కీలక బిల్లులు అడ్డుకుంటే ఎలా? | Combative Manmohan attacks BJP in Parliament, opposition criticizes PM's remarks | Sakshi
Sakshi News home page

కీలక బిల్లులు అడ్డుకుంటే ఎలా?

Published Sat, Aug 31 2013 2:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

కీలక బిల్లులు అడ్డుకుంటే ఎలా? - Sakshi

కీలక బిల్లులు అడ్డుకుంటే ఎలా?

  • బీజేపీపై ప్రధాని మన్మోహన్ విమర్శనాస్త్రాలు
  •      రూపాయి, దేశ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో వివరణ
  •      కఠినమైన సంస్కరణలకు సమయం ఆసన్నమైంది
  • న్యూఢిల్లీ: ఎట్టకేలకు ప్రధాని మన్మోహన్‌సింగ్ మౌనం వీడారు. రూపాయి పతనం, రోజురోజుకూ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితిపై శుక్రవారం రాజ్యసభలో సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న మాట వాస్తవమేనని అంగీకరిస్తూనే ప్రధాన ప్రతిపక్షం బీజేపీపై పదునైన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీజేపీ కీలకమైన ఆర్థిక బిల్లులను అడ్డుకుంటూ పార్లమెంటును స్తంభింపచేస్తోందని, ఫలితం గా దేశంలో పెట్టుబడులకు అనుకూల  వాతావరణం చెడిపోతోందని మండిపడ్డారు.
     
     చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కలవాల్సిందేనని, అలాగే ఆర్థిక పరిస్థితి చక్కబడాలంటే ప్రతిపక్షం కూడా ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు. ప్రధాని వ్యాఖ్యలపై బీజేపీ అగ్గిమీద గుగ్గిలమైంది. కుంటి సాకులు కట్టిపెట్టి, ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడానికి ఏం చేస్తారో చెప్పాలని రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ నిలదీశారు. అసమర్థ సర్కారు తీరుతో పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదని, దేశంపై వారు విశ్వాసం కోల్పోతున్నారని దుయ్యబట్టారు.
     
     వెనక్కి పోలేం...: ప్రస్తుతం ఆర్థికరంగం గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నా సంస్కరణల నుంచి వెనక్కి వెళ్లలేమని ప్రధాని ఉద్ఘాటించారు. స్వల్పకాలిక ఆటుపోట్లు తప్పవని వ్యాఖ్యానించారు. ‘ప్రమాదకరంగా పెరిగిపోతున్న కరెంటు ఖాతా లోటు, ద్రవ్యలోటును సరిచేయాల్సి ఉంది. అందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. విదేశీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు చేయాల్సిందంతా చేస్తాం. రూపాయి మారకం విలువ పడిపోవడం ఆందోళనకరమే. అయితే దీన్ని అధిగమించేందుకు సంస్కరణలను పక్కనపెట్టబోం.
     
     ఇతరత్రా మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొంటాం’ అని వివరించారు. కఠినమైన ఆర్థిక సంస్కరణలకు సిద్ధమవ్వాల్సిన తరుణం ఆసన్నమైం దన్నారు. సబ్సిడీలు తగ్గించుకోవడం, బీమా, పెన్షన్ రంగా ల్లో సంస్కరణలు, వస్తు, సేవల పన్ను, అనుమతులు, నిర్ణయాల్లో అధికారిక జాప్యాన్ని నివారించడం వంటివి చేపడతామన్నారు. అయితే ఇవన్నీ అంత సులువు కాదని, విపక్షం సహకరిస్తేనే ఈ చర్యలు తీసుకోగలుగుతామని చెప్పారు. ‘రాజకీయ ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల ప్రభుత్వం అనేక కీలక చట్టాలు చేయలేకపోతోంది. ముఖ్యమైన అంశాల విషయంలో రాజకీయాలకు అతీతంగా మెల గాలి. ఆర్థిక స్థితిని గాడిన పెట్టేందుకు ప్రభుత్వానికి సహకరించాలని అన్ని పక్షాలను కోరుతున్నా’ అని చెప్పారు. ఉల్లిపాయల నిల్వ విషయంలో రాష్ట్రాలు కేంద్రం సూచనలను పాటించింటే ఇప్పుడీ కష్టాలు ఉండేవి కావని అన్నారు.
     
     ఏ దేశంలో అయినా ఇలా చేస్తారా?
     బీజేపీ తరచూ ప్రభుత్వంపై దాడి చేయడాన్ని ప్రధాని తప్పుపట్టారు. సభాధ్యక్షుడిని ఉద్దేశిస్తూ.. ‘ప్రధాని తన మంత్రులను సభకు కూడా పరిచయం చేసుకోనివ్వలేని పరిస్థితిని ఏ దేశంలోనైనా చూశారా? విపక్ష సభ్యులు సభామధ్యలోకి దూసుకొచ్చి ‘ప్రధాని దొంగ(చోర్)’ అని అరవడం ఏ పార్లమెంటులో అయినా విన్నారా?. కానీ అవన్నీ ఇక్కడ చూస్తున్నాం’ అని అన్నారు. ఇందుకు బీజేపీ నేత అరుణ్‌జైట్లీ దీటుగా స్పందించారు. ‘ఎంపీలను కొని విశ్వాస పరీక్షలో నెగ్గిన ప్రధానిని ఏ దేశంలో అయినా చూశారా?’ అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలకు సాకులు చెప్పడం కాకుండా ఆర్థికరంగానికి జవసత్వాలు కల్పించేందుకు ఏం చర్యలు తీసుకోబోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement