
'నోట్' దిస్ పాయింట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శ్రీనాథ్.. ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. రాత్రి విధులు పూర్తి చేసుకొని ఇంటికెళ్లే సరికి.. తన కొడుక్కి సడన్‌గా జ్వరమొచ్చిందని భార్య చెప్పింది. సరే తెల్లారి ఆసుపత్రికి తీసుకెళ్దాంలే అనుకున్నాడు. కానీ అప్పుడే గుర్తొచ్చింది.. చేతిలో చిల్లి గవ్వ లేదు.. ఏటీఎంలో ఉన్నా అవేమో పనిచేయట్లేదే అని!! సర్లే తెల్లారాక చూద్దాంలే అని పడుకున్నాడు. తెల్లారాక అసలు విషయం భార్యతో చెప్పాడు. పర్లేదు నా దగ్గర రూ.1,000 నోటుంది అంది భార్య. ఇదీ సమస్యే. ముందైతే ఆసుపత్రికెళ్దామని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ద్విచక్ర వాహనంపై వెళ్తే ఇబ్బందనుకున్నారు.
ఆటోలో వెళ్దామని రోడ్డెక్కారు. ఆటో వచ్చింది కానీ, ‘‘సర్ మీ దగ్గర రూ.100 నోటుంటేనే ఎక్కండి. పెద్ద నోట్లయితే వద్దు. ఇప్పటికే ఇద్దరు ప్యాసింజర్లను వదిలేశాను’’ అన్నాడు ఆటో డ్రైవర్. చేసేదేం లేక ఇంటికెళ్లి బైక్ తీసుకొని బయల్దేరారు. తీరా ఆసుపత్రికెళ్లాక.. ‘‘దయచేసి చిల్లర ఇవ్వండి.. పెద్ద నోట్లు తీసుకోబడవు’’ అని బోర్డు చూసి కంగుతిన్నారు. ముందు డాక్టర్‌ని చూడనిద్దాం. ఫీజు సంగతి తర్వాత చూద్దాంలే అని అనుకుని డాక్టర్ వద్దకెళ్లారు. తీరా పూర్తయ్యాక.. కన్సల్టేషన్ ఫీజు కోసం చేతిలో ఉన్న రూ.1,000 నోటిస్తే.. బోర్డు చూడలేదా? అంటూ నోటు తీసుకోనన్నాడు డాక్టర్. నా దగ్గర ఈ నోటు తప్ప వేరే లేదు. కార్డుంది కావాలంటే స్వైప్ చేయడన్నాడు శ్రీనాథ్.
కానీ, డాక్డర్ వద్ద స్వైప్ మిషన్ లేదు. ముందెళ్లి మందులు తీసుకో.. ఆ తర్వాత వచ్చి ఫీజు ఇవ్వమన్నాడు డాక్టరు. సరే అని మందుల షాపుకెళ్తే పెద్ద నోటు మార్చడానికి రూ.100 అదనంగా చార్జీ చేశాడు షాపతను. చేసేదేంలేక చేతి చమురు వదిలించుకొని బైక్ వద్దకెళితే బండిలో పెట్రోల్ నిండుకుంది. దగ్గర్లోని బంకుకెళితే.. చాంతాడంత క్యూ. సరే అని తన వంతొచ్చేదాకా వెరుుట్ చేస్తే.. ఫుల్ ట్యాంక్ తప్ప చిల్లరకు పెట్రోల్ పోయలేమన్నారు. ఇక్కడా చేసేదేం లేక జేబు గుల్ల చేసుకొని ఇంటికి తిరిగొచ్చారు. రూ.1,000తో ఇంట్లోంచే బయటికెళితే.. డాక్టర్ ఫీజు, మందులు, పెట్రోల్, ఎక్స్‌ట్రా చార్జీలు పోగా.. రూ.100తో ఇంటికి చేరాడు.
.. ఇది జరిగిన ఘటన. సామాన్యుడి యాతనకు నిదర్శనం.
నిత్యావసరాలన్నిటికీ పాత నోట్లు
చెల్లుతాయని చెబుతున్నారు. నిజమా?
ఈ నెల 11వ తేదీ వరకూ పాత రూ.500, రూ.1,000 నోట్లు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ రంగ చమురు సంస్థల పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, ఔషధ దుకాణాలు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో చెల్లుతాయని ప్రభుత్వం చెబుతోంది. పైన చెప్పిన వాటిల్లో సామన్యుడికి రోజువారీ అవసరమైంది పెట్రోల్ బంకే. మరి ప్రభుత్వం లేదా చమురు సంస్థలు నేరుగా నడుపుతున్న పెట్రోల్ బంకులు దేశంలో ఎన్నున్నాయి? వాటికి ఎందరు వెళ్లగలరు? ఎంతమందికని వారు చిల్లర ఇవ్వగలరు?
నిజానికి పెద్ద నోట్లు రద్దయిన రాత్రి నుంచే పెట్రోల్ బంకుల్లో జనాలు క్యూ కట్టారు. దీంతో కొన్ని బంకులు ఇదే అదనుగా పెట్రోల్ రేట్లను కృత్రిమంగా పెంచేశాయి. ఇంకొన్ని తమ వద్ద చిల్లర లేదంటూ కస్టమర్లను తిరిగి పంపేశాయి. ఇంకొన్ని ఫుల్ ట్యాంక్ అరుుతేనే కొడతామని చెప్పాయి. అవసరం నిమిత్తం కొందరు వాహనదారులు కావాల్సినంత పెట్రోల్ పోయించుకొని రూ.500 నోటు ఇచ్చి చిల్లర లేదనటంతో ఏం చేయలేక వదిలేసి వెళ్లిపోయిన వారూ ఉన్నారు. ఈ రకంగానూ సామాన్యుడి జేబుకే చిల్లు పడింది. టోల్‌ప్లాజా వద్ద కూడా ఇదే పరిస్థితి. తగినంత చిల్లర లేకపోవటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు.
అన్ని వర్గాలకూ అష్టకష్టాలు..
శుభకార్యం కోసమని ఇంట్లో డబ్బులు పెట్టుకుంటే ఏం చేయాలి? కొత్త నోట్లెలా వస్తారుు? చేతిలోని పెద్ద నోట్లను బ్యాంకుల్లో వేసి, కొత్త నోట్లు తీసుకోవటం పెద్ద కసరత్తే. మరి ఇంట్లో శుభకార్యం కోసమని బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసో, స్నేహితుల నుంచి అప్పోసప్పో చేసి ఇంట్లో పెట్టుకున్నవారి పరిస్థితేంటి? చాలామంది పెళ్లిళ్లలకు, శుభకార్యాలకు సరైన రోజులు కావటంతో అడ్వాన్‌సలు, ఖర్చుల కోసమని భారీగా నగదును బ్యాంకు నుంచి డ్రా చేసి ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు అడ్వాన్‌స ఇవ్వటానికి వెళితే పెద్ద నోట్లు తీసుకోలేమని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక ప్రయాణాల్లో ఉన్న వారి పరిస్థితి మరీ దారుణం. విహారయాత్రలు, పుణ్య క్షేత్రాలకు వెళ్లిన వారు చేతిలో ఉన్న పెద్ద నోట్లు ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఊరు కాని ఊళ్లో పరిచయస్తులు కూడా లేని ప్రాంతాల్లో గమ్యస్థానాన్ని చేరుకునేందుకు, తినడానికి తిండీ లేక నరకయాతన అనుభవించారు. బ్యాంకు ఖాతాల్లో అయితే ఎంతైనా డిపాజిట్ చేయొచ్చు. ఖాతాలు లేనివారికి, నగదు అవసరమైన వారికి రోజుకు రూ.4 వేలు మాత్రమే ఎక్స్‌చేంజ్ చేస్తామని చెబుతున్నారు. అంతకన్నా ఎక్కువ అవసరమైనవారి సంగతేంటి? నోట్ల మార్పునకు ఈ నెల 24 వరకు పరిమితిని రూ.4 వేలుగా విధించారు. కానీ దేశంలో రోజుకు రూ.4 వేలకన్నా ఎక్కువ ఖర్చుచేసేవారు చాలా మంది ఉన్నారు. దీనివల్ల తొలి రోజే దేశంలో 70 శాతం వ్యాపారం పడిపోయిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నారుు.
