రాహుల్‌పై మాజీ సీఎం ఇబ్బందికర వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలను ఇరకాటంలో పడేశాయి. షీలా దీక్షిత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాహుల్ ఇంకా పరిణతి చెందలేదని, మరికొంత సమయం పడుతుందని వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీ కూటమి.. బీజేపీతో హోరాహోరీగా పోరాడుతుండటం, రాహుల్-యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ కలసి ఎన్నికల ర్యాలీలలో పాల్గొంటున్న సమయంలో షీలా ఇలా మాట్లాడటం ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టయ్యింది. బీజేపీ నాయకులు ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకుండా రాహుల్‌ను విమర్శిస్తుంటారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ వ్యాఖ్యలను ఓ ర్యాలీలో ప్రస్తావించారు. షీలా దీక్షిత్ తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ నాయకులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. రాహుల్ నాయకత్వంపై కాంగ్రెస్ పార్టీలోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని వీడిన రీటా బహుగుణతో పాటు జయంతి నటరాజన్ తదితర సీనియర్ నేతలు రాహుల్‌పై నేరుగా విమర్శలు చేస్తున్నారు.