
మెగాస్టార్ గురించి హిల్లరీ ఆరా?
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిల్లరీ క్లింటన్కు సంబంధించి లీకేజీ మెయిల్ వివరాలను వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. హిల్లరీ తన సన్నిహితురాలు, పాకిస్థాన్ సంతతికి చెందిన హ్యూమా అబెదిన్కు పంపిన మెయిల్లో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కు సంబంధించిన ప్రస్తావన ఉంది.
‘కొన్నేళ్ల క్రితం మనం ప్రఖ్యాత భారతీయ సీనియర్ నటుడ్ని కలిశాం. ఆయన పేరు ఏమిటి?’ అంటూ హిల్లరీ చేసిన మెయిల్లో అబెదిన్ను ప్రశ్నించారు. ఆమె బదులిస్తూ ‘అమితాబ్ బచ్చన్’ అంటూ సమాధానమిచ్చారు. హిల్లరీ అమితాబ్ గురించి ఎందుకు అడిగారు? ఇందుకు గల కారణం ఏంటి అన్న విషయాలు మెయిల్లో ప్రస్తావించలేదు. 2011 జూలైలో హిల్లరీ ఈ మెయిల్ పంపారు. మెయిల్స్ లీకేజీ వ్యవహారం హిల్లరీకి తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ఎఫ్బీఐ విచారణ చేస్తోంది.