
లిబియాలో బందీల విడుదలపై అయోమయం
లిబియాలో బందీల విడుదలపై అయోమయం వీడలేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ,
హైదరాబాద్: లిబియాలో బందీల విడుదలపై అయోమయం వీడలేదు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు తిరువీధుల గోపీకృష్ణ, చిలువేరు బలరాం కిషన్‌లు జూలై 29న ట్రిపోలి మీదుగా స్వస్థలానికి తిరిగి వస్తున్న సమయంలో ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదులు అపహరించిన విషయం తెలిసిందే. ఇద్దరు ప్రొఫెసర్లను శుక్రవారం రాత్రి ఏడు గంటలకు విడిచిపెడతారని విదేశాంగశాఖ ప్రకటించటంతో ఇరుకుటుంబాల సభ్యులు ఆశగా ఎదురుచూశారు. శనివారం రాత్రి వరకూ విడుదలకు సంబంధించి పురోగతి లేకపోవటంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి ఇరు కుటంబాల సభ్యులను పరామర్శించిన సందర్భంలోనూ గోపీకృష్ణ భార్య కల్యాణి, బలరాం కిషన్ భార్య శ్రీదేవి కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమ భర్తల విడుదలపై ఎవరూ కిమ్మనటం లేదంటూ ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు.
రేపు ఢిల్లీ వెళ్లనున్న బందీల కుటుంబాలు
కాగా సోమవారం ఉదయం ఎంపీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఇరు కుటుంబాల సభ్యులు ఢిల్లీ బయలుదేరి వెళ్లి ప్రధాని మోదీ, మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలవనున్నారు.ఈ మేరకు వారి అపాయింట్‌మెంట్‌ను కోరారు.
ప్రొఫెసర్ల కుటుంబాలను ఓదార్చిన బాబు
కిడ్నాప్‌కు గురైన తెలుగు ప్రొఫెసర్ల కుటుంబసభ్యులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ఓదార్చారు. మల్కాజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి ప్రొఫెసర్ల కుటుంబసభ్యులను సీఎం క్యాంప్ కార్యాలయానికి తీసుకొచ్చారు. కిడ్నాప్‌కు గురై చాలా రోజులు గడిచినా ఇంకా విడుదల కాకపోవటంపై వారు ఆందోళన వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం మాట్లాడుతూ ప్రొఫెసర్ల విడుదలకు ప్రభుత్వం తమ వంతు ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు వీరిద్దరి కిడ్నాప్‌పై ఎప్పటికపుడు సమాచారం తెలుసుకుంటున్నారని, ఇద్దరూ తిరిగి వస్తారని వారికి ధైర్యం చెప్పారు.