సీబీఐకి అప్పగించే ప్రసక్తే లేదు
నయీం కేసుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టీకరణ
- మనకు సమర్థులైన పోలీసులున్నారు
- రాష్ట్ర పోలీసులకే ఈ క్రెడిట్ దక్కాలి
- కేసుతో సంబంధం ఉన్న ఎవరినైనా శిక్షించి తీరుతాం
- నయీం పిశాచాన్ని సృష్టించింది ఎవరో ప్రపంచానికి తెలుసు
- నాడు కళ్లు మూసుకొని రాజ్యం చేసింది ఎవరు?
- కేసు దర్యాప్తులో ఎక్కడా ఉదాసీనత లేదు
- 740 మందికి పైగా సాక్షులను విచారించి 124 మందిని అరెస్టు చేశారు.. దర్యాప్తు మధ్యలో ఉంది..
- సమయం, సందర్భాన్ని బట్టి అన్నీ బయటపెడతాం
సాక్షి, హైదరాబాద్:
గ్యాంగ్‌స్టర్ నయీం కేసు దర్యాప్తును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి అప్పగించేది లేదని సీఎం కె.చంద్రశేఖర్‌రావు తేల్చి చెప్పారు. జాతీయ స్థాయిలో ప్రశంసలందుకునే సమర్థులైన పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నందున వారితోనే దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. సోమవారం శాసనసభలో నయీం, అతని అనుచరులు సాగించిన నేర కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై లఘు చర్చ జరిగింది. ఈ చర్చలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం తరఫున సీఎం సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత తనకు వేలాది మంది ఫోన్లు చేశారని, కన్నీళ్లు పెట్టుకుంటూ అభినందనలు తెలిపారని పేర్కొన్నారు. భువనగిరి వెళ్తే వేలాది మంది వచ్చి ‘మా దరిద్రాన్ని వదిలించారు..’ అంటూ సంతోషించారని చెప్పారు. నయీంను హతమార్చడంలో మన పోలీసులు చేసిన కృషి అభినందనీయమని, అందుకే ఈ కేసు దర్యాప్తు చేసిన క్రెడిట్ మన పోలీసులకే దక్కాలని, సీబీఐకి ఈ కేసు ఇవ్వడం లేదని అన్నారు. ‘‘మన పోలీసులు బెస్ట్ పోలీసింగ్ అవార్డులు అందుకుంటున్నారు. జాతీయ పోలీసు అకాడమీకి వచ్చిన సందర్భంగా ప్రధాని కూడా మన పోలీసులను ప్రశంసించారు. కేంద్ర హోంమంత్రి కితాబిచ్చారు. అలాంటి పోలీసులను ఉపయోగించుకునే ఈ కేసు దర్యాప్తు పూర్తి చేస్తాం’’ అని చెప్పారు. ‘‘నయీం కేసును సీబీఐకి అప్పగించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. నయీంను హతమార్చింది, ఆ తర్వాత 124 మంది అతని అనుచరులను పట్టుకుంది ఎవరు? సీబీఐ వాళ్లు వచ్చి పట్టుకున్నారా..?’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. నయీం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై అపవాదు వేయాలనుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు.
ఈ పిశాచాన్ని ప్రోత్సహించింది ఎవరు?
అసలు నయీం అనే ఈ పిశాచం సృష్టికర్తలెవరో ప్రపంచానికి తెలియదా అని సీఎం ప్రశ్నించారు. ‘‘ఆ పిశాచం నమిలి మింగుతుంటే ప్రోత్సహించింది ఎవరు? కళ్లు మూసుకుని రాజ్యం చేసింది ఎవరు’’ అంటూ కాంగ్రెస్, టీడీపీలను పరోక్షంగా విమర్శించారు. టీఆర్‌ఎస్ అధికారంలోని వచ్చాక రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని, పేకాట, గుడుంబాలపై ఉక్కుపాదం మోపి అణచివేశామని సీఎం చెప్పారు. శాంతిభద్రతల విషయంలో తాము చాలా కఠినంగా ఉంటున్నామని, నయీం కాదు ఆయన తాత అయినా ఈ ప్రభుత్వం క్షమించదని స్పష్టం చేశారు.
