వాణిజ్య వాహనాలకు మరికొన్నాళ్లు గడ్డుకాలమే | Commercial vehicle sector faced with hardly by losing Growth rate | Sakshi
Sakshi News home page

వాణిజ్య వాహనాలకు మరికొన్నాళ్లు గడ్డుకాలమే

Published Thu, Oct 3 2013 2:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM

వాణిజ్య వాహనాలకు మరికొన్నాళ్లు గడ్డుకాలమే

వాణిజ్య వాహనాలకు మరికొన్నాళ్లు గడ్డుకాలమే

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వృద్ధిరేటు నెమ్మదించడంతో వాణిజ్య వాహన రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఇదే విధమైన పరిస్థితి మరో మూడు త్రైమాసికాలు కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హైర్ పర్చేజ్ అసోసియేషన్ (ఎఫ్‌ఐహెచ్‌పీఏ) పేర్కొంది. గత రెండేళ్ళలో సగటున అమ్మకాలు 50 శాతం తగ్గాయని, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 26 శాతం క్షీణత నమోదయ్యిందని ఎఫ్‌ఐహెచ్‌పీఏ ప్రెసిడెంట్ ఉమేష్ రేవంక్కర్ తెలిపారు.
 
ఈ ఏడాది రుతుపవనాలు బాగుండటంతో మరో మూడు త్రైమాసికాల తర్వాత అమ్మకాలు పెరుగుతాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. తగ్గిన ఆర్థిక వృద్ధిరేటు, పెండింగ్‌లో ఉన్న రూ. 12 లక్షల కోట్ల ప్రాజెక్టులు వంటి సమస్యలకు ప్రభుత్వం సరైన పరిష్కారాలను కనుగొంటేనే తిరిగి ఆటోమొబైల్ రంగం గాడిన పడుతుందన్నారు. రెండేళ్ళకు ఒకసారి నిర్వహించే ఎఫ్‌ఐహెచ్‌పీఏ జాతీయ సదస్సుకు ఈసారి హైదరాబాద్ వేదికయ్యింది. ఈ సందర్భంగా బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంక్కర్ మాట్లాడుతూ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలపై ఉషాథోరట్ కమిటీ చేసిన సూచనలు అమలు చేస్తే ఈ రంగంపై పెను ప్రభావం చూపుతాయని, వీటిని అమలు చేయకుండా యథాతథ స్థితిని కొనసాగించాలని ఆర్‌బీఐతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
 
 కంపెనీల నెట్‌వర్త్ పరిమితిని రెండు కోట్ల నుంచి రూ.25 కోట్లకు పెంచడం, ఎన్‌పీఏగా పరిగణించే కాలపరిమితిని 180 రోజుల నుంచి 90 రోజులకు తగ్గించడం వంటివి చిన్న స్థాయి ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల మనుగడకు ప్రమాదకరంగా పరిగణించినట్లు ఎఫ్‌ఐహెచ్‌పీఏ సెక్రటరీ జనరల్ టి.ఆర్.అచ్చా పేర్కొన్నారు. ప్రస్తుతం 2,500 సభ్యులున్న ఎఫ్‌ఐహెచ్‌పీఏ లక్ష కోట్లకు విలువైన రుణాలను మంజూరు చేసిందని, ఏటా రూ.40,000 కోట్ల రుణాలను మంజూరు చేస్తున్నట్లు రేవంక్కర్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement