
ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్సు వచ్చేసింది..
చెన్నై: హిందూజా గ్రూపునకు చెందిన ఆటో దిగ్గజం, కమర్షియల్ వెహికల్ మేజర్ అశోక్ లేలాండ్ 'సర్క్యూట్ సిరీస్' లో మొదటి ఎలక్ట్రిక్ కార్ ను సోమవారం లాంచ్ చేసింది. పూర్తిగా స్వదేశంలో డిజైన్ చేసి రూపొందించిన, పొల్యూషన్ లేని, 100 శాతం ఎలక్ట్రిక్ బస్ ను చెన్నైలో విడుదల చేసింది. జీరో ఎమిషన్ బస్ ను ప్రధానంగా దేశంలోని రోడ్లు, ప్రయాణీకులకోసం తయారు చేశామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు, ఇంధనాన్ని వినియోగించే కార్లకు బదులుగా పూర్తిగా విద్యుతో నడిచే 'సర్క్యూట్ సిరీస్' ఎలక్ట్రిక్ బస్సు లాంచింగ్ సంస్థ చర్రితలో ఒక మైలురాయి లాంటిదనీ, సిరీస్ లో 2017 నాటికల్లా ఎలక్ట్రిక్ బస్సును భారత మార్కెట్లో విడుదల చేస్తామన్న తమ వాగ్దానానికి కట్టుబడి దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు అశోక్ లేలాండ్ మేనేజింగ్ డైరెక్టర్ వినోద్ కె దాసరి తెలిపారు. 'ఆప్ కీ జీత్, హమారీ జీత్' అశోక్ లేలాండ్ ఫిలాసఫీకి అనుగుణంగా అన్ని నగరాల్లోని పర్యావరణాన్ని రక్షిస్తుందని చెప్పారు. ఫైర్ డిటెక్షన్ అండ్ సప్రెషన్ సిస్టం(ఎఫ్ డీఎస్ఎస్) తో ప్రత్యేకంగా రూపొందించిన ఈ బస్సు సింగిల్ చార్జ్ తో 120 కి.మీ దూరం ప్రయాణిస్తుందని అశోక్ లేలాండ్ వైస్ ప్రెసిడెంట్ టి వెంకటరామన్ వెల్లడించారు.
తమిళనాడు రాష్ట్ర, దేశ చరిత్రలో ఇది చాలా ముఖ్యమైన రోజని, భారత మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ కారు తయారు చేయడం సంతోషమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ అంబుజ్ శర్మ వ్యాఖ్యానించారు. వాహన ఇంధన దిగుమతి బిల్లులను తగ్గించాలన్న ప్రభుత్వం ఆలోచనకు ఇది దోహదం చేస్తుందని, భవిష్యత్తు తరాల కోసం ఒక ప్రకాశవంతమైన, క్లీన్ ఫూచర్ ను అందిస్తుందన్నారు.