రాష్ట్రంలోనూ భూలోక స్వర్గం!
చైనాలోని ‘సుజు’తరహాలో ఏర్పాటుకు సీఎం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: చైనాలో భూలోక స్వర్గంగా ఖ్యాతి గాంచిన సుజు నగరంలోని ప్రఖ్యాత సుజు పారిశ్రామికవాడను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బృందం శుక్రవారం సందర్శించింది. చైనా పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ బృందం శుక్రవారం షాంఘై నుంచి బీజింగ్‌కు బయలుదేరే ముందు సుజు పారిశ్రామికవాడను సందర్శించింది. ఈ సందర్భంగా ‘చైనా-సింగపూర్ సుజు పారిశ్రామికవాడ’ పాలకవర్గ కమిటీ సభ్యుడు యుకెజైన్‌తో సీఎం బృందం సమావేశమైంది.
ఈ సందర్భంగా ఆ పారిశ్రామికవాడ పుట్టుపుర్వోత్తరాలు, అభివృద్ధి వివరాలను యుకెజైన్ వివరించారు. అక్కడ ఏడు లక్షల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు చెప్పారు. అనంతరం రాష్ట్ర బృందం సుజు పారిశ్రామికవాడ పాలకవర్గ సభ్యులకు తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం విశేషాలను వివరించింది. తెలంగాణలో సుజు తరహా పారిశ్రామికవాడల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
చైనా-సింగపూర్ ప్రభుత్వాల మధ్య ఆర్థిక సహకార పథకంలో భాగంగా ఏర్పాటైన సుజు పారిశ్రామికవాడ 288 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఆర్థిక రంగంలో అంతర్జాతీయ సహకారానికి, విజయవంతంగా సంస్కరణలను అమలు చేయడానికి ఒక ఆదర్శ ప్రాంతంగా ఈ పారిశ్రామికవాడను తీర్చిదిద్దారు. అత్యధిక రంగాల్లో అంతర్జాతీయ పోటీకి నిలువెత్తు రూపంగా ఈ పారిశ్రామికవాడ నిలుస్తోంది. విదేశీ పెట్టుబడులతో చైనాలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఇది అగ్రస్థానంలో ఉంది.
సీఎంకు భారత రాయబారి విందు
షాంఘైలో రెండు రోజుల బస అనంతరం సీఎం కేసీఆర్ బృందం శుక్రవారం చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకుంది. సాయంత్రం అక్కడి భారత రాయబారి అశోక్ కె.కాంత ఇచ్చిన విందుకు ఈ బృందం హాజరైంది. ఇక బీజింగ్‌కు బయలుదేరే ముందు షాంఘైలో చైనాకు చెందిన అంజు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ డెరైక్టర్ యోగేశ్ వాఘ్‌తో కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం గురించి వివరించగా... యోగేష్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణను సందర్శించాల్సిందిగా కేసీఆర్ ఆయనను ఆహ్వానించారు.
పెట్టుబడులకు ముందుకొచ్చిన ‘వాండా’
చైనాకు చెందిన ప్రముఖ బహుళజాతి సంస్థ వాండా గ్రూప్ గ్రేటర్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. చైనా పర్యటనలో ఉన్న రాష్ట్ర ప్రతినిధి బృందంలోని ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలినీమిశ్రాలు శుక్రవారం వాండా కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి.. కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు.
భారత్‌లో అత్యంత అనువైన వాతావరణ పరిస్థితులున్న నగరం హైదరాబాద్ అని, అక్కడ రూ.21 వేల కోట్లతో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని సోమేశ్‌కుమార్ వాండా సంస్థ ప్రతినిధులకు వివరించారు. వంద కిలోమీటర్ల మేర స్కైవేలు, 166 కిలోమీటర్ల మేర మేజర్ కారిడార్లు, మరో 1,400 కిలోమీటర్ల రహదారులు, 54 ఫ్లైఓవర్లను నిర్మించనున్నామని తెలిపారు. ఈ రంగంలో తమకు తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా వాండా సంస్థను కోరారు.
దీనిపై స్పందించిన వాండా యాజమాన్యం... త్వరలోనే తమ ప్రతినిధి బృందం హైదరాబాద్‌ను సందర్శిస్తుందని హామీ ఇచ్చింది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఒక ప్రకటన విడుదల చేసింది. వాండా కంపెనీ రియల్‌ఎస్టేట్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్, మీడియా, మాల్స్ తదితర రంగాల్లో ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో తన వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇక షాంఘై మున్సిపల్ కార్పొరేషన్‌ను కూడా ఈ బృందం సందర్శించింది. అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, ఆధునిక యంత్రాల వినియోగం, పార్కులు, ఆటస్థలాల నిర్వహణ, వివిధ సదుపాయాలు, ప్రజల భాగస్వామ్యం, కార్పొరేషన్ ఆదాయ, వ్యయాలు తదితర అంశాలను పరిశీలించింది.