
కడుపులోంచి తీసిందేమిటో తెలిస్తే షాకవుతారు
అరుదైన ఆపరేషన్ల గురించిన వార్తలు ఎన్నో చదివి ఉంటారు. ఇదిమాత్రం రేరెస్ట్ ఆఫ్ ది రేర్. భారీ కణితి రూపంలో కనిపిస్తున్నది ఏమిటో తెలుసా? మలం! అవును. తీవ్రమైన మలబద్ధకంతో బాధపడుతోన్న వ్యక్తి కడుపులో నుంచి డాక్టర్లు 13 కేజీల మలాన్ని తొలగించారిలా! చైనాలో చోటుచేసుకున్న ఈ ఆపరేషన్ పూర్వాపరాల్లోకి వెళితే..
పేరు వెల్లడించడానికి ఇష్టపడని 22 ఏళ్ల రోగి పొట్టలో నుంచి భారీ పరిమాణంలో మలాన్ని తొలగించారు షాంఘైలోని టెన్త్ పీపుల్ ఆస్పత్రి డాక్టర్లు. రోగి.. పుట్టినప్పటి నుంచి తీవ్రమైన మలబద్ధకంతో బాధపడేవాడని, మలం బయటికి రాని స్థితిలో కడుపు ఉబ్బిపోయిందని వైద్యులు చెప్పారు. చిన్నప్పటి నుంచి ఒక్కసారైనా రెంటికిపోయి ఎరగడని, ఆస్పత్రిలో చేరేనాటికి అతని పొట్ట తొమ్మిదినెలల గర్భంలా ఉందని రోగి పరిస్థితిని వివరించారు. ‘Hirschsprung’గా వ్యవహరించే ఈ మల వ్యాధి జన్యుపరంగానూ సంక్రమిస్తుందని, పెద్దపేగులో లోపాలు తలెత్తడం వల్ల ఈ వ్యాధికి గురవుతారని, కొందరైతే పుట్టినప్పటి నుంచి మలవిసర్జన చేయలేరని డాక్టర్లు తెలిపారు.
ఉబ్బిన పొట్టతో ఆస్పత్రిలో చేరిన రోగికి దాదాపు మూడు గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి.. మలంతో నిండిన పెద్దపేగు కణితిని తొలగించామని, అది 30 ఇంచుల పొడవు, 13 కేజీల బరువుందని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు తెలిపారు. అరుదైన ఈ ఆపరేషన్ విజయవంతం కావడంతో టెన్త్ పీపుల్ వైద్యులకు దేశం నలుమూలల నుంచి అభినందనలు అందుతున్నాయి. ‘మీరుకానీ, మీ పిల్లలు కానీ మలబద్ధకంతో బాధపడుతున్నట్లైతే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే వైద్యులను సంప్రదించండి’ అని సలహాఇస్తున్నారు చైనీస్ డాక్టర్లు.