
నాలుగేళ్లుంటేనే పౌరసత్వం
♦ మూడేళ్లు పెంచుతూ చట్టంలో మార్పులు చేసిన ఆస్ట్రేలియా
♦ ఆంగ్ల భాషలో ప్రావీణ్యమూ తప్పనిసరి
♦ నూతన విధానాన్ని ప్రకటించిన ప్రధాని
మెల్‌బోర్న్: భారతీయులు అత్యధికంగా కలిగివున్న వర్క్ వీసాను రద్దు చేసిన ఆస్ట్రేలియా తాజాగా పౌరసత్వ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై ఆసీస్ పౌరసత్వం పొందాలంటే ఆంగ్ల భాషలో ప్రావీణ్యంతో పాటు కనీసం నాలుగేళ్లు తప్పనిసరిగా ఆ దేశంలో శాశ్వత నివాసితులై ఉండాలని సరికొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. అంటే ప్రస్తుతం ఉన్న 12 మాసాల నివాసిత నిబంధన కంటే ఇది మూడేళ్లు అదనం. నూతన సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ వెల్లడించారు. దాంతోపాటు ‘ఆస్ట్రేలియా విలువల’కు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. అలాగే... పౌరసత్వం పొందేందుకు ఇప్పటివరకు ఎన్నిసార్లయినా పరీక్ష రాసుకొనే అవకాశం ఉండేది. తాజా మార్పులననుసరించి... మూడుసార్లు పరీక్షలో విఫలమైతే మళ్లీ రెండేళ్ల వరకూ పరీక్ష రాసే అవకాశం ఉండదు.
ప్రజాస్వామ్యానికి పునాది...
పౌరసత్వం పొందాలనుకొనేవారు కఠినమైన ఆంగ్ల పరీక్షలో కచ్చితంగా ఉత్తీర్ణులవ్వాలి. ఈ పరీక్షలో మహిళలు, పిల్లల గౌరవమర్యాదలకు సంబంధించిన అంశాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. బాల్య వివాహాలు, గృహహింస తదితర ప్రశ్నలుండవచ్చు. వీటితోపాటు ఆస్ట్రేలియా విలువలు, బాధ్యతలపై ఎంత వరకు అవగాహన ఉంది... వాటికి ఏమేరకు కట్టుబడి ఉన్నారన్నది నిర్ణయించేలా ప్రశ్నలుంటాయని టర్న్‌బుల్ చెప్పారు. ఆస్ట్రేలియా పౌరసత్వం ప్రత్యేక హక్కని, దాన్ని ప్రతిష్టాత్మకంగా భావించాలని అన్నారు.
‘పౌరసత్వం మా దేశానికి హృదయం వంటిది. ప్రజాస్వామ్యానికి పునాది. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగానే పౌరసత్వ కార్యక్రమా లను రూపొందిస్తాం. దేశ ప్రజలతో సామాజికంగా మిళితమయ్యేందుకు ఆంగ్ల భాషలో ప్రావీణ్యం అవసరం. నేర ప్రవృత్తి, గృహహింస వంటివి ఆసీస్ విలువలను దెబ్బతీసేవే’అని ప్రధాని టర్న్‌బుల్ స్పష్టం చేశారు.
పౌరసత్వ దరఖాస్తుల పరిశీలనలో అత్యున్నత స్థాయి పోలీసు తనిఖీలు ఉంటాయని ఇమిగ్రేషన్ మంత్రి పీటర్ డట్టన్ తెలిపారు. తమ దేశంలో పెరుగుతున్న నిరోద్యోగాన్ని నియంత్రించేందుకు ప్రాచుర్యం పొందిన 457 వర్క్ వీసాను రద్దు చేసిన మూడు రోజులకే ఆసీస్ పౌరసత్వ చట్టంలో మార్పులు చేయడం గమనార్హం.