ఎక్కడా ఉదాసీనత లేదు..
నయీం ఉదంతంలో ప్రభుత్వం కానీ, పోలీసులు కానీ ఎక్కడా ఉదాసీనంగా వ్యవహరించడం లేదని, ఏ విషయాన్ని కూడా దాచిపెట్టడం లేదని సీఎం స్పష్టంచేశారు. నయీంను ప్రాణాలతో పట్టుకుని ఉంటే బాగుండేదని, అయితే పోలీసులపై నయీం ముఠా కాల్పులకు దిగడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నయీం హతమయ్యాడని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్ అనంతరం పోలీసులు సమర్థంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని, ఇప్పటి వరకు నయీం ఉదంతంలో 740 మందికి పైగా సాక్షులను విచారించి 124 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. నయీం ముఠాకు మొత్తం 52 హత్య కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారని, అందులో 26–27 కేసుల్లో సాక్ష్యాధారాలు కూడా లభ్యమయ్యాయని తెలిపారు. ఇప్పటికే రెండు చార్జిషీట్లు వేశారని, ఇంకో 10–15 చార్జిషీట్లు వేసేందుకు సిద్ధమయ్యారని వివరించారు.
కేసు దర్యాప్తు మధ్య దశలో ఉన్నందున అన్ని విషయాలను బయటపెట్టడం కుదరదని, కేసును తేల్చాలంటే పోలీసులు కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంటుందని అన్నారు. అయినా దర్యాప్తులో ఇప్పటివరకు తేలిన అంశాలన్నింటినీ సభ ముందుంచామన్నారు. నయీం కేసు చాలా సున్నితమైనది కనుక అన్ని విషయాలను బయటకు వెల్లడించలేమని, సమయం, సందర్భం వచ్చినప్పుడు అన్ని అంశాలను బహిర్గతం చేస్తామని, అన్ని చరిత్రలు బయటకు వస్తాయని చెప్పారు. నయీం ముఠా అవశేషాలను కూడా వదిలిపెట్టేది లేదని స్పష్టంచేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవారెవరైనా, ఏ పార్టీలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా నూరు శాతం శిక్షించి తీరుతామని, ఎవరినీ ఉపేక్షించాలన్న పిచ్చి ఆలోచన ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఎవడ్రా నయీం.. ఏమనుకుంటున్నవ్..?
తన ప్రసంగంలో భాగంగా సీఎం కేసీఆర్ కొన్ని పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. టీఆర్‌ఎస్ నేత సాంబశివుడి హత్య జరిగిన తర్వాత ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్లానని, అప్పుడు అక్కడ జరిగిన సంస్మరణ సభలోనే నయీం దురాగతాల్ని ప్రశ్నించానని గుర్తు చేశారు. వలిగొండ సభలో ‘‘ఎవడ్రా నయీం.. ఏమనుకుంటున్నవ్... దేవుడు నీకేమైనా ఆరుచేతులిచ్చిండా.. నువ్వు చేసే పని మేం చేస్తే ఎట్టుంటది...?’’ అని ప్రశ్నించానని చెప్పారు.
ఈ మాటల తర్వాత కేసీఆర్ భువనగిరి దాటి వెళ్తాడా అని కూడా వ్యాఖ్యలు చేశారని అన్నారు. అంతటి స్థాయిలో నయీం అనే పిశాచి పాతుకుపోయినా ఏమీ చేయలేక పోయారని కాంగ్రెస్, టీడీపీలను విమర్శించారు. ‘‘మేం 15 ఏళ్లు పడుకున్నం. ఇప్పుడు మీకు రెండేళ్లు ఎందుకు పట్టింది’’ అని ప్రతిపక్షాలు ప్రశ్నించడం అన్యాయమని అన్నారు. నయీం ఉదంతంపై సీఎం ప్రసంగం తర్వాత మళ్లీ జీవన్‌రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించినా సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.