భారత్‌కు చైనా వార్నింగ్!
బీజింగ్: కల్లోలిత బలూచిస్థాన్‌లో తలపెట్టిన పాకిస్థాన్-చైనా ఎకనామిక్ కారిడర్ (సీపీఈసీ)ని అడ్డుకునేందుకు భారత్ కుట్రపన్నితే.. అప్పుడు చైనా రంగంలోకి దిగి తీరుతుందని ఆ దేశానికి చెందిన ఓ మేధోసంస్థ హెచ్చరించింది. బలూచిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ వ్యాఖ్యలు చైనాకు ఆందోళన కలిగిస్తున్నాయని హు షిషెంగ్ అన్నారు. చైనాకు చెందిన సమకాలీన అంతర్జాతీయ వ్యవహారాల కేంద్రం (సీఐసీఐఆర్)లోని దక్షిణ, దక్షిణాసియా, సముద్ర దేశాల అధ్యయన కేంద్రం డైరెక్టర్‌గా ఉన్న ఆయన ఐఏఎన్‌ఎస్ వార్తాసంస్థకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు.
చైనాకు చెందిన అత్యంత శక్తిమంతమైన మేధో కేంద్రంగా పేరొందిన సీఐసీఐఆర్‌లో పరిశోధకుడిగా పనిచేస్తున్న హు షిషెంగ్ మాట్లాడుతూ.. ’ఎర్రకోట నుంచి మాట్లాడిన ప్రధాని మోదీ కశ్మీర్ (పాక్ ఆక్రమిత కశ్మీర్), బలూచిస్థాన్ అంశాలపై ప్రస్తావించడం తాజాగా చైనాను ఆందోళనకు గురిచేస్తున్నది. పాకిస్థాన్ విషయంలో భారత విధానంలో ఇది కీలక మలుపు అయి ఉండొచ్చు. కానీ తొలిసారి ఈ అంశాన్ని భారత్ ప్రస్తావించడం చైనా మేధావుల్లో ఆందోళన కలిగిస్తున్నది’ అని హు తెలిపారు.
కల్లోలిత బలూచిస్థాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక శక్తులను భారత్ వినియోగించుకుంటే అది సీపీఈసీని నష్టం కలిగించవచ్చునని, అప్పుడు చైనా రంగంలోకి దిగక తప్పదని ఆయన చెప్పారు. చైనాలోని జింగ్‌జియాంగ్ ప్రావిన్స్ నుంచి బలూచిస్థాన్‌లోని గ్వాదర్ ఓడరేవుకు అనుసంధానం చేసేందుకు చైనా ప్రతిష్టాత్మకంగా వన్ రోడ్డు వన్ బెల్ట్ ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా 46 బిలియన్ డాలర్ల (రూ. 3 లక్షల కోట్ల) వ్యయంతో ప్రతిపాదించిన సీఈసీకి ఆటంకాలు కలిగితే చైనా చూస్తూ ఊరుకోదని హు వ్యాఖ్యలు చేశారు.