‘నోట్ల’ కష్టాలకు నెల.. | Rs 500, Rs 1,000 ban affect on middle class familys | Sakshi
Sakshi News home page

‘నోట్ల’ కష్టాలకు నెల..

Published Fri, Dec 9 2016 2:05 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM

‘నోట్ల’ కష్టాలకు నెల.. - Sakshi

‘నోట్ల’ కష్టాలకు నెల..

రూ.500, 1,000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నవంబర్ 8న అకస్మాత్తుగా ప్రక టన చేశారు. ఆ రోజు అర్ధరాత్రి తర్వాత ఆ నోట్లేవీ చెల్లబోవంటూ షాకిచ్చారు.  ఈ నిర్ణ యం అమల్లోకి వచ్చి నెల రోజులు పూర్తయింది. నల్లధనం వెలికితీత, నకిలీ కరెన్సీ కట్టడి కోసమంటూ నోట్లను రద్దు చేసినా.. సాధారణ ప్రజలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకులు, ఏటీఎంల ఎదుట గంటలకొద్ది క్యూలైన్లు.  ‘నోట్ల’ సమస్య వల్ల దేశవ్యాప్తం గా వంద మందికిపైగానే ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా.    
 
 నవంబర్ 8
 500, 1,000 నోట్లను రద్దు చేస్తున్నటు ప్రధాని ప్రకటన. ఆ రోజు అర్ధరాత్రి నుంచే ఆ నోట్లు చెల్లబోవని వెల్లడి. డిసెంబర్ 30 వరకు పాత నోట్లు మార్చుకోవడానికి అవకాశం. ‘నోట్ల’లెక్కలు తేల్చడానికి మరుసటి రోజున బ్యాంకులకు సెలవు, రెండు రోజులపాటు ఏటీఎంల మూసివేత ప్రకటన.  పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, ఆసుపత్రులు, మెడికల్ షాప్‌లు, విమాన- రైల్వే టిక్కెట్లు, శ్మశాన వాటికలు, ప్రభుత్వ సేవలకు మూడు రోజులపాటు (11వ తేదీ వరకు) పాత నోట్లతో చెల్లింపులకు అవకాశం. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఒక్కొక్కరు రోజుకు రూ.4 వేలు పాత నోట్ల మార్పిడికి అవకాశం. ఏటీఎంలలో రోజుకు రూ.2 వేలు, బ్యాంకుల్లో రోజుకు రూ.10 వేలు విత్‌డ్రా పరిమితులు. మొత్తంగా వారానికి రూ.20 వేలే తీసుకోగలిగేలా ఆంక్షలు. చెక్కులు, డీడీలు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలు, ఆన్‌లైన్ లావాదేవీలపై పరిమితి విధించలేదు.
 
 నవంబర్ 9
 బ్యాంకులు,ఏటీఎంలు పనిచేయలేదు. ప్రజల్లో ఆందోళన. బ్యాం కుల్లో నగదు మార్పిడి కోసం ఏదైనా గుర్తింపుకార్డు ప్రతి సమ ర్పించాలంటూ నిబంధనలు. 11వ తేదీ అర్ధరాత్రి వరకూ   టోల్ వసూలు నిలిపివేత. రూ.2.5 లక్షలు దాటిన, లెక్కలు చూపని డిపాజిట్లపై పన్ను, జరిమానా వసూలు చేస్తామని ప్రకటన.
 
 నవంబర్ 10
 కష్టాలు షురూ. డిపాజిట్లు, నగదు మార్పిడి కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు. కొత్త రూ.2 వేల నోట్లు జనంలోకి వచ్చాయి. ఏటీఎంల మూత.
 
 నవంబర్ 11
 తొలిసారిగా తెరుచుకున్న ఏటీఎంలు. భారీ క్యూలైన్లు. కొత్త రూ.2 వేల నోట్లకు అనుగుణంగా ఏటీఎంలు లేకపోవడంతో.. అన్నీ వంద నోట్లే నింపిన అధికారులు. కొంత సేపటికే ఖాళీ. ప్రజలకు ఇబ్బందులు. పలు రంగాల్లో పాత నోట్ల వినియోగానికి ఇచ్చిన అవకాశాన్ని, టోల్ వసూలు నిలిపివేతను నవంబర్ 14 అర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ నిర్ణయం.
 
 నవంబర్ 12

 బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంల వద్ద జనం అవస్థలు. నల్లధనం నియంత్రణకు మరిన్ని చర్యలుంటాయన్న ప్రధాని.
 
 నవంబర్ 13
 ఆదివారం పనిచేసిన బ్యాంకులు. పెరిగిన క్యూలైన్లు. ఏటీఎం, బ్యాంకుల్లో నగదు లేకపోవడంతో జనంలో ఆగ్రహావేశాలు. నగదు మార్పిడి పరిమితి రూ.4,500కు, ఏటీఎంల నుంచి విత్‌డ్రా పరిమితి రూ.2,500కు, బ్యాంకుల్లో రోజుకు రూ.10వేల విత్‌డ్రా పరిమితిని ఎత్తివేస్తూ... వారానికి విత్‌డ్రా పరిమితి రూ.24,000కు పెంపు.  కొత్త రూ.500 నోట్లు మార్కెట్లోకి.
 