ఎప్పుడూ ట్రాఫిక్‌తో, వ్యాపారాలతో కిటకిటలాడే హైదరాబాద్‌లో రోడ్లు సైతం ఖాళీగా కనిపించారుు. చాలా మంది చేతిలో ఉన్న సొమ్ముతో నిత్యావసర కొనుగోళ్లకే మొగ్గు చూపారు. దీంతో రెస్టారెంట్లు, బార్ షాపులు, వైన్‌షాపులు, సినిమా థియేటర్లు వెలవెలబోయారుు. క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగం, ఆన్‌లైన్ చెల్లింపుల వంటి ఎలక్ట్రానిక్స్ చెల్లింపులకు ఎలాంటి అంతరాయం, పరిమితి లేదని ప్రభుత్వం ప్రకటించింది. కానీ దేశంలో వీటిద్వారా జరుగుతున్న జరుగుతున్న లావాదేవీలు 52 శాతమే. అది కూడా అధికారికంగా నమోదైనవి మాత్రమే.
గురువారం (ఈ నెల 10) నుంచి డిసెంబర్ 30 వరకు మన చేతిలో ఉన్న పాత రూ.500, రూ.1,000 నోట్లను బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చన్నారు. ఈ సొమ్మునంతా ఒకేసారి క్యాష్ రూపంలో విత్‌డ్రా చేసుకోవచ్చా?
సమాధానం: కుదరదు. ఒక వ్యక్తికి రోజుకు రూ.4 వేలు మాత్రమే నగదు రూపంలో తీసుకునే వీలుంది. మిగిలిన సొమ్మును మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.
నా వ్యక్తిగత అవసరాలకు రూ.4,000 సొమ్ము సరిపోదు. మరిప్పుడేం చేయాలి నేను?
డెబిట్, క్రెడిట్, ఆన్‌లైన్ వంటి ఎలక్ట్రానిక్ చెల్లింపులు చేసుకోవచ్చు. మొబైల్ వాలెట్స్, చెక్, డీడీ రూపంలోనూ వినియోగించుకునే వీలుంది.
రూ.4,000లకు పైన సొమ్ము కావాలంటే బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. మరి నాకు ఖాతా లేకుంటే?
భయపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర్లోని ఏదైనా బ్యాంకుకు వెళ్లండి. కేవైసీ నిబంధనలను పూర్తి చేసి.. బ్యాంకు ఖాతాను తెరవండి. ఆపైన చెల్లింపులు చేసుకోవచ్చు.
ఒకవేళ నాకు కేవలం జన్‌ధన్ ఖాతా మాత్రమే ఉంటే?
జన్‌ధన్ ఖాతా నిబంధనలు, విధానాలకు అనుగుణంగా ఆయా ఖాతాలో నగదును వేసుకునే వీలుంది.
పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఎక్కడికి వెళ్లాలి?
రిజర్వ్ బ్యాంక్, కమర్షియల్ బ్యాంకులు, స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులు
అకౌంట్ ఉన్న బ్యాంకుకు కాకుండా ఇతర బ్యాంకుకు వెళ్లవచ్చా?
తప్పుకుండా వెళ్లవచ్చు. కానీ, సరైన గుర్తింపు కార్డు, మీ బ్యాంక్ ఖాతా వివరాలను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
నాకు వ్యక్తిగతంగా బ్యాంక్ ఖాతా లేదు. కానీ, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అకౌంట్ ఉంది. మరి నా వద్ద ఉన్న సొమ్మును వారి ఖాతాల్లో జమ చేయవచ్చా?
చేసుకోవచ్చు. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల ఖాతాలో పాత పెద్ద నోట్లను జమ చేసుకునే వీలుంది. కానీ, మీరు లిఖితపూర్వకంగా రాసిన అనుమతి పత్రాన్ని సంబంధిత అధికారులకు చూపించాల్సి ఉంటుంది.
నోట్ల మార్పు, నగదు ఉపసంహరణకు వ్యక్తిగతంగా వెళాల్సిందేనా? లేక రిప్రజెంటివ్‌ను పంపిస్తే సరిపోతుందా?
సాధ్యమైనంత వరకూ వ్యక్తిగతంగా వెళ్లటమే ఉత్తమం. వెళ్లలేని పక్షంలో మీ రిప్రజెంటివ్‌ను పంపించొచ్చు. కానీ, ఖాతాదారుని వివరాలు, గుర్తింపు కార్డుతో పాటూ రిప్రజెంటివ్ గుర్తింపు కార్డు, వివరాలనూ సమర్పించాల్సి ఉంటుంది.
