ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ సింగ్పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆ రాష్ట్రఎన్నికల ప్రచారంలో భాగంగా రాజనంద్గావ్లో ఏర్పాటు చేసిన ర్యాలీలో శుక్రవారం రాహుల్ ప్రసంగించారు. ఛత్తీస్గఢ్లోని రమణ్ సింగ్ ప్రభుత్వం అవినీతిలో ప్రపంచరికార్డును సొంతం చేసుకుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. పదేళ్లుగా బీజేపీ ఏలుబడిలో ఉన్న ఛత్తీస్గఢ్ సాధించిన ప్రగతి మాత్రం శూన్యమని రాహుల్ విమర్శించారు.
ఉపాధి కోసం అనేక మంది ఛత్తీస్గడ్ నుంచి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు వలస వస్తున్నారని రాహుల్ అన్నారు. ప్రజలతోనే అధికారం సాధ్యమని కాంగ్రెస్ భావిస్తుందని ఆయన తెలిపారు. అయితే ముఖ్యమంత్రుల వల్లే అధికారం సాధ్యమని బీజేపీ ప్రగాఢంగా నమ్ముతుందని ఆ పార్టీపై రాహుల్ వ్యంగ్యస్త్రాలు సంధించారు.
దేశంలో సామాన్యుడి చేతిలో ఆయుధమైన సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కాంగ్రెస్ పాలనలోనే చట్టంగా రూపుదిద్దుకుందన్న సంగతిని కాంగ్రెస్ యువరాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. దర్భాఘట్లో ఇటీవల మావోయిస్టుల కాల్పుల్లో కాంగ్రెస్కు చెందిన కీలక నేతలు మరణించారని అయితే ....దానిపై రమణ సింగ్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.