మధ్యయుగాల నాటి మైండ్‌సెట్ మార్చుకోవాలి: రాహుల్ గాంధీ
రాహుల్ మహిళా దినోత్సవ సందేశం
న్యూఢిల్లీ: మహిళలు సాధికారికత సాధించాలంటే దేశంలోని మధ్యయుగాల నాటి ఆలోచనా ధోరణిని మార్చాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ఒక ప్రకటనలో సాధికారిత కోసం మహిళలు చేస్తున్న పోరాటాన్ని కొనియాడారు. మహిళల్లో ధైర్యం, ద్రుఢసంకల్పం, పట్టుదల ప్రతీచోటా కనిపిస్తున్నాయన్నారు.
అయితే వారికి సంఘంలో సరైన స్థానం కల్పించడానికి మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. మహిళలు శక్తిమంతులు కాకుండా భారత్ సూపర్ పవర్ కాలేదన్నారు. సంఘంలో, వ్యాపారాల్లో, రాజకీయాల్లో మహిళలు తమ స్థానాన్ని గుర్తెరగాలన్నారు. మహిళలు ఎదగడానికి ప్రభుత్వం, ప్రజా సంఘాలు, రాజకీయనాయకులు సహాయం చేయాలని సూచించారు.