న్యూఢిల్లీ: లోక్ అదాలత్‌లు ప్రజలకు సత్వర న్యాయం అందించడానికి ఉద్దేశించిన ఉత్తమ వ్యవస్థ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సదాశివం అన్నారు. అయితే, అక్కడ ఇచ్చే తీర్పులు కక్షిదారులు అప్పీల్‌కు వెళ్లేలా ఉండకూడదని లోక్‌అదాలత్ సభ్యులకు సూచించారు. కేసులో తుది నిర్ణయానికి లేదా రాజీకి కక్షిదారులు బలవంతంగానో, మాయమాటల వల్లో కాకుండా స్వచ్ఛందంగా అంగీకారం తెలిపేటట్లుగా ఉండాలన్నారు. శనివారం సుప్రీంకోర్టులో ఏర్పాటుచేసిన జాతీయ లోక్ అదాలత్‌ను సీజేఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమార్కులు ఫోర్జరీలు, అడ్డదారులు తొక్కడానికి లోక్‌అదాలత్‌లు అవకాశం ఇవ్వకూడదని సూచించారు. కక్షిదారులను భయపెట్టడానికి, తప్పుదారి పట్టించడానికి, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితం చేయడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా పరిష్కరించాలని లోక్ అదాలత్ సభ్యులకు సూచించారు.
సుప్రీంకోర్టు సహా దేశవ్యాప్తంగా హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో దాదాపు 39 లక్షల పెండింగ్ కేసులు విచారించినట్లు చెప్పారు. జిల్లా, తాలూకా కోర్టులను కంప్యూటరీకరిస్తామని సీజేఐ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి, జాతీయ న్యాయసేవా సంస్థ (నల్సా-ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ) కార్యనిర్వాహక అధ్యక్షుడు జస్టిస్ జీఎస్ సింఘ్వి కూడా మాట్లాడారు.
ఇరుపక్షాలూ విజేతలే
లోక్‌అదాలత్ తీర్పులపై లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ రోహిణి వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: న్యాయస్థానాల్లో తుది విచారణ తర్వాత వచ్చే తీర్పు ఒకరి పక్షమే ఉంటుందని, కానీ లోక్‌అదాలత్‌లో ఇరువర్గాలను ఒప్పించి పరిష్కారం చూపడం ద్వారా ఇరువురూ విజేతలుగా నిలిచి సంతోషంగా వెళ్తారని న్యాయసేవా సాధికార సంస్థ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన జాతీయ మెగా లోక్‌అదాలత్‌ను శనివారమిక్కడి నాంపల్లి క్రిమినల్ కోర్టుల ఆవరణలో ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. చిన్నచిన్న వివాదాల్లో పోలీస్‌స్టేషన్లకు వెళ్లకుండా లీగల్ సర్వీస్ అథారిటీలను సంప్రదిస్తే న్యాయమూర్తులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇరుపక్షాలకు కౌన్సెలింగ్ నిర్వహించి వాటిని పరిష్కరిస్తారని తెలిపారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరగకుండా వివాదాలను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం అందరికీ మంచిదని చెప్పారు. నిరుపేదలకు లీగల్ సర్వీస్ అథారిటీ ఉచితంగా న్యాయసహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. జైళ్లలో అదాలత్‌లు నిర్వహించి కేసులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. బాలనేరస్తుల సంక్షేమం కోసం లీగల్ సర్వీస్ అథారిటీ అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ రోహిణి స్వయంగా మూడు కేసులు పరిష్కరించారు. కార్యక్రమంలో లీగల్ సర్వీస్ అథారిటీ సభ్య కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్, న్యాయమూర్తులు బాలయోగి, లక్ష్మీపతి, ధర్మారావు, లక్ష్మణ్, రాధాకృష్ణకృపాసాగర్, ఎంవీ రమేష్, రాజ్‌కుమార్, సీఎంఎం రాధాదేవి, రాజేశ్వరి, శైలజ, శివనాగజ్యోతి, శ్రీదేవి, ఆంజనేయశర్మ, భాస్కర్, రజిని, అదనపు సీపీ సందీప్ శాండిల్య, బార్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభాకర్‌రెడ్డి, వై.రాములు, తిరుపతివర్మ, వెంకటరమణారెడ్డి, అదాలత్ సభ్యులు వినోద్‌కుమార్, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు.