోర్జరీకి పాల్పడేవారు సైతం అన్ని కార్డులకు సంబంధించిన సమాచారాన్ని తారుమారు చేసే అవకాశం ఉండదు. వీటివల్ల  నేరాలను, నేరగాళ్లను నియంత్రిచవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement