'చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టుకుంది'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుకు భూమి పిచ్చి పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మచిలీపట్నం పోర్టుకు 2వేల ఎకరాలు సరిపోతుందన్న ఆయన ఇప్పుడు ఏకంగా లక్ష ఎకరాలు ఏ విధంగా సేకరిస్తారని రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు.
ఎక్కడ భూములు కనిపించినా సరే, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు భూ దోపిడీపై ఆదివారం 10 వామపక్ష పార్టీ నేతలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. సదావర్తి సత్రం భూముల కొనుగోళ్లలో టీడీపీ పెద్దల హస్తం ఉందని అన్నారు. సంక్షేమ పథకాల్లో కోత పెట్టడానికే పల్స్ సర్వే నిర్వహిస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. మరోవైపు ఈ-పాస్బుక్ విధానాన్ని కూడా రామకృష్ణ తప్పుబట్టారు.
కాగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలో లక్షా ఐదువేల ఎకరాలను భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 22వేల ఎకరాలు మచిలీపట్నం డీప్ వాటర్ పోర్టు కోసం, మిగతా భూమి పారిశ్రామకి కారిడార్, తదితర అవసరాల కోసం కేటాయించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.