 నవంబర్ 14

 పెట్రోల్ బంకులు, ప్రభుత్వ సేవలు సహా పలు రంగాల్లో పాత నోట్లతో చెల్లింపులను నవంబర్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం. కరెంట్ ఖాతాల నుంచి విత్‌డ్రా పరిమితి వారానికి రూ.50 వేలకు పెంపు. గురునానక్ జయంతి సందర్భంగా మూసి ఉన్న బ్యాంకులు. ఏటీఎంల వద్ద క్యూలైన్లు.  పలు చోట్ల ఆందోళనలు వ్యక్తం చేసిన ప్రజలు ఠి ఏటీఎం ట్రాన్సాక్షన్ చార్జీలను డిసెంబర్ 30వ తేదీ వరకూ ఎత్తివేస్తూ నిర్ణయం.
 
 నవంబర్ 15
 కొనసాగిన క్యూలైన్లు. తొలి వారంలో ఏకంగా రూ.1,14,139 కోట్లు డిపాజిట్లు వచ్చినట్లు ఎస్‌బీఐ ప్రకటన.
 
 నవంబర్ 17
 నగదుమార్పిడి పరిమితి రూ.2,000కు కుదింపు. వివాహాల కోసం రూ.2.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చంటూ ప్రకటన. రైతులకు విత్‌డ్రా పరిమితి వారానికి రూ.50 వేలకు పెంపు. టోల్ వసూళ్ల నిలిపివేతను నవంబర్ 24 వరకు పొడిగిస్తూ నిర్ణయం. ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో డెబిట్ కార్డుల ద్వారా రూ.2 వేల వరకు తీసుకునే అవకాశం. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఒకశాతం తగ్గించిన పలు బ్యాంకులు
 
 నవంబర్ 18
 ‘నోట్ల రద్దు’తో 55 మంది మరణించారంటూ పార్లమెంటులో విపక్షాల గొడవ. ఢిల్లీలో ఆందోళనలు.
 
 నవంబర్ 22
 బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పాత నోట్ల మార్పిడి నిలిపివేత.  డిపాజిట్లకే అవకాశం. టోల్ వసూళ్ల నిలిపివేతను డిసెంబర్ 2 అర్ధరాత్రి వరకూ పొడిగిస్తూ ప్రకటన. పలు రంగాల్లో పాత నోట్లతో చెల్లింపులు డిసెంబర్ 15 వరకు పొడిగింపు.
 
 నవంబర్ 25
 రిజర్వుబ్యాంకు శాఖల్లో మాత్రం నోట్ల మార్పిడి కొనసాగిస్తూ ప్రకటన. అటు జన్‌ధన్ ఖాతాల్లోకి కేవలం 14 రోజుల్లో రూ.27,200 కోట్లు డిపాజిట్ అయినట్లు 26న కేంద్రం వెల్లడి
 
 నవంబర్ 28
 మూడు వారాల్లో రూ.8.45 లక్షల కోట్లు పాత నోట్లు డిపాజిట్ అరుునట్లు ఆర్‌బీఐ ప్రకటన. కొనసాగిన క్యూలైన్లు.
 
 నవంబర్ 30
 జన్‌ధన్ ఖాతాల్లోంచి నెలకు రూ.10 వేల విత్‌డ్రా పరిమితి విధించిన ఆర్‌బీఐ.
 
 డిసెంబర్ 1
 తార స్థాయికి కష్టాలు. వేతనాలు తీసుకోవడానికి ఉద్యోగులకు ఇబ్బందులు. ఒక్కొక్కరికి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకే ఇచ్చిన బ్యాంకులు. పెట్రోల్ బంకులు, విమాన టికెట్లు వంటి వాటిలో పాత నోట్ల చెల్లుబాటు గడువును 2వ తేదీ అర్ధరాత్రి వరకు కుదింపు (తొలుత డిసెంబర్ 15 వరకు గడువిచ్చారు).
 
 డిసెంబర్ 6
 నోట్ల రద్దు’ తర్వాత రూ.2 వేల కోట్ల లెక్కల్లో చూపని ధనాన్ని వెల్లడించినట్లు ఆదాయ పన్ను శాఖ ప్రకటన. తమ దాడుల్లో రూ. 130 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు గుర్తించినట్లు వెల్లడి.
 
 డిసెంబర్ 7
 బ్యాంకుల్లోకి రూ.11.55 లక్షల కోట్లు డిపాజిట్ అయినట్లు ప్రకటించిన రిజర్వు బ్యాంకు.
 
 డిసెంబర్ 8
 ‘నోట్ల’ ఇబ్బందులను తట్టుకునేందుకు నగదు రహిత లావా దేవీలను ప్రోత్సహిస్తూ పలు ఉపశమన చర్యల ప్రకటన

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement