తుగ్లక్ పాలన
► మోదీ సర్కార్‌పై సీఎం సిద్ధు ఆగ్రహం
►పేర్లు మార్చి పథకాలు కాపీ
►ఇన్నాళ్లూ దళితులు గుర్తుకు రాలేదా ?
బెంగళూరు : ‘ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోంది. అధికారంలోకి రాకముందు ఒకలా అధికారంలోకి వచ్చిన అనంతనం మరొకలా మాటలు మారుస్తూ ప్రధాని మోదీ ప్రజలను మాయమాటలతో మభ్య పెడుతున్నారు.’ అని సీఎం సిద్ధరామయ్య వాగ్భాణాలు సంధించారు. నగరంలోని కేపీసీసీ కార్యాయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2014కు ముందు కేంద్రలో అధికారంలోఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ బిల్లును, ఆధార్ కార్డుల అనుసంధానం ప్రక్రియను అప్పట్లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు.
అయితే 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి రాగానే జీఎస్టీ బిలు, ఆధార్‌కార్డు అనుసంధానం ప్రక్రియలను అమలు చేశారని గుర్తుచేశారు. అధికారం చేపట్టిన మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి తమ పథకాలుగా ప్రచారం చేసుకోవడం తప్ప బీజేపీ సాధించిందేమి లేదని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్మల భారత్‌ను స్వచ్ఛభారత్‌గా, రాజీవ్‌గాంధీ విద్యుద్ధీకరణ పథకాన్ని... దీన్‌దయాళ్ పథకంగా ఇలా అన్ని పథకాలకు పేర్లను మార్చారంటూ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం రెండు కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించి నిరుద్యోగ సమస్యను పూర్తిగా కనుమరుగు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం మూడేళ్లలో సృష్టించిన ఉద్యోగాల సంఖ్య కేవలం నాలుగు లక్షలేనని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విదేశాలో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి తీసుకువస్తామని హామీ ఇంతవరకు నెరవేరలేదన్నారు. నల్లధనాన్ని నిర్మూలించే ప్రధాన ఉద్దేశంతో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఓ మహా నాటకమని, అది కేవలం కొన్ని బడా కార్పోరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయంగా సీఎం సిద్ధరామయ్య అభివర్ణించారు. ఇక రాష్ట్ర బీజేపీ నాయకులకు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో దళితులు గుర్తుకొచ్చారని ఎన్నికల్లో ఓట్ల కోసం దళితులపై ప్రేమ కురిపిస్తున్నారంటూ విమర్శించారు.
వ్యక్తిగతంగా ఎప్పుడూ దళితుల ఇంట్లోకి ప్రవేశించని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప ఓట్ల కోసం దళితుల ఇంట్లో అల్పాహారం అంటూ నటిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కే.వేణుగోపాల్ మాట్లాడుతూ... కేంద్ర బీజేపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కేవలం ప్రకటనలకే పరిమితమైందని స్వచ్ఛభారత్ పేరుతో వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ విమర్శించారు. కార్యక్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు జీ.పరమేశ్వర్, కార్యదర్శి దినేశ్ గుండూరావ్, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ తదితరులు పాల్గొన్నారు.