ఏటీఎం, క్యాష్ డిపాజిట్ మిషన్ల ద్వారా క్యాష్‌ను డిపాజిట్ చేయవచ్చా?
నిరభ్యంతరంగా చేసుకోవచ్చు.
పాత రూ.1,000, రూ.500 నోట్లను మార్చుకునేందుకు ఎంత సమయం ఉంది?
డిసెంబర్ 30 లోగా పెద్ద నోట్లను బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి మార్చుకోవచ్చు. ఒకవేళ ఆ తేదీలోగా మార్చుకోలేని పక్షంలో... అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద 2017 మార్చి 31వరకూ మార్చుకోవచ్చు.
ప్రస్తుతం నేను ఇండియాలో లేను. మరి నేనేం చేయాలి?
మీ వద్ద ఇండియన్ కరెన్సీకి ఉండి.. అది కూడా పెద్ద నోట్లు ఉంటే.. వాటిని తీసుకొని ఏదైనా బ్యాంకుకు వెళ్లి మార్చుకోవచ్చు. సంబంధిత వ్యక్తి గుర్తింపు కార్డును ఇచ్చి! లేదా మీకు తెలిసిన వారి బ్యాంక్ ఖాతాలోనూ ఆన్‌లైన్ ద్వారా మీరే జమ చేయవచ్చు.
ఏ గుర్తింపు కార్డులను సమర్పించాల్సి ఉంటుంది?
ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కార్డులు, డ్రైవింగ్ లెసైన్‌స, పాస్‌పోర్ట్, ఎన్‌ఆర్‌ఈజీఏ కార్డు, లేదా ప్రభుత్వం ఆమోదించిన ఏదైనా గుర్తింపు కార్దు లేదా పబ్లిక్ సెక్టార్ తమ ఉద్యోగులకిచ్చే గుర్తింపు కార్డునూ సమర్పించవచ్చు.
నేను ప్రవాస భారతీయుడిని. నాకు దేశంలో ఎన్నారై ఖాతా ఉంది? నా వద్ద ఉన్న పెద్ద నోట్లను ఎన్నారై ఖాతాలో జమ చేసుకోవచ్చా?
తప్పకుండా చేసుకోవచ్చు. కానీ, మీ ఎన్నారై ఖాతా అకౌంట్‌లోనే జమ చేసుకోవాల్సి ఉంటుంది.
నేను విదేశీ పర్యాటకుడిని. నా వద్ద రూ.1,000, రూ.500 నోట్లు ఉన్నారుు. మరిప్పుడు నేనేం చేయాలి?
అంతర్జాతీయ విమానాశ్రయాల్లో, ఫారెన్ ఎక్స్ఛేంజ్ సెంటర్లలో రూ.5 వేల వరకూ నగదును మార్చుకోవచ్చు. మీ వ్యక్తిగత వివరాలు, గుర్తింపు కార్డు అందించాల్సి ఉంటుంది.
ఆసుపత్రి, మందులు, ట్రావెల్ వంటి అత్యవసరాల సేవల నిమిత్తం నగదు అవసరం మరి నేనిప్పుడు ఏం చేయాలి?
ఈ నెల 11వ తేదీ వరకు ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ చమురు సంస్థల పరిధిలోని పెట్రోల్ బంకులు, గ్యాస్ కేంద్రాలు, మెడిసిన్ షాపులు, పాల కేంద్రాలు, సహకార స్టోర్లు, శ్మశాన వాటికల్లో మీ చేతిలో ఉన్న పాత రూ.1,000, రూ.500 నోట్లు చెల్లుబాటు అవుతాయి. రైల్వే కౌంటర్లు, బస్టాండుల్లో, విమానాశ్రయాల్లో టికెట్లను కూడా కొనుగోలు చేయవచ్చు.
మీ దగ్గరున్న పెద్ద నోట్లను అప్పగించండని చెప్పి.. తీరా నా సొమ్మును ఒకేసారి తీసుకునే వీలులేకపోవటమేంటి?
నల్లధన ప్రవాహానికి ప్రధాన కారణం నగదు చెల్లింపులే. అందుకే నగదు చెల్లింపులను పూర్తిగా రూపుమాపాలనే ధ్యేయంతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారు. అలా అని మీ దగ్గరున్న సొమ్ము మొత్తాన్ని తీసుకొని ఒకేసారి కొత్త నోట్లను మీకిస్తే.. మిగిలిన ప్రజలకు ఇబ్బంది అవుతుంది. పెపైచ్చు ప్రజలందరికీ సరిపడేంత కొత్త నోట్లను ముద్రించలేదు.
అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు మాత్రమే వెళ్లాలా?
నోట్ల మార్పునకు అది కూడా రూ.4 వేల వరకై తే ఏ బ్యాంకుకు వెళ్లినా పర్వాలేదు. కానీ గుర్తింపు కార్డును వెంట తీసుకెళ్లాలి. ఒకవేళ మీకు రూ.4 వేలకు మించి అది కూడా మీ ఖాతాలో జమ చేస్తే చాలనుకుంటే మాత్రం.. మీ అకౌంట్ ఉన్న బ్యాంక్‌కు గానీ లేదా సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌కు గానీ వెళ్లవచ్చు.
చెక్ రూపంలో బ్యాంక్‌లో నగదును డ్రా చేసుకోవచ్చా?
తప్పకుండా చేసుకోవచ్చు. కానీ, చెక్ రూపంలో రోజుకు రూ.10 వేలు, గరిష్టంగా వారానికి రూ.20 వేలు మించి డ్రా చేయటానికి వీల్లేదు. (ఇందులో ఏటీఎం నుంచి డ్రా చేసిన సొమ్ము కూడా కలుస్తుంది) ఈ నిబంధన ఈనెల 24 వరకూ ఉంటుంది. ఆ తర్వాత పరిమితిని పెంచే అవకాశముంది.)
ఏటీఎం నుంచి నగదును డ్రా చేసుకోవచ్చా?
ప్రస్తుతమైతే రెండు రోజుల పాటు ఏటీఎంలు పనిచేయవు కాబట్టి డ్రా చేయలేరు. ఏటీఎంలు పనిచేయటం మొదలెట్టాక.. డ్రా చేసుకునే వీలుంది. కానీ, రోజులో ఒక్కో కార్డుపై రూ.2,000లకు మించి డ్రా చేయటానికి వీల్లేదు. ఈనెల 18వ తేదీ వరకూ ఈ నిబంధన ఉంటుంది. ఆ తర్వాత రోజు నుంచి రోజుకు ఒక్కో కార్డుపై రూ.4,000 వరకూ నగదును తీసుకోవచ్చు.
నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్
న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రూ.500, 1000లను ఉపసంహరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైంది. ఇది ప్రజల జీవించే హక్కు, వ్యాపార నిర్వహణ, తదితర హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని పిటిషనర్ ఆరోపించారు. పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు కనీస సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు. పాతనోట్ల తొలగింపు ప్రక్రియలో ప్రభుత్వం సహజ న్యాయసూత్రాలకు కట్టుబడలేదని తెలిపారు. ఫలితంగా సాధారణ పౌరుల వ్యాపారం, విద్య, దైనందిన జీవితంలో గందరగోళం నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయడమో లేదా ప్రజలు పాతనోట్లు మార్చుకోవడానికి తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఢిల్లీ లాయర్ వివేక్ నారాయణ్ శర్మ దాఖలుచేసిన ఈ పిటిషన్ ఈ వారంలోనే విచారణకొస్తుంది.
హైకోర్టులోనూ వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని, ప్రజల ప్రాథమిక హక్కులకు విఘాతం కల్గించే విధంగా ఉందంటూ హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది కె.శ్రీనివాస్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కేంద్రం నిర్ణయంతో సామాన్యుడి జీవితం స్తంభించిందని, నిత్యావసరాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ జారీచేసేందుకు అవకాశం కల్పించిన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని సెక్షన్ 26(2)ను రద్దు చేయాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను భోజన విరామ సమయంలో అత్యవసరంగా విచారించాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ శంకర్ నారాయణలతో కూడిన ధర్మాసనం ముందు పిటిషనర్ తరఫు న్యాయవాది పీవీ కృష్ణయ్య అభ్యర్థించినా ధర్మాసనం నిరాకరిస్తూ గురువారం విచారిస్తామని స్పష్టం చేసింది.
పెద్ద నోట్ల నిబంధనలు, వివరాల మరింత
సమాచారం కోసం
డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్‌బీఐ.ఓఆర్‌జీ.ఇన్
లేదా 022 22602201/022 22602944 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.