14 ఏళ్లుగా సినిమాలు చూస్తూ బతికేశారు! | Cinemas continuously watching for 14 years | Sakshi
Sakshi News home page

14 ఏళ్లుగా సినిమాలు చూస్తూ బతికేశారు!

Published Sat, Aug 29 2015 7:23 AM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

14 ఏళ్లుగా సినిమాలు చూస్తూ బతికేశారు! - Sakshi

14 ఏళ్లుగా సినిమాలు చూస్తూ బతికేశారు!

వింటూంటే వింతగా అనిపించొచ్చు. పద్నాలుగేళ్లు సినిమాలు చూస్తూ బతకడమేంటీ అని కళ్లు పెద్దవి చేయొచ్చు. ‘‘సినిమాలే జీవితంగా చాలామంది బతుకుతున్నారు ఇందులో విశేషమేముందీ..?’’ అని తేలిగ్గా తీసిపారేయనూవచ్చు. అయితే, ఈ విధివంచిత కథలోని పాత్రధారులు (వ్యక్తులు) బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా నాలుగు గోడల మధ్యే సినిమాలు చూశారు. కేవలం సినిమాలు మాత్రమే చూశారు! ఆటలు, పాటలు, ఇరుగుపొరుగు స్నేహాలు, బయటి వ్యక్తులతో పరిచయాలు.. ఇవేమీ లేకుండా సినిమాలు చూశారు!! తోడేళ్ల బృందంగా (వోల్ఫ్ ప్యాక్) ప్రపంచానికి పరిచయమైన ఆరుగురు సోదరుల విచిత్ర కథ మీకోసం..!
 
 హాలీవుడ్ క్లాసిక్ ‘రిజర్వాయర్ డాగ్స్’ స్టైల్లో నల్లని కళ్లజోడు, సూటుబూటు, తెల్లని షర్టు, దానిపై నలుపు రంగు టై కట్టుకుని పోజిస్తున్న ఈ సోదరులు బయటకు కనిపిస్తున్నంత హ్యాపీగా ఏమీ ఉండరు. వీరిలో ఎవరిని కదిపినా తమ బాల్యాన్ని తలచుకుని వాపోతారు. ఇన్నాళ్లూ తాము చాలా మిస్సయ్యామని తెలిసి తెగ బాధపడిపోతారు. వీరి దుస్తుల రంగులాగే నిన్నమొన్నటివరకూ వీరంతా చీకటిలోనే బతకడమే దీనికి కారణం. 24 ఏళ్లుగా బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని వీరు.. సినిమాల్లో కనిపించేదే ప్రపంచమని నమ్మారు.
 
 తండ్రే కారణం..
 ఆంగులో బ్రదర్స్ స్టోరీ తెలుసుకోవాలంటే 1980ల్లోకి వెళ్లాల్సిందే.. అమెరికాకు చెందిన సుసాన్నే పెరూలోని మచ్చూపిచ్చూ వెళ్లడంతో కథ మొదలవుతుంది. అక్కడ పెరూ దేశస్థుడైన మ్యూజిక్ కంపోజర్ ఆస్కార్ ఆమెకు పరిచయమయ్యాడు. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అమెరికా చేరుకున్నారు. న్యూయార్క్‌లోని మన్‌హట్టన్‌లోని ఓ ఫ్లాట్‌లో నివాసం ఉన్నారు. అక్కడే ఓ అమ్మాయి సహా ఆరుగురు అబ్బాయిలకు జన్మనిచ్చారు. అయితే, ఈ జంట చిన్నారులను ఎన్నడూ ఫ్లాట్ దాటి బయటకు అడుగు పెట్టనివ్వలేదు. దీనికి కారణం ఆస్కార్‌కు బాహ్య ప్రపంచం మీద సదభిప్రాయం లేకపోవడమే. బయటివారంతా మోసగాళ్లు, అబద్ధాలు చెబుతారని భావించేవాడు. అదే విషయాన్ని భార్యా పిల్లలతో కూడా చెప్పేవాడు. బయటకు అడుగుపెడితే తన చిన్నారులు చెడిపోతారని విశ్వసించిన ఆయన వారిని నాలుగుగోడల మధ్యే బంధీ చేశాడు.
 
