ఎవరినీ వదలం: సీఎం యోగి
- పరిస్థితిపై మోదీ సమీక్ష
- పుండు మీద కారం సరికాదన్న యోగి
ఖరగ్‌పూర్: తీవ్ర విమర్శల నడుమ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సొంత నియోజక వర్గం గోరఖ్‌పూర్ లోని బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజీని సందర్శించారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో కలిసి పరిస్థితిపై వైద్యులతో చర్చించిన ఆయన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు.
"ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు. కేంద్రం తరపున అవసరమైన సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు" అని యోగి తెలిపారు. 'మేము ఈ అంశంపై సీరియస్‌గానే ఉన్నాం. విచారణ కమిటీ నివేదికను రానివ్వండి. తప్పని తేలితే ఎంతవారినైనా వదిలే ప్రసక్తే లేద(ని ఆయన తెలిపారు. తప్పుడు కథనాలపై మండిపడ్డ ఆయన, వార్డులలోకి వెళ్లి చూస్తే పరిస్థితి మీకే అర్థమౌతుందంటూ మీడియాకు చురకలంటించారు.
రాజకీయాలు వద్దు
చనిపోయిన బాధలో ఉన్న తల్లిదండ్రులను రెచ్చగొడుతూ కొందరు ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 'అది సరికాదు. గతంలో గులామ్ నబీ ఆజాద్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారమంటూ చేతులెత్తేశారు. ఇప్పుడేమో మాపై విమర్శలు చేస్తున్నారు. అది వారి విచక్షణకే వదిలేస్తున్నా' అని యోగి పేర్కొన్నారు.
ఇక ఘటనపై కేంద్రం తరపున ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటును చేస్తామని ప్రకటించిన కేంద్ర మంత్రి జేపీ నడ్డా, పరిస్థితులను సమీక్షించేందుకు ఓ వైద్య బృందాన్ని బీఆర్‌డీ మెడికల్ కళాశాలకు రప్పిస్తున్నట్లు వెల్లడించారు. సిలిండర్ల బకాయిలను ఆగష్టు 5నే చెల్లించినప్పటికీ, కళాశాల సిబ్బంది నిర్లక్ష్యం మూలంగానే ఈ మరణాలు సంభవించినట్లు ఇప్పటికే కమిటీ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు ఉంటాయని యోగి ప్రకటించారు. గోరఖ్‌పూర్ ఘటనపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూపీ కాంగ్రెస్ విభాగం సీఎం యోగి, వైద్యశాఖ మంత్రి సిద్ధార్థ్ నాథ్‌ల రాజీనామాకు డిమాండ్ చేస్తోంది.