రైతును అడ్డుపెట్టుకుని రాజకీయం
విపక్షాలపై మంత్రి హరీశ్‌రావు తీవ్ర వ్యాఖ్యలు
భగ్గుమన్న విపక్షాలు మొదలవుతూనే వేడెక్కిన సభ
‘నపుంసకత్వం’ వ్యాఖ్యలపైనా రగడ
సాక్షి, హైదరాబాద్ : ‘‘రైతును అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు అసెంబ్లీ వేదికగా రాజకీయం చేస్తున్నాయి. వారి ప్రసంగాలు మొసలి కన్నీటి మాటలతో కూడుకున్నవే. వాస్తవాలను ప్రజ లు గమనిస్తున్నారు. ఎవరు రైతుల పక్షమో, ఎవరు వారి పేరుతో లబ్ధి పొందజూస్తున్నారో గుర్తిస్తున్నారు’’ అంటూ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతూనే వేడి రగిల్చాయి. ముందు నిర్ణయించిన మేరకు రైతు ఆత్మహత్యలపై సభలో బుధవారం కూడా చర్చ కొనసాగింది. అధికారపక్ష సభ్యుడు రామలింగారెడ్డికి ముందు స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడే అవకాశమిచ్చారు.
దాంతో బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్ లేచి తామిచ్చిన వాయిదా తీర్మానాల సంగతేమిటని ప్రశ్నించారు. వామపక్ష సభ్యులు సున్నం రాజయ్య, రవీంద్రకుమార్, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావు కూడా లేచి గట్టిగా అభ్యంతరం చెప్పారు. గందరగోళం మధ్యే రామలింగారెడ్డి మాట్లాడుతుండటంతో అంతా గందరగోళంగా మారింది. దాంతో హరీశ్ లేచి విపక్ష సభ్యులపై ఒక్కసారిగా ఆగ్రహించారు. ‘‘రైతులపై వారికి మాత్రమే ప్రేమ ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. వారు మాట్లాడాల్సిందంతా మంగళవారం మాట్లాడారు.
ఇప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పొద్దంటే ఎట్లా? 70 మంది సభ్యులున్న అధికారపక్షం నుంచి ఒక్కరు కూడా మాట్లాడలేదు. వారిలా సభను అడ్డుకోవటమేంటి? ప్రతిపక్షాలు చర్చను అడ్డుకుంటున్నాయని ప్రజలు గమనిస్తారు, అది వారికే నష్టం, ఇకనైనా రాజకీయాలు మానుకుని సహకరించాలి’’ అన్నారు. హరీశ్ వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు తీవ్రంగా ఆగ్రహించారు. నిరసనను తీవ్రతరం చేశారు. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ సభలోకి వచ్చి జోక్యం చేసుకున్నారు. ‘‘బీఏసీలో తీసుకున్న నిర్ణయంమేరకే సభ సాగుతోంది. ఈ రోజు ప్రశ్నోత్తరాలుండవని స్పీకర్ ముందే ప్రకటించారు.
ఈ చర్చ పూర్తయ్యాక మిగతా అంశాలపై చర్చిద్దాం. ఎన్ని రోజులంటే అన్ని రోజులు సభను జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతు ఆత్మహత్యలపై జరుగుతున్న చర్చ గాంభీర్యాన్ని చెడగొట్టి రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయొద్దు’’ అన్నారు. సభ్యుల అభ్యంతరాలేమిటో తెలుసుకుని సభను కొనసాగిస్తే బాగుంటుందని సీఎల్పీనేత జానారెడ్డి సూచించారు. దాంతో అన్ని పక్షాల నేతలకు స్పీకర్ అవకాశం కల్పించారు. నగరంలో చైన్ స్నాచింగులు పెరిగాయని, రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని, ఇవి తీవ్ర అంశాలు గనుకనే వాయిదా తీర్మానాలిచ్చామని లక్ష్మణ్ అన్నారు.
వాటిని ఎప్పుడు చర్చకు తీసుకుంటారో అడిగేందుకే లేచానన్నారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై ఇచ్చిన వాయిదా తీర్మానంపై లెఫ్ట్ సభ్యులు ప్రశ్నించారు. హరీశ్ మాటతీరు సరిగా లేదని ఎర్రబెల్లి అన్నారు. అన్ని అంశాలపైనా చర్చకు అవకాశముంటుందని, రైతు ఆత్మహత్యలపై చర్చ తర్వాత వాటికి మరో రూపంలో అవకాశమిస్తామని స్పీకర్ పేర్కొనటంతో సభ కొనసాగింది.
సభలో ‘నపుంసకత్వం’ రగడ
కేంద్రమంత్రి వ్యాఖ్యలను ఉటంకించిన హరీశ్.. బీజేపీ సభ్యుల నిరసన
రైతు ఆత్మహత్యలను ప్రభుత్వ పెద్దలు అవహేళన చేస్తున్నారన్న బీజేపీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ స్పందన కూడా గందరగోళానికి దారితీసింది. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే వంద శాతం రుణమాఫీ చేసి ఉంటే ఆత్మహత్యలు జరిగేవే కావని, కానీ ప్రభుత్వం వాస్తవాలను అంగీకరించడం లేదని అన్నారు. ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమ రవాణాలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ‘‘మహరాష్ట్రలో రైతుల ఆత్మహత్యలపై అక్కకి సీఎం స్పందించి విపక్ష నేతలతో కలసి క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు మనోధైర్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం మంత్రులు పలు విధాలుగా మాట్లాడుతున్నారు.
రైతు ఆత్మహత్యలను అవహేళన చేస్తున్నారు’’ అన్నారు. దాంతో, రైతులను అవహేళన చేసింది కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగేనంటూ హరీశ్ ఘాటుగా స్పందించారు. ‘‘కుటుంబ సమస్యలు, అనారోగ్యం, ప్రేమ వ్యవహారాలు, నపుంసకత్వంతో రైతులు చనిపోతున్నారని పార్లమెంటులోనే మంత్రి అనడం వారిలో ఆత్మస్థైర్యం పెంచడమా, లేక అవహేళన చేయడమా? రైతులు చనిపోవడానికి నపుంసకత్వం కారణమా?’’ అంటూ దుయ్యబట్టారు. అలా మాట్లాడొద్దని కేంద్ర మంత్రికి చెప్పండన్నారు. అందుకు నిరసనగా కిషన్‌తో పాటు బీజేపీ సభ్యులు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి నిలబడి నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి వారికి మద్దతు తెలిపారు.