 సినిమాలే కాలక్షేపం..
ఇంట్లో చిన్నారులను ఉంచి, ముందు గదికి తాళం వేసేవాడు ఆస్కార్. ఒకే ఒక్క తాళం చెవిని తన దగ్గరే భద్రంగా దాచిపెట్టుకునేవాడు. పిల్లలు ఎంత అల్లరిచేసినా, ఆడుకున్నా పాడుకున్నా అంతా ఇంట్లోనే.. బయటకు నో చాన్స్! అయితే, డాక్టర్, డెంటిస్టును సంప్రదించడం లాంటి ఒకట్రెండు సందర్భాల్లో చిన్నారులకు ఈ లోకాన్ని చూసే అవకాశం వచ్చేది. మరి, ఇన్నేళ్లూ ఎలాంటి కాలక్షేపం లేకుండా వారు ఎలా ఉండగలరు..? అందుకే, ఆస్కార్ వారికి వేల సంఖ్యలో డీవీడీలు అందించేవాడు. పగలూరాత్రీ తేడా లేకుండా సినిమాలు చూడటమే వారి పని!
 
 తల్లి శిక్షణ..
 న్యూయార్క్‌లో పిల్లలను బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచడం నేరమేమీ కాదు. అయితే, వారికి తగిన విద్య, వైద్య సదుపాయాలు అందించాలి. ఈ బాధ్యతను తల్లి సుసాన్నే తీసుకుంది. చిన్నారులకు ఇంట్లోనే పాఠాలు చెప్పేది. చిన్నతనంలో తాను ఇంతకంటే కఠినమైన పరిస్థితుల మధ్య బతికానని, బయటకు అడుగు పెట్టడం మంచిది కాదని.. డ్రగ్స్, మద్యానికి అలవాటుపడతారని పిల్లలను హెచ్చరించేది.
 
 పొరుగువారికీ తెలియదట..
 నాలుగు బెడ్‌రూంలు సహా ఆరు గదులుండే ఆ ఇంట్లో ఏడుగురు చిన్నారులు ఉంటున్నారన్న సంగతి ఇరుగుపొరుగు వారికి కూడా తెలియదట. ఎప్పుడో పొరపాటున పిల్లలు బయటకు వస్తే వారిని అపరిచితులుగా భావించేవారట. ప్రస్తుతం యుక్తవయసులో ఉన్న ఈ సోదరులను ప్రశ్నిస్తే తాము ఏడాదికి రెండు మూడు సార్లు మాత్రమే బయటకు వెళ్లేవాళ్లమని, కొన్నేళ్లు పూర్తిగా బయట అడుగుపెట్టనే లేదంటూ గతాన్ని గుర్తు చేసుకుంటారు.
 
 సినిమాల్లో పాత్రల్లా..
ఈ విచిత్ర పెంపకం పిల్లల మానసిక స్థితిపై పెను ప్రభావాన్నే చూపింది. కొందరు తమను తాము బ్యాట్‌మ్యాన్ లాంటి పాత్రలతో పోల్చుకునేవారు. బొమ్మ తుపాకీలతో ఒకరినొకరు కాల్చుకుంటున్నట్టు, విలన్లను చితక్కొడుతున్నట్టు ఊహించుకునేవారు.
 
 సంస్కృత పేర్లు..
 వీరికి సంబంధించి ఇంకో విశేషం వీరి పేర్లు! కృష్ణుడి భక్తులైన సుసాన్నే, ఆస్కార్‌లు తమ పిల్లలకు ఆ నల్లనయ్య పేర్లే పెట్టారు. తొలుత జన్మించిన అమ్మాయికి విష్ణు (24) అని నామకరణం చేశారు. తర్వాత వరుసగా భగవాన్, కవలలు గోవింద, నారాయణ, ముకుంద, కృష్ణ, జగదీశ్ జన్మించారు.
 
 వోల్ఫ్ ప్యాక్..
ఇంట్లో నివసించేది కృత్రిమమైన జీవనం అని, బయట నిజమైన ప్రపంచం ఉందని తెలుసుకున్న ముకుంద ఓసారి తండ్రికి తెలియకుండా బయటపడే ప్రయత్నం చేశాడు. అప్పుడే అతనికి ఫిల్మ్‌మేకర్ మొసెల్లే పరియమయింది. ఆమే వీరి గాథని ప్రపంచానికి తెలిసేలా చేసింది. ‘వోల్ఫ్ ప్యాక్’ పేరుతో డాక్కుమెంటరీ రూపొందించి వీరిని స్టార్లను చేసింది. ప్రస్తుతం ఈ సోదరులంతా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీరిలో ముగ్గురైతే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నారు. వీరిలో గోవింద్ మాత్రం నేటికీ తల్లిదండ్రులతోనే ఉంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement