ప్లీజ్ కూర్చోండి.. వెళ్లిపోవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఘోర పరాభవం ఎదురైంది. సభకు వచ్చిన ఐదు వేల మందిలో చాలా మంది ఆయన ప్రసంగానికి ముందే లేచి వె ళ్లబోయారు. ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ స్వయంగా బతిమాలుకోవడంతో వారంతా కాస్త ఓపిక తెచ్చుకున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అంబేద్కర్ నగర్‌లో షీలా అధ్యక్షతన ర్యాలీ నిర్వహించారు. సభనుద్దేశించి షీలా తన ప్రసంగంలో భాగంగా తమ ప్రభుత్వ అభివృద్ధి పనులు ఏకరువు పెట్టడం ప్రారంభించారు. అప్పటికే విసుగు చెందిన మహిళలు లేచి వెళ్లిపోబోయారు.
ముఖ్య అతిథి రాహుల్ ప్రసంగం వినకుండానే వెళుతున్న వారిని ఎలా కూర్చోబెట్టాలో తెలియక చివరకు ఆమె తన ప్రసంగాన్ని ఆపి ‘దయచేసి 10 నిమిషాలు కూర్చోండి. రాహుల్ మాట్లాడతారు’ అని బతిమిలాడగా కొందరు కూర్చున్నారు. దీంతో రాహుల్ ప్రసంగిస్తూ మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారిని బీజేపీ, శివసేనలు లక్ష్యంగా చేసుకుంటూ వారిని తరిమేస్తున్నాయని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అందరినీ సోదరుల్లా కలుపుకుపోతున్నామన్నారు. షీలాకు నాలుగో విడత అధికారం అందించాలని రాహుల్ కోరారు.